లిక్కర్‌ స్కామ్‌ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు

31 Oct, 2023 05:15 IST|Sakshi

నవంబర్‌ 2న విచారణకు పిలుపు

ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక మలుపు

మోదీ సర్కారు కక్షసాధింపు: ఆప్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (55)కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోమవారం సమన్లు జారీ చేసింది. నవంబర్‌ 2న  ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఆయనకు సమన్లు జారీ అయ్యాయి. ఇదే కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఆప్‌ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసిన కొద్ది గంటలకే ఈ పరిణామం చెటుచేసుకుంది.

ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన చార్జిషీట్లలో కేజ్రీవాల్‌ పేరును ఈడీ ఇప్పటికే పలుసార్లు పేర్కొనడం తెలిసిందే. ఈ కేసు నిందితులంతా ఢిల్లీ మద్యం విధానం 2021–22 తయారీ, అమలుకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ కేజ్రీవాల్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నట్టు అందులో చెప్పుకొచ్చింది. నవంబర్‌ 2న కేజ్రీవాల్‌ స్టేట్‌మెంట్‌ను ఈడీ నమోదు చేయనుందని సమాచారం. మద్యం కుంభకోణానికి సంబంధించి అవినీతి, నేరపూరిత కుట్ర అభియోగాల్లో కేజ్రీవాల్‌ను సీబీఐ ఏప్రిల్‌ 16న కూడా 9 గంటలపాటు ప్రశ్నించింది.

మండిపడ్డ ఆప్‌
కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లపై ఆప్‌ మండిపడింది. తమ పార్టీని ఎలాగైనా అంతం చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రలు పన్నుతోందని ఆరోపించింది. అందులో భాగంగానే ఈ తప్పుడు కేసులో తమ అధినేతను ఎలాగైనా ఇరికించేందుకు నరేంద్ర మోదీ సర్కారు ఎప్పట్నుంచో ప్రయతి్నస్తోందని ఆప్‌ నేత, మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ ఆరోపించారు.

మరోవైపు, ఈ కేసులో సిసోడియా అవినీతికి సంబంధించి చాలినన్ని రుజువులున్నాయని సుప్రీం బెయిల్‌ నిరాకరణతో తేలిపోయిందని బీజేపీ పేర్కొంది. కనుక నైతిక బాధ్యత వహిస్తూ కేజ్రీవాల్‌ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ కేసులో అవినీతి జరిగినట్టు ఎలాంటి రుజువులూ లేవని కేజ్రీవాల్‌తో పాటు ఆప్‌ నేతలంతా ఇప్పటిదాకా చెప్తూ వచి్చందంతా పచ్చి అబద్ధమని రుజువైందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ అన్నారు.

ఆది నుంచీ వివాదాలే
ఢిల్లీ మద్యం విధానాన్ని 2021లో కేజ్రీవాల్‌ ప్రభుత్వం అమల్లోకి తెచి్చంది. మద్యం లైసెన్సుదారులకు నిబంధనలకు విరుద్ధంగా అనేక విధాలుగా కేజ్రీవాల్‌ సర్కారు లబ్ధి చేకూర్చిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో దీనిపై విచారణ జరపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నాటి ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆదేశించారు.

మద్యం విధానం తప్పుల తడక అని, ఎక్సైజ్‌ మంత్రిగా సిసోడియా తీసుకున్న నిర్ణయాల వల్ల ఖజానాకు కనీసం భారీ నష్టం జరిగిందని, ఆప్‌ నేతలు తదితరులు లైసెన్సుదారుల నుంచి పలు మార్గాల్లో  లబ్ధి పొందారని సీఎస్‌ నివేదించారు. ఈ వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో చివరికి 2022 జూలై 31న నూతన మద్యం విధానాన్ని కేజ్రీవాల్‌ సర్కారు రద్దు చేసింది. ఇందులో తీవ్ర అవకతవకలు జరిగాయంటూ 2022 ఆగస్టు 17న సీబీఐ కేసు నమోదు చేసింది. సిసోడియాతో పాటు 15 మందిని నిందితులుగా చేర్చింది.

మరిన్ని వార్తలు