పాండవులు పాండవులు పచ్‌మఢీ

29 May, 2016 02:48 IST|Sakshi
పాండవులు పాండవులు పచ్‌మఢీ

టూర్‌దర్శన్ - సమ్మర్ స్పెషల్ - పచ్‌మఢీ
నలువైపులా విస్తరించిన ఎత్తయిన కొండలు... కొండల నడుమ లోతైన లోయలు... దట్టమైన అడవులు... అడవుల్లో యథేచ్ఛగా సంచరించే వన్యప్రాణాలు... కొండల పైనుంచి ఉధృత వేగంతో నేలపైకి ఉరకలు వేసే జలపాతాలు... సహజ సరోవరాలు... కొండ గుహలలో ప్రాచీన మానవులు చిత్రించిన చిత్రాలు... ఎటు చూసినా ప్రకృతి గీసిన సజీవ చిత్రాల్లాంటి దృశ్యాలను ఒకే చోట చూసి ఆనందించాలని ఉందా..? అయితే పదండి పచ్‌మఢీకి.
 
ఏం చూడాలి?
దేశానికి నడిబొడ్డున సత్‌పురా పర్వతాల నడుమ వెలసిన అద్భుత ప్రదేశం పచ్‌మఢీ. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో ఉంది. బ్రిటిష్ కాలంలో ఇది సైనిక స్థావరంగా ఉండేది. పచ్‌మఢీకి ఈ పేరు ‘పాంచ్’ (ఐదు), ‘మఢీ’ (గుహలు) అనే అర్థంలో వచ్చిందని చెబుతారు. ‘పాంచ్‌మఢీ’ కాలక్రమంలో పచ్‌మఢీగా మారిందని అంటారు. సముద్రమట్టానికి 2500 అడుగుల ఎత్తులో ఉన్న పచ్‌మఢీ వాతావరణం వేసవిలోనూ చల్లగానే ఉంటుంది. వేసవిలో జూన్ నెలాఖరు వరకు ఈ ప్రాంతంలోని వాతావరణం పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది.
 
పంచ పాండవులు తమ అరణ్యవాస కాలంలో ఇక్కడి ఐదు గుహలలో ఉండేవారని ప్రతీతి. ఇక్కడి జలపాతాల దిగువన ఏర్పడిన కొలనును ‘ద్రౌపదీ కుండం/పాంచాలీ కుండం’ అంటారు. మహాభారత గాథతో ముడిపడిన ఈ ప్రదేశాలను పచ్‌మఢీకి వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించుకుంటారు.
 
సత్‌పురా పర్వతశ్రేణుల్లోనే అత్యంత ఎత్తయిన శిఖరం ‘ధూప్‌గఢ్’ ఇక్కడే ఉంది. ఈ శిఖరం పైనుంచి చూస్తే పచ్‌మఢీ పట్టణంతో పాటు చుట్టుపక్కల కొండలు, లోయలు కనువిందు చేస్తాయి. పర్వతారోహణపై మక్కువ గలవారిని ఈ శిఖరం ఎంతో ఆకట్టుకుంటుంది.
 
సత్‌పురా పర్వతశ్రేణుల్లో ఎక్కడికక్కడ కనిపించే జలపాతాలు పచ్‌మఢీలోనూ చాలానే కనిపిస్తాయి. పచ్‌మఢీ కొండల మీదుగా దూకే బీ, డచెస్, రజత్ ప్రపాత్, అప్సరా జలపాతాల అందాలను చూసి తీరాల్సిందే. వేసవిలో ఈ జలపాతాల వద్ద పర్యాటకులు జలకాలాడటానికి ఇష్టపడతారు.
 
ధూప్‌గఢ్ శిఖరానికి దిగువన చేరిన జలపాతాల నీటితో సహజసిద్ధంగా ఏర్పడిన మంచినీటి సరస్సు బోటింగ్‌కు అనువుగా ఉంటుంది. ఈ సరస్సులో పడవ ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలను తిలకించడం అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది.
 
పచ్‌మఢీ చుట్టూ విస్తరించుకున్న సత్‌పురా జాతీయ అభయారణ్యంలో అరుదైన జాతులకు చెందిన వృక్షాలు, మొక్కలు, లతలు, వన్యప్రాణులు కనిపిస్తాయి. ‘ఇండియన్ జెయింట్ స్క్విర్రల్’గా పిలుచుకునే భారీ ఉడుతలు, పులులు, చిరుతలు, జింకలు, దుప్పులు, కణుజులు, ఎలుగుబంట్లు, ఏనుగులు ఈ అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. ఈ అడవిలో పాములు కూడా విరివిగానే కనిపిస్తాయి. సత్‌పురా అభయారణ్యంలో సఫారీ థ్రిల్లింగ్‌గా ఉంటుంది.
 
పురాతన నేపథ్యం గల పచ్‌మఢీ పరిసరాల్లో అనేక చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. వీటిలో జటాశంకర్ గుహలో వెలసిన శైవక్షేత్రం భక్తులను ఆకట్టుకుంటుంది. అలాగే, చౌరాగఢ్ శివాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇవే కాకుండా, బాబా మహాదేవ్, గుప్త్ మహాదేవ్ వంటి పురాతన ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా సందర్శకులకు చక్కని అనుభూతిని ఇస్తాయి.
 
పచ్‌మఢీ సమీపంలోని భీమ్‌బెట్కా, బాఘ్, ఉదయగిరి గుహలలో గుహాకుడ్యాలపై ప్రాచీన మానవులు చిత్రించిన అపురూప చిత్రాలు సందర్శకులను అబ్బురపరుస్తాయి. చరిత్ర పూర్వయుగానికి చెందినవిగా భావిస్తున్న ఈ చిత్రాలు కనీసం పదివేల ఏళ్ల నాటివని పరిశోధకులు తేల్చారు.
 
ఏం కొనాలి?
* పచ్‌మఢీ అడవులు స్వచ్ఛమైన తేనెకు పెట్టింది పేరు. ఇక్కడి గిరిజనులు సేకరించిన తేనె పచ్‌మఢీ దుకాణాల్లో చౌకగా దొరుకుతుంది.
* బస్తర్ ప్రాంత గిరిజనులు తయారు చేసిన హస్తకళాకృతులు, వెదురు బుట్టలు, గిరిజన చిత్రకారులు తీర్చిదిద్దిన సంప్రదాయ చిత్రాల పెయింటింగ్స్ ఇక్కడ విరివిగా దొరుకుతాయి.
* సత్‌పురా అడవుల్లో లభించే పలు ఆయుర్వేద వనమూలికలు, అటవీ ఉత్పత్తులు కూడా పచ్‌మఢీ దుకాణాల్లో చౌకగా దొరుకుతాయి.
 
ఏం చేయాలి?
* నగరాల్లోని కృత్రిమ జలవిహారాల్లోని జలకాలాటల కంటే, వేసవిలో పచ్‌మఢీ పరిసరాల్లోని జలపాతాల్లో జలకాలాటలు గొప్ప అనుభూతినిస్తాయి.
* పచ్‌మఢీ పరిసరాల్లో ప్రకృతి అందాలను తిలకిస్తూ ఎంచక్కా వనవిహారం చేయవచ్చు.
* ట్రెక్కింగ్‌పై ఆసక్తి గలవారు ఇక్కడి కొండ శిఖరాలను అధిరోహించి, అక్కడి నుంచి కనిపించే ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు.
* ఇక్కడి సహజసిద్ధమైన కొలనులు, సరస్సుల్లో పడవ ప్రయాణం ఆహ్లాదభరితంగా ఉంటుంది.
* సత్‌పురా అభయారణ్యంలో సఫారీ అద్భుతంగా ఉంటుంది. స్వేచ్ఛగా సంచరించే పులులు, చిరుతలు వంటి భారీ జంతువులతో పాటు ఉడుతలు, కుందేళ్లు వంటి చిన్న చిన్న జంతువులను, రక రకాల పక్షులను ఇక్కడ దగ్గరగా తిలకించవచ్చు.
 
ఎలా వెళ్లాలి?
* విమానంలో రావాలనుకుంటే దేశంలోని ప్రధాన నగరాలన్నింటి నుంచి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు విమానాలు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి పచ్‌మఢీకి రోడ్డు మార్గంలో చేరుకోవాల్సి ఉంటుంది.
* పచ్‌మఢీకి 47 కిలోమీటర్ల దూరంలోని పిపారియా వరకు దేశంలోని అన్ని మార్గాల నుంచి రైళ్లు అందుబాటులో ఉంటాయి. పిపారియా నుంచి బస్సు లేదా ట్యాక్సీలో పచ్‌మఢీకి చేరుకోవచ్చు.
* మధ్యప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల నుంచి పచ్‌మఢీకి విరివిగా బస్సులు అందుబాటులో ఉంటాయి.

మరిన్ని వార్తలు