సహజసిద్ధ జీవనధార... ‘నీరా’

30 Nov, 2019 00:51 IST|Sakshi

విశ్లేషణ

బహుళ జాతి సంస్థల శీతలపానీయాల ప్రచా రం ముందు తట్టుకోలేక తలవంచిన అరుదైన దేశీయ ఆరోగ్య పానీ యాల్లో నీరా ఒకటి. తాటి, ఈత, ఖర్జూరా, జీరిక, కొబ్బరి వంటి నిట్టనిలువుగా పెరిగే చెట్ల నుంచి కారే తీయటి పానీయం నీరా. ఆల్క హాల్‌ ఏమాత్రం లేని నీరా ఎన్నో పోషకవిలువలు కలిగిన దేశీయ పానీయం. తెలంగాణ, కేరళ, తమిళనాడు, బిహార్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో వాడుకలో ఉన్న నీరా, దాని అనుబంధ ఉత్పత్తులు 1990ల తర్వాత బహుళ జాతి కంపెనీలు, కార్పొరేట్‌ సంస్థల పోటీని తట్టుకోలేక పరిశ్రమే మూతపడిపోవడం విచారకరం.

ఆహార అలవాట్లు మారటంతో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిని రోగాల బారిన పడటం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో పాత ఆహార అలవాట్లు మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. కాబట్టి ప్రకృతి సహజ పానీయమైన నీరాను దాని అనుబంధ ఉత్పత్తులను మళ్లీ మార్కెట్లోకి తీసుకువస్తే ప్రజారోగ్యానికి చక్కటి పునాది ఏర్పడే అవకాశం ఎంతైనా ఉంది. నీరాను అన్ని వయసుల వారు స్త్రీలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు కూడా తాగవచ్చు. తెలంగాణలో కోటికి పైగా ఉన్న తాటిచెట్లు, ఈత చెట్లనుంచి తీస్తున్న నీరాను తియ్యటి కల్లుగా పిల్చుకుంటూ నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సేవిస్తున్నారు. అయితే నీరాకు, కల్లుకు వ్యత్యాసముంది. సహజసిద్ధమైన పోషక విలువలు గల తీయటి ఆహార పానీయం ‘నీరా’. దీంట్లో విశేషం ఏమిటంటే, అప్పుడే చెట్ల నుంచి తీసిన నీరాలో ఆల్కహాల్‌ అస్సలు ఉండదు. తాజాగా చెట్లనుంచి సేకరించిన నీరాలో సుక్రోసు, ప్రోటీన్సు, ఆస్కార్బిక్‌ యాసిడ్, థయామిన్, రిబోప్లెవిన్, విటమిన్‌ సి, పాలలో కంటే ఎక్కువ కెలోరీల శక్తి, పోలిక్‌ యాసిడ్, ఇతర విటమిన్లు కూడా ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. 

నీరాను ప్రధానంగా తాటి, ఈత చెట్ల నుంచి తీస్తారు. ప్రతిరోజూ సూర్యాస్తమయం తర్వాత కుండను తాటి, ఈత చెట్లకు కట్టి సూర్యోదయం కన్నా ముందే కుండను దింపి వెంటనే అతి తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచుతారు. సూర్యోదయం తర్వాత తీసినా, ఎండ, గాలి ఎక్కువగా తగిలినా తొందరగా పులిసిపోతుంది. ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతాలైన భారత్‌ వంటి అనేక దేశాల ప్రజలకు నీరా ఆరోగ్య ప్రదాయిని అని చెప్పాలి. ఉష్ణమండల దేశాల్లో మనుషులు త్వరగా అలసిపోయి శరీరం పోషకాలను వేగంగా కోల్పోతారు కనుక ఈ నీరాను సేవించడం వల్ల తక్షణ శక్తి శరీరానికి అందుతుంది. 

శరీరానికి త్వరగా శక్తిని అందించే ఈ రీహైడ్రేషన్‌ ప్రక్రియ శరీరానికి చలవ చేస్తుంది. మూత్ర సంబంధిత వ్యాధులు, కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు ఈ నీరా సేవించడం వల్ల త్వరగా నయం అయినట్లు ఆధారాలున్నాయి. కామెర్లవ్యాధికి ఇది ఔషధంగా పని చేస్తుంది. జీర్ణశక్తిని పెంచి, మలబద్దకాన్ని పోగొట్టే నీరాను సేవిస్తే గ్యాస్ట్రిక్‌ సమస్య తొందరగా తగ్గుతుంది. ఇటీవల ఉస్మానియా యూని వర్సిటీ సూక్ష్మ జీవ శాస్త్ర విభాగం చేసిన పరిశోధనల్లో నీరా కేన్సర్‌ నివారణకు ఉపయోగపడుతుందని తేల్చడంతో దీని వివరాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి కూడా. మధుమేహ రోగులకు నీరా వరం లాంటిది. 

తెలంగాణ ప్రభుత్వం నీరాను ఆల్కహాల్‌ లేని పానీయంగా ప్రకటిస్తూ ఎక్సైజ్‌ చట్టంలో మార్పులు చేయాలి. చెట్లను నీరాకోసం ప్రత్యేకంగా కేటాయిస్తూ, నీరా సేకరణకు, రవాణాకు, అమ్మకానికి అనుమతులి వ్వాలి. తద్వారా గీతవృత్తిలో ఉన్న పలువురు గౌడ యువకులకు ఉపాధి లభించడంతోపాటు రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యకరమైన ప్రకృతి పానీయం అందుబాటులోకి వస్తుంది. నీరాకు సహజపానీయంగా ప్రచారం కల్పించి మధ్యతరగతి, ఉన్నత స్థాయి వారికి కూడా అందుబాటులోకి వచ్చే విధంగా ప్రభుత్వం వివిధ పట్టణాల్లో కస్టమర్‌ లైన్‌ని అందుబాటులోకి తేవాలి. గీత కార్మికుల ఆర్థిక అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కూడా దోహదకారి.
(తెలంగాణ ప్రభుత్వం నీరా అమ్మకాలను అనుమతిస్తూ ఇటీవలే జీవోఎంఎస్‌ 116ని జారీ చేసిన సందర్భంగా)

వ్యాసకర్త:
డా. ఆనంద్‌ గోపగోని,
అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ఓయూ
మొబైల్‌: 98482 56042
 

మరిన్ని వార్తలు