ఇంతకన్నా మంచి మార్గాలు లేవా?

22 Dec, 2023 00:10 IST|Sakshi

విశ్లేషణ

పార్లమెంటు శీతాకాల సమావేశాలకు అంతరాయం కలిగించినందుకు గాను లోక్‌సభ, రాజ్యసభల్లో 141 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెండ్‌ అయ్యారు. పార్లమెంటులో ప్రతిష్టంభన కొత్తేమీ కాదు. ఈ అంతరాయాలు మన పార్లమెంటరీ వ్యవస్థలో అనేక సంవత్సరాలుగా ఉన్న విధానపరమైన స్తబ్ధత కారణంగా ఏర్పడుతున్నాయి. ఎంపీలను శిక్షించడం ద్వారా పరిష్కరించగల క్రమశిక్షణా సమస్యగానే దీన్ని చూస్తున్నారు. మన పార్లమెంటరీ వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీలకు పార్లమెంటులో తగిన స్థానం లేదు. నిర్దిష్ట సమస్యలను లేవనెత్తాలని వారు డిమాండ్‌ చేయవచ్చు. అయితే వాటిని అంగీకరించాలా వద్దా అన్నది ప్రభుత్వంపై ఆధారపడి ఉంది. ప్రతిపక్షం కూడా ఉభయ సభల్లో చర్చకు ఎజెండాను సిద్ధం చేసేలా విధానాల్లో మార్పు రావటం అవసరం.

పార్లమెంటరీ వ్యవస్థ పనిచేయకపోవడానికి ప్రధాన కారణం, వివాదాస్పద అంశాలపై చర్చించడానికి విధానపరమైన యంత్రాంగాలు లేకపోవడమే. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ప్రస్తుత ప్రతిష్టంభన ఫలితంగా ఇది కనివిని ఎరుగని పరిస్థితికి దారితీసింది. పార్లమెంటు శీతాకాల సమా వేశాలకు అంతరాయం కలిగించినందుకు గాను లోక్‌సభ, రాజ్య సభల్లో 141 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేశారు.

పార్లమెంటులో భద్రతా లోపంపై హోంమంత్రి ప్రకటన చేయా లని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంటు భద్రత అనేది సున్ని తమైన అంశమనేది ప్రభుత్వ వైఖరి. ఇది లోక్‌సభ సెక్రటేరియట్‌ పరిధిలోకి వస్తుంది. స్పీకర్‌ ఓం బిర్లా ఆదేశాలను ప్రభుత్వం అనుసరిస్తుంది. దీనిపై ఉన్నతస్థాయి కమిటీ విచారిస్తోందని సభకు స్పీకర్‌ తెలియజేశారు. అఖిలపక్ష సమావేశంలో వచ్చిన కొన్ని సూచనలను అమలు చేశారు.

పార్లమెంటులో ప్రతిష్టంభన కొత్తేమీ కాదు. మన పార్లమెంటులో రాజకీయ పార్టీ/కూటమి పాత్రతో సంబంధం లేకుండా, చాలా సంవ త్సరాలుగా ఒక సుపరిచిత కథనం వినిపిస్తోంది. ప్రతిపక్షాలు ఒక ముఖ్యమైన అంశంపై చర్చకు డిమాండ్‌ చేస్తున్నాయి కానీ ప్రభుత్వం తప్పించుకుంటోంది. నిజానికి ఈ రోజు మనం చూస్తున్న అంత రాయాలు, క్రమశిక్షణా ప్రతిస్పందనలు... మన పార్లమెంటరీ వ్యవస్థలో అనేక సంవత్సరాలుగా ఉన్న విధానపరమైన స్తబ్ధత కారణంగా ఏర్పడుతున్నాయి.

ఎంపీలు మన పార్లమెంటరీ కార్యక్రమాలకు అంతరాయం కలిగించడం 1960వ దశకంలో మొదలైంది. తాము ముఖ్యమైనవిగా భావించిన అంశాలను ప్రముఖంగా ప్రస్తావించడానికి సభాపతి తమకు తగిన అవకాశం ఇవ్వడం లేదని భావించిన కొందరు ఎంపీలు ఈ పనిలోకి దిగారు. మూడవ లోక్‌సభ (1962–67) సభ్యులు రామ్‌ సేవక్‌ యాదవ్, మనీరామ్‌ బాగ్రీ వంటి ఎంపీలు పార్లమెంటరీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పీకర్‌ పదేపదే హెచ్చరించేవారు. వివిధ సందర్భాల్లో పదేపదే అంతరాయం కలిగించడంతో సభ నుండి వారిని ఏడు రోజుల పాటు సస్పెండ్‌ చేశారు.

లోక్‌సభ తన కార్య కలాపాల నుండి మినహాయించిన మొదటి పార్లమెంటేరియన్లు వారే కావచ్చు. మూడవ లోక్‌సభ తన పదవీకాలం ముగిసే సమయానికి, ఏకంగా ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్‌ చేసింది. మన పార్లమెంటరీ చర్చలలో అంతరాయాలు ఆనవాయితీగా మారబోతున్నాయని ఇది సూచించింది. అప్పటి నుండి, ఎంపీలు పార్లమెంటు కార్యకలా పాలకు అంతరాయం కలిగించిన ఘటనలు, దాని కోసం క్రమశిక్షణకు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి.

కానీ కాలక్రమేణా, పార్లమెంటరీ అంతరాయాలు నెమ్మదిగా రాజకీయ సాధనంగా మారాయి. ఈ మారుతున్న ధోరణి గురించి పలువురు సభాపతులు నొక్కి చెప్పారు. ‘చాలా సందర్భాలలో, సభా కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. అవి యాదృచ్ఛికంగా జరగలేదు. ఉద్దేశపూర్వకంగా అరుస్తూ, సభ వెల్‌లోకి ప్రవేశించడం ద్వారా కార్యకలాపాలను నిలిపివేయడం, పార్లమెంటు పనిచేయడా నికి అనుమతించకూడదనే ఉద్దేశమే ఇక్కడ కనబడుతోంది’ అన్నారు 14వ లోక్‌సభ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ.

కానీ మన పార్లమెంటరీ వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీలకు పార్లమెంటులో తగిన స్థానం లేదు. నిర్దిష్ట సమస్యలను లేవనెత్తాలని వారు సూచించవచ్చు, డిమాండ్‌ చేయవచ్చు. అయితే వాటిని అంగీకరించాలా వద్దా అన్నది ప్రభుత్వంపై ఆధారపడి ఉంది. పైగా సమస్యంతా  అందులోనే ఉంది. ప్రతిపక్ష ఎంపీలు సభలో మాట్లాడలేకపోతే, అది నిరంతరం అంతరాయాలకు దారి తీస్తుంది. ఇప్పటివరకు, సంస్థాగత ప్రతిస్పందన ఏమిటంటే, అంతరాయం కలిగించే ఎంపీలను శిక్షించ డమే. కానీ ఇటీవలి సంఘటనలు చూపించినట్లుగా, ఈ విధానం పనిచేయనిదిగా మారింది.  

పైగా, అంతరాయానికి చెందిన స్వభావం క్రమంగా పరిణామం చెందినప్పటికీ, పార్లమెంట్‌ సంస్థాగత ప్రతిస్పందన సరళంగానే ఉంటూ వచ్చింది. ఏమాత్రం మారలేదు. ఎంపీలను శిక్షించడం ద్వారా పరిష్కరించగల క్రమశిక్షణా సమస్యగానే ఇది ఇప్పటికీ అంతరా యాలను చూస్తుంది. సమస్యలో కొంత భాగం పార్లమెంటును మనం చూసే విధానంలో కూడా ఉంది. మన రాజ్యాంగ నిర్మాతలు మన జాతీయ శాసన సభను ప్రభుత్వ వ్యవహారాల కోసం ఉద్దేశించిన ఒక సంస్థగా రూపొందించారు.

రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటును సమావేశపరిచే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు. పార్లమెంటరీ ప్రక్రియ నియమాలు ఈ ఆలోచనా విధానాన్ని బలపరిచాయి. ఈ నియమాలు స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్‌ మూసపై ఆధారపడి ఉన్నాయి. వలస ప్రభుత్వ వ్యవహారాలకు ప్రాధాన్యత ఉండేలా చూడటం వారి ఉద్దేశం. ఈ భావనకు అదనంగా, వెస్ట్‌మినిస్టర్‌ పార్ల మెంటరీ సూత్రం ప్రకారం, పార్లమెంటును సజావుగా నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత.

దేశంలో అత్యున్నతమైన శాసన నిర్మాణం, జవాబుదారీతనం ఉన్న ప్రాతినిధ్య సంస్థను చూసే లోపభూయిష్ట మార్గం ఇది. ఇది పార్లమెంట్‌ ఎజెండాను నిర్ణయించే అధికారాన్ని, దానిలో ఏయే అంశాలు చర్చకు వస్తాయో నియంత్రించే అధికారాన్ని ప్రభుత్వానికి ఇస్తుంది. నిజానికి చట్టసభలు అనేవి సహకార స్థలాలు. ఇక్కడ ఖజానా(ప్రభుత్వం), ప్రతిపక్షాలు రెండూ కలిసి దేశానికి మంచి ఫలితం కోసం పని చేయాలి. ఎన్నికైన ప్రభుత్వ పాత్ర ఏమిటంటే శాసన, ఆర్థికపరమైన ప్రాధాన్యతలను నిర్ణయించడం.

ప్రతిపక్షాల బాధ్యత ఆ ఆలోచనలను వ్యతిరేకించడం లేదా ప్రత్యామ్నాయాలను సూచించడం, అంతరాలను ఎత్తి చూపడం ద్వారా వాటిని బలోపేతం చేయడం. ఈ విధానం ఇప్పుడు ఆచరణ సాధ్యం కానిదిగా మారింది. సభను నడపటం సభాపతికి సాధ్యం కాదని 2005లో స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ వ్యాఖ్యానించారు. ‘సభ్యుల సమూహం సభలను నడపనివ్వకుండా మొండిగా వ్యవహరిస్తే, దానిని నియంత్రించడం చాలా కష్టం.’

పార్లమెంటు సమర్థవంతంగా పనిచేయాలంటే ఎంపీలను శిక్షించడం సరిపోదు. ప్రతిపక్షం కూడా ఉభయ సభల్లో చర్చకు ఎజెండాను సిద్ధం చేసేలా విధానాల్లో మార్పు రావటం అవసరం. ప్రస్తుతం, ముఖ్యమైన శాసనపరమైన, విధానపరమైన అంశాలను చర్చించడానికి ప్రైవేట్‌ సభ్యులకు మాత్రమే ప్రతి శుక్రవారం రెండున్నర గంటల సమయం లభిస్తుంది. అయితే, పార్లమెంటులో నిర్దిష్ట చర్చ జరగాలని ఎంపీల బృందం కోరే యంత్రాంగం లేదు.

చర్చను బలవంతం చేయడానికి వారికి అందుబాటులో ఉన్న ఏకైక మార్గం, అవిశ్వాస తీర్మానమే. బహుశా, పార్లమెంటు సమావేశాల క్యాలెండర్‌లో ప్రతి పక్షాల కోసం నిర్దిష్ట రోజులను చేర్చడం గురించి ఆలోచించాల్సిన సమయం ఇది. హౌస్‌ ఆఫ్‌ కామన్్స లాగా, ప్రతిపక్షాలు ముఖ్య మైనవిగా భావించే సమస్యలపై చర్చించడానికి ఈ రోజులను కేటాయించవచ్చు.

పార్లమెంటులో ఇటీవలి అంతరాయాలు, చాలామంది ఎంపీల సామూహిక సస్పెన్షన్‌ మన జాతీయ శాసనసభకు మేల్కొలుపు పిలుపు అనే చెప్పాలి. అత్యున్నత చర్చా వేదికగా పార్లమెంటు ఖ్యాతి ప్రమాదంలో ఉందని ఈ సంఘటనలు నొక్కి చెబుతాయి. చర్చను పెంపొందించడానికి పార్లమెంటు మెరుగైన పరిష్కారాలను కను  గొనవలసి ఉంటుంది. లేదంటే దానిపై ప్రజల విశ్వాసం నెమ్మదిగా క్షీణించే ప్రమాదం ఉంది.
చక్షు రాయ్‌ 
వ్యాసకర్త పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌లో పనిచేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు