పైలట్‌ నేర్పుతున్న గుణపాఠం

18 Jul, 2020 01:37 IST|Sakshi

విశ్లేషణ

రాజస్తాన్‌ తాజా పరిణామాలను చూస్తున్నవారికి ఒక విషయం స్పష్టంగా బోధపడుతుంది. అదేమిటంటే, ఆ రాష్ట్రంలో అశోక్‌ గెహ్లోత్‌ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ ఎలాగోలా నిలబెట్టుకునే సంకేతాలు వెలువడుతున్నప్పటికీ, అంతిమ ప్రయోజనం బీజేపీకే సిద్ధించనుంది. రాజస్తాన్‌లో సచిన్‌ పైలట్‌ తిరుగుబాటును వ్యక్తిగత ఆశలు, ఆకాంక్షల ఫలితంగా మాత్రమే చూసేవారు దీనితో కాంగ్రెస్‌ పార్టీకి సంభవించే పర్యవసానాలను గురించి ఆలోచించడం లేదు. సచిన్‌ పైలట్‌ పార్టీ నుంచి వైదొలగడాన్ని సమీప భవిష్యత్తే నిర్ణయించవచ్చు కానీ ఆయన నిష్క్రమణ మాత్రం కాంగ్రెస్‌పార్టీ సంస్థాగత రాజకీయాల సంపూర్ణ పరాజయంగానే చెప్పాల్సి ఉంటుంది.

బీజేపీతో ఫలవంతమైన ఒప్పందం కుదుర్చుకోలేకపోవడం, మాతృసంస్థతో బంధనాలు పూర్తిగా తెంచుకోలేకపోవడం మధ్య కొట్టుమిట్టులాడుతున్న సచిన్‌ పైలట్‌ ఇప్పుడు అస్వాభావికమైన రాజకీయ శక్తుల దయాదాక్షిణ్యాల క్రూరత్వం మధ్య నలుగుతున్నారు. ఈ పరిస్థితిని రేపు దీర్ఘకాలిక రాజకీయ అవకాశంగా తాను మల్చుకోగలరా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియాలాగా బీజేపీ సచిన్‌ పైలట్‌ని, అతని అనుయాయుల్నీ చేర్చుకోవడానికి ప్రాధాన్యమిచ్చింది. కానీ మధ్యప్రదేశ్‌ తరహా రాజకీయ తిరుగుబాటును సత్వరం ప్రేరేపించడంలో రాజస్తాన్‌ బీజేపీ విజయవంతం కాలేకపోయింది. మరోవైపున మొన్న జ్యోతిరాదిత్య సింధియా, నేడు సచిన్‌ పైలట్‌ వంటి యువ నాయకులు పార్టీనుంచి నిష్క్రమించాలని ప్రయత్నించడం చూస్తుంటే కాంగ్రెస్‌ పార్టీలో యువనేతలు ఏమంత సంతోషంగా లేరని స్పష్టమవుతోంది. అందుకే ముఖ్యమంత్రి గెహ్లోత్‌ తాత్కాలికంగా బతికి బట్టకట్టినట్లు కనిపిస్తున్నా, అంతిమంగా బీజేపీనే ప్రయోజనం పొందనుంది.

ఫిరాయింపులకు బీజేపీ డబ్బు ఆశ చూపిందా?
రాజస్తాన్‌లో పార్టీని చీల్చి ముందుగా ప్రాంతీయ పార్టీని పెట్టాలని తర్వాత బీజేపీ పొత్తుతో ప్రభుత్వం ఏర్పర్చాలని పైలట్‌ భావించారని తెలుస్తోంది. అయితే ఇది పనిచేయదని భావించిన బీజేపీ నాయకత్వం పైలట్‌ని తన అనుయాయులను జ్యోతిరాదిత్య సింధియాలాగే పార్టీలోకి నేరుగా చేర్చుకోవడానికే ప్రాధాన్యమిచ్చింది. సింధియా విషయంలో వ్యవహరించినట్లే పైలట్‌కు కూడా కేంద్రంలో మంత్రి పదవి లేక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడానికి కూడా సిద్ధమైపోయింది. అయితే సచిన్‌తో సంభాషించిన బీజేపీ నేతలు తన అనుయాయులందిరికీ మంత్రిపదవులు ఇవ్వడానికి కానీ, అనర్హత వేటు పడితే వారికి ఉప ఎన్నికల్లో సీట్లు  ఇవ్వడానికి కానీ హామీ ఇచ్చి ఉండకపోవచ్చు. పైగా రాజస్తాన్‌లోనూ అధికార మార్పిడికోసం ఫిరాయింపు చేసే ఎమ్మెల్యేలకు డబ్బు ఎర చూపినట్లు పుకార్లు వ్యాపించాయి. దీనికి సంబంధించిన టెలిఫోన్‌ సంభాషణలు కూడా రాజస్తాన్‌ పోలీస్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌కు లభించాయి. అది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియే అనుకోండి. కానీ ఇలాంటి ఆధారం లభించిందంటే మాత్రం సచిన్‌ పైలట్‌ ప్రతిష్ట మసకబారిపోతుంది. పైగా ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ మాజీ ఉపముఖ్యమంత్రి పైలట్‌పై దూకుడుగా గురిపెట్టారు.

రాజస్తాన్‌లో చోటుచేసుకున్న పరిణామాలను ఈ మార్చి నెలలో మధ్యప్రదేశ్‌లో జరిగిన పరిణామాలతో పోల్చి చూడవచ్చు. రెండు చోట్లా పార్టీని వీడి కాంగ్రెస్‌ యువనేతలు బయటకు రావాలనుకున్నారు. పోలిక అంతవరకే కానీ తదనంతర పరిణామాలు మాత్రం రెండు రాష్ట్రాల్లో పూర్తి భిన్నంగా పర్యవసించాయి. అంతర్గత కారణాల వల్ల రాజస్తాన్‌లో అధికారం అందిపుచ్చుకోవడానికి బీజేపీ సిద్ధం కాకపోయి ఉండవచ్చు. దీంతో మొత్తం పరిస్థితి తిరగబడింది. పైగా మధ్యప్రదేశ్‌లో రేపిన తిరుగుబాటులాంటిదాన్ని రాజస్తాన్‌లో బీజేపీ నిర్వహించలేకపోయింది. ఎందుకంటే రాజస్తాన్‌లో తన పార్టీ అంతర్గత పరిస్థితి సరిగా లేదు. రాజస్తాన్‌లో బీజేపీ మాజీ ముఖ్యమంత్రి, బలవంతురాలైన వసుంధరా రాజే సింధియాను సవాలు చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావించలేదు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధించినప్పటికీ వసుధరా రాజేకి అధికారం మరోసారి కట్టబెట్టడానికి బీజేపీ సిద్ధంగాలేదు. ప్రస్తుతం జోథ్‌పూర్‌ ఎంపీ గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు బీజేపీ మద్దతిస్తూ వచ్చింది.

అయితే అంచనాలు తప్పిపోయిన స్థితిలో అక్టోబర్‌ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్తాన్‌లో 200 సీట్లు ఉన్న శాసనసభలో బీజేపీకి 70 స్థానాలు రాగా, వంద స్థానాలు కాంగ్రెస్‌ పార్టీకి వచ్చాయి. అదే మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలున్న శాసనసభలో బీజేపీకి 109 సీట్లు రాగా కాంగ్రెస్‌కి 114 స్థానాలు వచ్చాయి. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ని  మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నిలపాలని బీజేపీ కేంద్ర నాయకత్వం పట్టుపట్టకపోయి ఉంటే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చివేయగలిగి ఉండేది కాదు. అయితే రాజస్తాన్‌ విషయానికి వస్తే మాజీ సీఎం వసుంధరా రాజేకి శాసనసభలో లభిస్తున్న సమర్థనను చూసినప్పడు బీజేపీ అంత సౌకర్యంగా భావించడం లేదు. 

కాంగ్రెస్‌లో ప్రాంతీయ నేతల ఆవిర్భావం బీజేపీకి సంతోషదాయకం
స్థానిక పరిస్థితులను బేరీజు వేసుకున్నప్పుడు కాంగ్రెస్‌లో ఆవిర్భవిస్తున్న ప్రత్యామ్నాయ ప్రాంతీయ నేతలను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడం పట్ల బీజేపీ చాలా సంతోషంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. నేడు అస్సామ్‌లో హిమంత బిశ్వ శర్మ కానీ, రేపు మహారాష్ట్రలో లేదా ఉత్తర ప్రదేశ్‌లో ఆవిర్బవించే మరో యువనేత కానీ బీజేపీ అవసరాలకు సరిగ్గా సరిపోతారు. ఇలాంటి యువనేతలు తమ సొంత పునాదితో బీజేపీలోకి వస్తారు కాబట్టి సాంప్రదాయికంగా రాష్ట్రీయ స్వయం సేవక్‌  క్షేత్ర స్థాయి నిర్మాణంనుంచి వచ్చే బలానికి భిన్నంగా బీజేపీకి ఇప్పుడు క్షేత్రస్థాయిలో పుట్టుకొచ్చిన యువనేతల దన్నును స్వీకరించే అవకాశం కూడా ఉంటుంది. దీంతో పార్టీ రాజకీయ పునాది పెరిగి, ఓటర్లలోని కొత్త సెక్షన్లలో బీజేపీ పట్ల ఆమోదం కూడా పెరిగే అవకాశం ఉంటుంది

ముందే చెప్పినట్లుగా సింధియా, పైలట్‌ వంటి యువనేతల వరుస నిష్క్రమణను చూస్తే కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలతో దాని యువనేతలు సంతుష్టిగా లేరని రాజకీయ సంకేతాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో సచిన్‌ పైలట్‌ యువ సహచరులైన జితిన్‌ ప్రసాద వంటివారు పైలట్‌కు మద్దతుగా ప్రకటనలు గుప్పించడం దీన్నే రుజువు చేస్తోంది. మరో యువనేత మిలింద్‌ దేవరా ఇంకా స్పందించలేదు కానీ తానుకూడా పైలట్‌ బాటలోనే పయనించబోతున్నట్లు సూచనలు వస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకున్నప్పుడు యూపీఏ–2 పాలనలో మంత్రి పదవులు పొందిన రాహుల్‌ యువ శక్తి, కాంగ్రెస్‌ భవిష్యత్తుగా భావించిన యువనేతలు ఈరోజు పార్టీతో కొనసాగాలని ఏమాత్రం కోరుకోవడం లేదు.

దెబ్బతిన్న కాంగ్రెస్‌ పులులే బీజేపీ బలం
బీజేపీలో చేరదల్చుకున్న కాంగ్రెస్‌ యువనేతలు ఆ పార్టీ భావజాలం పట్ల ఆకర్షితులై చేరుతున్నట్లు ఏ పరిస్థితుల్లోనూ భావించవద్దు. తమ వ్యక్తిగత ఆకాంక్షలు, ఆశల కోసమే వారు మాతృసంస్థకు దూరమవుతున్నారు. పైగా పార్టీ తమను చిన్నచూపు చూస్తోందన్న అభద్రత కూడా వారిలో అలుముకున్నట్లుంది. కాంగ్రెస్‌ నాయకత్వానికి గుణపాఠం నేర్పడానికి, పార్టీలోని రాజకీయ ప్రత్యర్థులకు సవాలు విసరడానికి చిట్టచివరి సాధనంగా మాత్రమే వీరు ఫిరాయింపులను ఎంచుకుంటున్నారు. తాను పార్టీనుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటిస్తున్న సందర్బంలో జ్యోతిరాదిత్య సింధియా ‘పెద్దపులి ఇంకా బతికే ఉంది’ (టైగర్‌ అభి జిందా హై) అంటూ ఉద్వేగపూరితమైన ప్రకటన చేశారు.  అంటే ఇది కచ్చితంగా దెబ్బతిన్న పెద్దపులి మనస్తత్వాన్నే తెలుపుతుంది. తనను దెబ్బ తీసిన వారిలో కొందరి పని పట్టకుండా, పార్టీకి నష్టం చేకూర్చకుండా తాను వెళ్లననే హెచ్చరిక సింధియా ప్రకటనలో దాగి ఉంది. పైగా పార్టీలోని అంతర్గత వివాదాలను సంస్థాగతంగా గానీ, కేంద్ర నాయకత్వం కానీ పరిష్కరించలేకపోతోందని సింధియా ప్రకటన తేల్చిచెబుతోంది.

కాబట్టి కాంగ్రెస్‌ పార్టీ రాజస్తాన్‌లో అశోక్‌ గెహ్లోత్‌ ప్రభుత్వాన్ని ఎలాగోలా నిలుపుకున్నప్పటికీ ఇప్పటికీ బీజేపీకే అది లబ్ధి చేకూరుస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో సంక్షోభాలు కాంగ్రెస్‌ పార్టీలోని సంస్థాగతలోపాలను ఎత్తి చూపాయి. అందుకే తన సమస్యలకు ప్రత్యర్థి పార్టీలను కారణంగా చూపడానికి బదులుగా కాంగ్రెస్‌ ముందుగా తన సొంత ఇంటిని చక్కదిద్దుకోవడం మంచిది. ఆ పార్టీలో తగవులను పరిష్కరించే యంత్రాంగం కానీ, పరిణితి చెందిన కేంద్ర నాయకత్వం కానీ లేదని స్పష్టంగా సంకేతాలు వెలువడుతున్నాయి.
(ది క్వింట్‌.కామ్‌ సౌజన్యంతో)


వ్యాసకర్త
భరత్‌ భూషణ్‌
సీనియర్‌ పాత్రికేయుడు

>
మరిన్ని వార్తలు