ప్రేమతో... నీ వాలెంటైన్!

9 Feb, 2014 02:12 IST|Sakshi
ప్రేమతో... నీ వాలెంటైన్!

స్త్రీ, పురుషుల మధ్య ఏర్పడగలిగే మహోన్నత బంధాన్ని అడ్డుకోవడమా? పెళ్లి మీద నిషేధం విధించడమా?  ఒక మనిషి మీద ప్రేమ ఎందుకు పుడుతుందో ఎవరు చెప్పగలరు! కళ్లల్లోంచి హృదయంలోకి జారిపోయే ఆ వెలుగును వర్ణించడం ఎవరితరం? సృష్టిని కొనసాగనిచ్చే ఆ పవిత్ర ప్రేమను ఎంతగానో ప్రేమించాడు సెయింట్ వాలెంటైన్. క్రీ.శ. 270 కాలంనాటి ఈ మతగురువు తమ రోమ్ సామ్రాజ్యం అంతటా ప్రేమతోటలు పెరగాలని కాంక్షించాడు. ప్రేమలో తడిసి ముద్దయ్యేవారిని ముద్దుచేశాడు. అయితే, చక్రవర్తి రెండో క్లాడియస్ తీరు ఇందుకు భిన్నంగా ఉంది. ఒంటరి బ్రహ్మచారులే మంచి సైనికులుగా పోరాడగలరని క్లాడియస్ ఆలోచన. భార్యా, పిల్లాపీచూ అని సైనికులు తలుస్తూంటే కత్తులమీద పట్టు బిగుస్తుందా? అశ్వారూఢులై యుద్ధంలో అరివీర భయంకరులు కాగలరా? అందుకే ఎవరూ వివాహలు చేసుకోకూడదన్నాడు క్లాడియస్. ఏడుస్తున్న పిల్లలను సముదాయించడంలో సహనం కాదు, శత్రువులను తరిమి తరిమి కొట్టడంలో సాహసం చూపమన్నాడు.
 
 చక్రవర్తి అజ్ఞానానికి నవ్వుకున్నాడు వాలెంటైన్. అన్యాయం కాదూ! అతర్కం కాదూ! ప్రేమంటే సాక్షాత్తూ దైవమే కాదూ! స్త్రీ, పురుషుల మధ్య ఏర్పడగలిగే మహోన్నత బంధాన్ని అడ్డుకోవడమా? పెళ్లి మీద నిషేధం విధించడమా?
 
 పారిపోయి వచ్చిన యువతీయువకులకు పెళ్లిళ్లు జరిపించాడు వాలెంటైన్. ప్రేయసీ ప్రియులను నూతన వధూవరులుగా దీవించి పంపాడు. ప్రేమాగ్నిలో మీ పొరపొచ్చాలను దహించుకోండి; పిల్లాపాపలతో సుఖంగా ఉండండి; ఇంతకంటే అద్భుతమైన కార్యం మరొకటి లేనంతగా ప్రేమలో మునిగిపొండి అన్నాడు.
 కానీ రహస్యం దాగలేదు. క్లాడియస్‌కు విషయం తెలిసింది. ఉగ్రుడయ్యాడు. రాజద్రోహిని బంధించి తెమ్మని ఆదేశించాడు. భటులు పరుగెత్తారు. వాళ్లను ప్రేమగా ఆహ్వానించాడు వాలెంటైన్.
 
 ఒకవైపు రాజ్యం పొరుగుదాడుల్తో సంక్షోభంలో ఉంటే మీరు ప్రేమమంత్రాలు జపిస్తున్నారా? అన్నాడు క్లాడియస్. మనుషుల్ని దగ్గరగా చేసే ప్రేమకు మనుషుల్ని దగ్గర చేస్తున్నాను, అన్నాడు వాలెంటైన్.
 ప్రేమ మీద అధికారం గెలిచింది. శాసన ధిక్కారం సాకుగా మరణశిక్ష ఖాయమైంది. కారాగారంలో బందీ అయ్యాడు వాలెంటైన్. ఆ ప్రేమగురువును చూసేందుకు ఎవరెవరో వచ్చేవారు. వారిలో జైలు అధికారి కుమార్తె కూడా ఉండేది. వాలెంటైన్‌లోని పూజారిలోంచి ప్రేమికుడు మేల్కొన్నాడు. ఆ చివరి రోజుల్లో ఆమె వచ్చే ఆ క్షణాల్నే ఆయన పొదవుకున్నాడు.
 
 వాలెంటైన్‌ను ఫిబ్రవరి 14న ఉరి తీశారు. ఉరితీయబోయే ముందురోజు రాత్రి ‘నీ వాలెంటైన్ నుంచి’ అన్న వాక్యంతో ఆమెకో ఉత్తరం రాశాడు. అదొక చరిత్రాత్మక వాక్యం అయింది. కాలక్రమంలో వాలెంటైన్ అనే పేరు ప్రేమికుడికి పర్యాయపదం అయింది. క్లాడియస్ మరణించాడు. వాలెంటైన్ మరణించీ జీవించాడు. ప్రేమ మీద అధికారం ఎన్నటికీ గెలవలేదు!
 
 ఇందులో నిజమెంతో, అబద్ధమెంతో, కాలం తొలగించిన దుస్తులెన్నో, కట్టుకున్న కొత్త రెక్కలెన్నో! వాలెంటైన్ గురించిన ఎన్నో కథనాలు! ఇది ‘ప్రేమ’కు సమీపంగా ఉన్న కథగా ప్రపంచప్రేమికులందరూ గానం చేస్తున్నారు, ప్రేమికుల రోజున ప్రేమకు పునరంకితం అవుతున్నారు. అయితే, వాలెంటైన్ డే అంటే ‘వంద కోట్ల కార్డులు అమ్మడం కాదు. కేవలం కోరుకోవడం కాదు, ఇవ్వడం! ప్రేమంటే కళ్లుమిరుమిట్లుగొలిపే ప్రవాహం కాదు, నిత్యం ప్రవహించాల్సిన జీవధార! పుట్టిన మనిషి చేయగలిగే పుణ్యకార్యం. మరణం దాకా నిలుపుకోగలిగే మహత్వం!

మరిన్ని వార్తలు