ఎంపీలే ఎగవేతదారులైతే...?

29 Nov, 2018 01:16 IST|Sakshi

దేశానికి దిశానిర్దేశం చేయాల్సిన పార్లమెంటు సభ్యులే వ్యాపారులుగా మారి వేలకోట్లలో బ్యాంకు రుణాలను ఎగ్గొట్టడం దేన్ని సూచిస్తోంది? విజయ్‌ మాల్యా వంటి కొందరు ఎంపీలు బ్యాంకు రుణాలకు సంబంధించి అతిపెద్ద ఎగవేతదారులుగా ఆరోపణల పాలయ్యారు. ఇక నిన్నటి వరకు కేంద్రమంత్రి పదవిని చలాయించిన సుజనా చౌదరి రుణాల ఎగవేతలో అందరినీ మించిపోవడం (దాదాపు రూ.7,000 కోట్లు) యావద్దేశాన్ని దిగ్భ్రాంతిలో ముంచెత్తుతోంది. ఎంపీలు, కేంద్రమంత్రులే ఎగవేతదారులైతే దేశానికి దిక్కేమిటి? ప్రజాసేవ ముసుగులో వీరు సాగిస్తున్న అక్రమాలపై ఆర్బీఐ, కేంద్ర సంస్థలు ప్రధానంగా దృష్టి సారించాలి.

ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడన్న విషయాన్ని పార్లమెంటు సాక్షిగా వ్యాపారులైన ఎంపీలు కొందరు నిరూపిస్తున్నారు. వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగ్గొట్టడంలో ఎంపీల పాత్రే ఎక్కువ కావడం, బ్యాంకుల నికర నష్టాలకు వీరి రుణఎగవేతలే మూల కారణం కావడం ప్రమాదహేతువు. సుజనా ఇండస్ట్రీస్‌ పేరుతో సుజనా చౌదరి చేసిన ఆర్థిక అరాచకం బడా వ్యాపారుల ఎగవేతనే తలదన్నుతోంది. ఆర్పీఐకీ, కేంద్రప్రభుత్వానికి మధ్య వైరుధ్యాన్ని ఈ కోణం లోంచి చూసి తీవ్ర చర్యలు చేపట్టకపోతే దేశమూలాలే కదిలిపోవడం ఖాయం.

ఈమధ్య ఆర్బీఐకి, కేంద్రప్రభుత్వానికి జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఎవరి శ్రేయస్సు కోసం? ఈ సంఘర్షణలో నిగూఢమైన ఉద్దేశాలు ఉన్నాయా? ఈ పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థకి, తమ కష్టా ర్జితాన్ని డిపాజిట్ల రూపంలో భద్రపర్చుకున్న బ్యాంకు ఖాతాదారులకు, స్వయం ప్రతిపత్తితో అనేక ఆర్థిక సమస్యలను విజయవంతంగా ఎదుర్కొన్న ఆర్బీఐకి చేటు కల్గించేవిధంగా ఉన్నాయా? కేంద్రప్రభుత్వం ఎంచుకున్న ఈ ప్రత్యక్ష ఘర్షణాత్మక వైఖరి సరైందేనా?

కేంద్రప్రభుత్వం కోరుకుంటున్నదేమిటి?
గత సంవత్సరకాలంగా కేంద్రప్రభుత్వం అనేక దఫాలుగా ఆర్బీఐతో చర్చించినట్లు చెబుతూనే తాము ఆశించినదేమీ ఆర్బీఐ పట్టించుకోలేదని ఆరోపిస్తోంది. కనీసం వారి కోరికల్ని అర్బీఐ వారి బోర్డు సమావేశాల్లో కూడా చర్చించడం లేదని తీవ్రంగా విమర్శిస్తోంది. అసలు ప్రభుత్వానికి ఉన్న కోరికలేమిటి?

ఎ) పబ్లిక్‌ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి క్షీణించి ఉన్నందున రుణ వితరణ సమృద్ధిగా జరగటం కోసం, అభివృద్ధే ప్రధాన అంశంగా, ద్రవ్య లభ్యతకై ఆర్బీఐ చొరవ చూపాలి. బి) ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ అనే సంస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనై దాదాపు రూ. 9,500 కోట్ల మేరకు నష్ట పోయినందున దాని ప్రభావం నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలమీద తీవ్రంగా ఉండటంతో ఆర్బీఐ వీటి రక్షణకై ఒక ప్రత్యేక వ్యవస్థ (స్పెషల్‌ విండో)ను రూపొందించాలని ప్రభుత్వం కోరుకుంటోంది. వాటి కోసం కనీసం రూ. 4,200 కోట్లను బ్యాంకులకు సమకూర్చాలని కోరుకుంటోంది. సి)విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపులు (ఎఫ్‌పీఐ) కార్పొరేట్‌ బాండ్లలో 20 శాతం కంటే మించి ఎక్స్‌పోజర్స్‌ ఉండరాదన్న నిబంధనలను సడలించమని కోరుతోంది. డి) ప్రస్తుతం 11 జాతీయ బ్యాంకులపై విధించిన సత్వర దిద్దుబాటు చర్య నిబంధనలను సడలించాలని కోరుతోంది. ఇ) నిరర్థక ఆస్తుల వర్గీకరణ ఆంక్షలను సడలించి బ్యాంకులకు ఊతమివ్వాలని కోరుతోంది. ఎఫ్‌) ఏళ్లతరబడి ఆర్బీఐ దాచుకున్న లక్షల కోట్ల రూపాయల మిగులు నిధుల్లో కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి  డివిడెండ్‌ రూపంలో చెల్లించాలని కేంద్రం కోరుతోంది. జి) ప్రస్తుత వడ్డీరేట్లు తగ్గించమని ప్రభుత్వం కోరుతోంది.

పైన పేర్కొన్న విషయాలపై ఆర్బీఐతో చర్చించిన తర్వాత కూడ ఏరకమైన ప్రయోజనం లేకపోయిన తర్వాతనే సెక్షన్‌ 7 ఆర్బీఐ యాక్ట్‌ 1934 అమలు చేయాల్సి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. దాని నుంచి వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదని తెగేసి చెబుతోంది. సెక్షన్‌ 7 పేర్కొన్న విధంగా ‘ప్రజల అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్బీఐ గవర్నర్‌తో సంప్రదించిన తర్వాత ఎటువంటి ఆదేశాలనైనా ఇవ్వ వచ్చు‘ అని స్పష్టం చేస్తోంది. అయితే ఈ 83 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఇంతవరకు ఏ కేంద్ర ప్రభుత్వమూ ఆర్బీఐ మీద సెక్షన్‌ 7ని ప్రయోగించ లేదన్నది కూడా వాస్తవమే. 

ఆర్బీఐ కొన్ని కీలక అంశాల్లో కేంద్రప్రభుత్వంతో తీవ్రంగా విభేదిస్తోంది. వాటిల్లో కొన్ని. ఎ) తీవ్రమైన కీలకాంశమైన మిగులు నిధుల బదిలీ విషయంలో ఆర్బీఐ ససేమిరా అంటోంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం 60,000 కోట్ల మేరకు రిజర్వ్‌ బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ల రూపంలో చెల్లిస్తున్న నేపథ్యంలో ఇంకా నిధుల బదిలీ కుదరదని, అది ఆర్బీఐ అస్తిత్వానికే ప్రమాదమని వాదించింది. బి). నిధుల కొరతతో సతమతమవుతూ నష్టాల్లో కూరుకుపోయిన పబ్లిక్‌ రంగ బ్యాంకులకు ఊతమిచ్చే విషయంలో ఆర్బీఐ కొంతకాలం వేచి చూడాలని, ఈలోపు బ్యాంకులు తమ పరిస్థితిని తామే మెరుగుపరచుకోవాలని వాదిస్తోంది. నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ప్రతిపాదిస్తోంది. సి). బలహీన బ్యాంకులపై విధించిన సత్వర దిద్దుబాటు చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నందున వాటిని సమీక్షించాల్సిన అవసరం లేదని భావిస్తోంది. డి). తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలకు ఏ రకమైన వెసులుబాటు చర్యలు కల్పించినా అవి బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని మరింత కుంగదీస్తాయని, ఇవి డిపాజిటర్ల ప్రయోజనాల్ని మరింత దెబ్బతీస్తాయని వాదిస్తోంది. ఇ). ప్రస్తుత తరుణంలో నిరర్థక ఆస్తుల వర్గీకరణపై రూపొందించిన ప్రపంచవ్యాప్త నిబంధనలను సడలించాల్సిన అవసరం లేదని కుండబద్ధలు కొట్టినట్టు చెప్తోంది. ఎఫ్‌). వడ్డీరేట్ల తగ్గుదల విషయంలోనూ, కార్పొరేట్ల బాండ్లలో ఆర్బీఐ నిబంధన సడ లింపు విషయంలోను ఏ విధమైన పునఃపరిశీలన అవసరం లేదని చెప్తోంది. జి). రూ.14,000 కోట్ల మేరకు నీరవ్‌ మోదీ చేసిన మోసంలో, కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా ఆర్బీఐని దోషిగా పేర్కొన్న నేపథ్యంలో, తమకు మరిన్ని విస్తృత అధికారాలు ఇవ్వమని ఆర్బీఐ కోరుతోంది. 

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తాము సెక్షన్‌ 7 కింద ఆర్బీఐకి ఇచ్చిన ఆదేశాలకే కట్టుబడ్డామన్న ప్రకటన, దానికి సమాధానంగా ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ పత్రికా సమావేశం వీరిద్దరి మధ్య ఉన్న భేదాభిప్రాయాల్ని ప్రపంచానికి తెలియజేశాయి.

ఇప్పుడు వీరిద్దరి ముందున్న పరిష్కారాలు ఎ) ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విషయాలను ఆర్బీఐ ధైర్యంగానే ఎదుర్కోవాలి. బి) ప్రస్తుతమున్న 8 శాతం మూలధన నిష్పత్తి నిబంధనలను భవిష్యత్తులో 9 శాతం పెంచాలన్న ప్రతిపాదన కొద్దిగా కఠినతరమయినా వాటికి వెసులుబాటు కల్పించే విషయంలో జాగ్రత్త వహించాలి. సి) ఏళ్ల తరబడి పోగుచేసిన మిగులు నిధుల విషయంలో పరస్పరం చర్చించుకోవాలి. మూలధన కొరతతో సతమత మవుతున్న ప్రభుత్వరంగ బ్యాంకులపట్ల సానుకూలత ప్రదర్శించాలి. డి) ఆర్బీఐ కోరుకుంటున్న విస్తృత అధికారాలను పరస్పరం పంచుకో వాలి. ఇ) సెక్షన్‌ 7 ఆర్బీఐ యాక్ట్‌ ఒక్కటే కాదు, అనేక చట్టాలకు, ప్రభు త్వాలకు వ్యవస్థలలో జోక్యం చేసుకోవడానికి వీలు కల్పిస్తాయి. దాని అర్థం వ్యవస్థలను నిర్వీర్యం చేయడం కాదు.

ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అంశాలేమిటి?
2018 మార్చి నాటికి ఒక లక్షా అరవై వేల కోట్ల నిర్వహణ లాభాన్ని సంపాదించిన బ్యాంకింగ్‌ రంగం, 86 వేల కోట్ల నికర నష్టాన్ని ప్రక టించడం సమస్య తీవ్రతని తెలియజేస్తోంది. అనేక కార్పొరేట్‌ పెద్దలు బ్యాంకు రుణాలు ఎగవేసినారు. వారి వారి వ్యక్తిగత ఆస్తులను పెంచుకొ న్నారు. అనేకమంది పార్లమెంట్‌లలోను, అసెంబ్లీలలోను సభ్యులుగా ఉన్నారు. కొంతమంది మంత్రులుగాను, పూర్వపు మంత్రులుగానూ కూడా ఉన్నారు. ఈరోజు అనేకమంది పారిశ్రామికవేత్తలే పార్లమెంట్‌ సభ్యులుగా ఉన్నారు. వారు వ్యాపారాలు విరమించుకుని ప్రజాసేవ చేయడం లేదు. విజయ్‌ మాల్యా దేశం విడిచి వెళ్లేనాటికి దాదాపు 9 వేల కోట్ల రూపాయల బడా ఎగవేతదారుడైన అధికారపార్టీ పార్లమెంట్‌ సభ్యుడన్న విషయం మర్చిపోవద్దు. ల్యాంకో ఇండస్ట్రీస్‌ అధిపతి అయినా, సుజనా ఇండస్ట్రీస్‌ అధిపతి అయినా రాయపాటి సాంబశివరావు (ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ) అయినా, కావూరి సాంబశివరావు అయినా.. వీరందరూ పార్లమెంటులో సభ్యులు కావడం విశేషం. సుజ నాచౌదరి అయితే ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన నాటికే దేశంలో ఒక పెద్ద జాతీయ బ్యాంకులో డిఫాల్టర్‌గా ఉన్నారన్న విషయం బహిర్గతమే. ఈయనపై మారిషస్‌ బ్యాంకుల ఆరోపణలు అనేకం ఉన్నాయి. ఇప్పటికే వీరంతా వ్యాపారాల్లో ఉన్నవారే. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇప్పటికే వ్యాపారాలు చేస్తూనే ఉన్నారు. వారి ప్రజా సేవ అంతా డబ్బుయావతో చేస్తున్నవే.

ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వాలు వీటిమీద దృష్టి సారించాలి. కష్టార్జితాన్ని బ్యాంకులలో తమ అవసరాల కోసం డిపాజిట్లు చేసుకున్న వారి ప్రయోజనాలకు పెద్దపీట వెయ్యాలి. సీబీఐ లాంటి అత్యున్నత ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలు అనేకమంది డిఫాల్టర్లమీద, వారు ఫండ్స్‌ని వ్యక్తిగత, రాజకీయ అవసరాల కోసం దారి మళ్లించారని ఆరోపించాయి. వాటి మీద విచారించి ఆ డబ్బుని రాబట్టాలి. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని కాపాడు తూనే కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐకి అండగా నిలిచింది. ప్రభుత్వాల ప్రాథమ్యాల ఆర్బీఐకి వివరించాలి. వీటిమధ్య విభేదాలు బడా ఎగవేతదారు లకు ఎట్టిపరిస్థితుల్లోను ప్రయోజనం చేకూర్చకూడదు. ఈ విషయంలో ఆర్బీఐ, ప్రభుత్వం రెండూ పరిపక్వత ప్రదర్శించాలి. ప్రభుత్వ బడా బ్యాంకులు ఈ దేశానికి పట్టుగొమ్మలు. సామాన్యుడి డబ్బుకి భద్రత కల్పించే అత్యంత నమ్మకమైన సంస్థలు. రైతు ప్రగతికి చిన్న చిన్న రుణగ్రస్తులకు చేయూతనిచ్చే సాధనాలు. బ్యాంకులను పరిరక్షించు కోవడం వాటి ద్వారా దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడటం ఈ రెండింటి సమన్వయంమీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కొనసాగుతున్న విభేదాలు దేశానికి చేటు చేస్తాయి. రుణ ఎగవేతదారులకు కావలసిన శక్తినిస్తాయి. అందుకని ఆర్బీఐ, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా విజ్ఞతతో వ్యవ హరిస్తారని ఆశిద్దాం.


- బీఎస్‌ రాంబాబు, 
నేషనల్‌ సెక్రటరీ, ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌
మొబైల్‌ : 98666 33422 

మరిన్ని వార్తలు