సాయిబాబకి వైద్య బెయిల్‌ ఇవ్వాలి

2 Feb, 2019 01:11 IST|Sakshi

న్యాయస్థానం ఆదేశాలతో ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబని ఆయన సోదరుడు రామ్‌దేవ్‌తోపాటు 2018 డిసెంబర్‌ 26న కలిశాను. నాగ్‌పూర్‌ జైలులో ములాఖత్‌ కిటికీ గుండా కాకుండా, చాలా కాలం తర్వాత నాగ్‌పూర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో తనను నేరుగా చూడగలిగాను. తన పరిస్థితి గతంలో నేను ఊహించినదానికంటే ఘోరంగా ఉంది. దాదాపు కదల్లేని స్థితిలో కనిపించారు. తన చేతులు విడుపులేకుండా వణుకుతున్నాయి. బరువు కూడా బాగా కోల్పోయారు. ఇప్పుడు తనను కుర్చీలోంచి పడకమీదికి మార్చాలంటే కనీసం ఇద్దరు మనుషుల సహాయం అవసరం. డిసెంబర్‌ 26న వైద్య పరీ క్షల సమయంలో కూడా సాయి సోదరుడు, ఒక పోలీసు కలిసి తనను అనేక సార్లు చేతుల మీద ఎత్తుకుని మార్చాల్సి వచ్చింది. ఆ దృశ్యాలను వీడియోగా కూడా తీసి ఉంచాను కాబట్టి గౌరవనీయ న్యాయమూర్తులు కూడా చూసి సాయి పరిస్థితిని అర్థం చేసుకోవాలి.

సాయిబాబకు జైల్లో మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. తనను చుట్టుముట్టిన తీవ్ర అనారోగ్య పరిస్థితులను పట్టించుకోకుండా మూత్రాశయంలో రాళ్లను మాత్రమే శస్త్ర చికిత్సతో తీసేస్తామని మాత్రమే ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. సాయి మొత్తంమీద 19 రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రాణాంతకంగా మారిన గుండె సమస్య, కిడ్నీల్లో రాళ్లు, యూరిన్‌ ఇన్ఫెక్షన్‌ వంటి పలు సమస్యలు తనను వెంటాడుతున్నాయి. వైద్యులు సిఫార్సు చేసిన పలు పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో లేవు. అందుకే తనను సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చాలని కూడా వైద్యులు సూచించారు. సాయి ఉంటున్న సెల్‌ ఓపెన్‌గా ఉండటంతో తనకు తీవ్రంగా చలివేస్తోంది. దీంతో తన కాళ్లు స్తంభిం చిపోయాయి. అండా సెల్‌ లోపల ఉష్ణోగ్రత మరింత తక్కువగా కావడంతో తాను నరకం అనుభవిస్తున్నట్లే లెక్క. తన ఎడమ భుజం స్తంభించిపోయినందున వెంటనే ఆయనకు థెరపీ చికిత్స చేయించాలని న్యూరాలజీ విభాగాధిపతి రాశారు. తనకు నిత్యం ఫిజియోథెరపీ అవసరం. కుటుంబ సభ్యుల తోడు లేకుండా అది అసాధ్యం. తీవ్రమైన నొప్పిని అనుభవిస్తూ జీవిత చరమాంకంలో లాగా గడుపుతున్నారు. 

జనవరి 24న ఢిపెన్స్‌ కౌన్సిల్‌ వాదన ముగిసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 11న ఉంటుంది. సాయిని జైల్లో ఉంచి రెండేళ్లవుతోంది. తనకు మెడికల్‌ బెయిల్‌ కోసం అప్లై చేసి 11 నెలలు అవుతోంది. ఈలోగానే తన ఆరోగ్య స్థితి విషమంగా మారింది. ఘన ఆహారం స్వీకరించలేనంత బలహీనంగా ఉన్నారు. 90 శాతం వైకల్యంతో ఉన్న సాయి హక్కులకు తీవ్రంగా భంగం కలుగుతోంది. తరచుగా స్పృహ కోల్పోతున్న సాయిబాబది అక్షరాలా ఇçప్పుడు చావుబతుకుల సమస్య. తన ప్రాథమిక మానవ హక్కులను గౌరవ న్యాయస్థానం ఎత్తిపట్టి పూర్తిస్థాయి అంగవైకల్యంతో ఉంటున్న సాయి వైద్య బెయిల్‌ను తదుపరి విచారణలో అయినా మంజూరు చేయాలని కోరుతున్నాను.-వసంత,ప్రొఫెసర్‌ జిఎన్‌ సాయిబాబ సహచరి
 

మరిన్ని వార్తలు