మానవీయతకు మహావిజయం

31 May, 2019 00:30 IST|Sakshi

విశ్లేషణ

అపూర్వ విజయం అంటే నిర్వచనం ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికలలో కీ.శే వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన పార్టీని గెలిపించుకున్న తీరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకబిగిన సంవత్సరం పైగా 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, లక్షలాదిమంది  వివిధ వర్గాల, సామాజిక నేపథ్యాల ప్రజానీకాన్ని, మైనారిటీలను, మహిళలను, అణగారిన ప్రజానీకాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే వైవిధ్యభరితమైన ఆంధ్రప్రదేశ్‌ సర్వస్వాన్ని ఆకళింపు చేసుకున్న నేతగానే కాదు వారిలో ఒకరిగా తాము విశ్వసింపదగిన తమ ఆత్మీయుడిగా వైఎస్‌ జగన్‌ ఎదిగిన తీరు ప్రశంసనీయం. కీ.శే. వైఎస్సార్‌ తమ పాదయాత్ర అనంతరం – ‘నాలో కోప నరం లేదు తెగిపోయింది’ అనిచెప్పిట్లుగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన ఈ పాదయాత్ర అనంతరం ఒక ఉత్తమ మానవుడిగా పరిణతి చెందడం అందరూ గమనించే ఉంటారు. ఈ విజయంలో ఆయన హీరో అయినా హీరో ఒక్కడే సర్వం సాధించలేడు. అతడు దిశా నిర్దేశం చేసి ఈ ప్రజాభ్యున్నతి మహా యజ్ఞంలో తొలి రుత్వికుడుగా నిలవగలడు. జగన్‌ అది చేశారు కానీ ఈ మేటి విజయంలో వైఎస్సార్‌ సహధర్మచారిణి శ్రీమతి విజయలక్ష్మి స్ఫూర్తిదాయకమైన పాత్ర అనిర్వచనీయం. ఒక వంక తన ప్రియతముడైన భర్త, తన మనిషి లేని లోటుతో కన్నీరు చిప్పిల్లుతుం డగా, మరో కంట తన కొడుకు తన భర్త అడుగుజాడల్లో ఆ రీతిగానే ప్రజారాధన చూరగొనే విధంగా తండ్రికి తగ్గ తనయుడిగా ధీశాలి అవుతున్నందుకు ఆనంద భాష్పాలతో ఉప్పొంగుతుండగా ఆమె అందించిన ఆశీర్వాదాలు సాటిలేనివి. కనిపాలిచ్చి పెంచి ఇంతటి వాడిని చేసిన, తన ఆశాజ్యోతి జగన్‌పై హత్యా ప్రయత్నం ఆమెనెంతగా కలిచివేసిందో! అయినా తనను తాను నిభాయించుకుని తెలుగుజాతి వీరవనితల సాటిగా, స్వయంగా ఎన్నికల రణప్రవేశం చేసి ప్రజల మధ్యకు వచ్చి ఆమె చేసిన ప్రసంగం ఎంతమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసిందో! అలాగే ప్రజాక్షేత్రంలో తన అన్నకు తోబుట్టువుగా, తనకంటూ నెలకొల్పుకున్న ప్రత్యేక వ్యక్తిత్వంతో తన అన్న జగన్‌కి అండగా నిలిచిన సోదరి షర్మిల కృషి, పట్టుదలను అభినందించడానికి సాధారణ పదాలు సరిపోవు. ఆమె ‘బై బై బాబు’ అంటూ బాబుకు వీడ్కోలు నిచ్చినట్లు చేసిన నినాదం జనన్నినాదమయింది. అలాగే జగన్‌ సతీమణి శ్రీమతి భారతి ఎంతో బాధ్యతగల వ్యక్తి. నిండుకుండలా తెరచాటుగా ఉంటూనే సూత్రధారిగా ప్రదర్శించిన హుందాతనాన్ని కూడా మరవలేం. 

ఈ మొత్తం క్రమంలో సమాజంలో కుటుంబ వ్యవస్థకు కూడా వైఎస్‌ కుటుంబం మచ్చుతునకలా నిలిచింది. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌పై ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలలే హత్యాప్రయత్నం చేయించి ఉంటారన్నట్లు మాట్లాడి తమ అల్పత్వాన్ని ప్రదర్శించిన తెలుగుదేశం నేతలను తల్చుకోవడం కూడా ప్రస్తుత సందర్భంలో తగని పని అయినా, వాళ్ల వ్యాఖ్యల్లోని కుసంస్కారానికి క్షోభించిన వారిలో ఒకరిగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నందుకు క్షమార్హుడను. కానీ ఒక ఔన్నత్యాన్ని కొనియాడవలసినప్పుడు తద్భిన్నమైన అధోగతిని సరిపోల్చడం ముఖ్యమే అవుతుంది. అందుకే మానవత్వం మూర్తీభవించిన కుటుంబ బాంధవ్య ప్రస్తావనలో ఈ రకమైన సరిపోల్చడాలు తప్పవు. పైగా టీడీపీ నేతలకు తమ అధినేత తన తోబుట్టువుల పట్ల వ్యవహరించిన తీరు గురించి తెలిసే ఉంటుంది.!!

జగన్‌మోహన్‌ రెడ్డికి కలిసి వచ్చిన అంశం. తెలుగు ప్రజలపట్ల ముఖ్యంగా అణగారిన పేదల గుండెల్లో స్థిరనివాసం ఏర్పర్చుకున్న తన కన్నతండ్రి వారిపట్ల చూపిన ఆలన, పాలన! అది ఒక ఆదర్శంగా నిలుస్తుంది. మరోవంక, ఎలా అమానవీయంగా రాజకీయం చేయరాదో, ఎలా ప్రజలను దిగజార్చేలా పాలన చేయరాదో, చంద్రబాబు గత అయిదేళ్ల పాలనలో జగన్‌ చాలా స్పష్టంగా చూశారు. ఆవిధంగా తాను ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టే నాటికి ప్రజానేతగా ఉంటూ వారిలో ఒకరిగా నిలుస్తూ, ‘జగన్‌ తమవాడు, తమకు ప్రీతిపాత్రమైన నాయకుడు, తమ కష్టసుఖాలనెరిగి తమకు వెన్నుదన్నుగా నిలిచే తమ ప్రాణస్నేహితుడు’ అనుకునే రీతిలో తనను తాను రోజురోజుకు మరింత చేరువగా మలుచుకోగల ఆదర్శమూ ఉంది. అలాగే కేవలం అధికారంలో కొనసాగడమే లక్ష్యంగా అందుకు ఎన్ని అసత్య వాగ్దానాలు చేసినా ఎంతటి అహంకారంతో వ్యవహరించినా, ఎంత అవినీతి అక్రమాలకు ఒడిగట్టినా తప్పులేదు అన్నట్లు వ్యవహరిస్తే అది తాత్కాలిక భోగమే కానీ ప్రజలు వాస్తవాలు గ్రహించలేని అమాయకులు కాదు. తీవ్రమైన తప్పిదాలకు తీవ్రమైన శిక్ష విధించే తీరుతారు అన్నది 2019 ఎన్నికలలో చంద్రబాబుకు ఓటమిరూపంలో సాకార ఉదాహరణగా ఉంది. జగన్‌కు నిరంతర విద్యార్థి లాంటి అసక్తి, ప్రజానుకూలంగా నిర్ణయాలు తీసుకుని వ్యవహరించగల శక్తీ ఉన్నాయని తాను ప్రజలకు వాగ్దానం చేసిన నవరత్న పథకాలు ఒక్క ‘మెతుకు’లా కనబడుతుంది. కనుక ఇక 2014 నుంచి సాగిన చంద్రబాబు పీడకలవంటి పాలన తిరిగి మన ప్రజలు ఇకపై ఎన్నడూ అనుభవింపకుండా పాలనా వ్యవస్థ భ్రష్టత్వాన్ని మార్చవలసిన బాధ్యత కూడా వైఎస్‌ జగన్‌పై ఉంది. 

ఒక పార్టీ అధినేత ప్రవర్తనే సహజంగా తరతమ స్థాయిల్లో ఆ పార్టీ వివిధ స్థాయిల్లోని నేతల్లో ప్రతిబింబిస్తుంది. తమ దుర్భర జీవితాలను గూర్చి విన్నవించుకునేందుకు వచ్చిన వారిని వారు నిరుపేద మత్స్యకార్మికులా, మహిళలా అని కూడా చూడకుండా చూపుడు వేలు చూపించి ‘ఏం తమాషాగా ఉందా? అంతు చూస్తాను ఏమనుకుంటున్నారో’ అని బెదిరించే పాలకుడికి ‘అసలు వీళ్లను ఇక్కడి దాకా రానిచ్చిందెవరు?’ అని తన కింది స్థాయి అధికార బృందాన్ని ఆదేశించే పాలకుడికి అలాంటి అధికార అహంకారత్వం మూర్తీభవించిన అనుచరగణమే ఉంటుంది! అందుకే ఈ అయిదేళ్లలో మన రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అలాంటి పాలకపక్ష నేతలను చూశాం! అసలు శాసన సభాపతిగా ఉండిన కోడెల శివప్రసాద్‌ ఎన్నికల సమయంలో పోలింగ్‌ స్టేషన్‌లోకి మందీ మార్బలంతో వెళ్లి పోలింగ్‌ బూత్‌ను ఆక్రమించుకుని రిగ్గింగ్‌కు పాల్పడ ప్రయత్నిస్తే, జనం తిరగబడేసరికి తన చొక్కా తానే చింపుకుని తన వైద్యవిద్య ద్వారా నేర్చుకున్న స్పృహ కోల్పోయిన రోగిలా నటించిన కోడెల తెలుగుదేశం పార్టీ వరిష్ట నేతల్లో ఒకరే! అక్రమ ఇసుక రవాణాను తన విద్యుక్త ధర్మంగా అడ్డుకో ప్రయత్నించిన ఒక మహిళా తహసీల్దారును జుట్టుపట్టుకుని బిరబిరా ఈడ్చేసి ఆమె విలపిస్తూ ఉంటే వికటాట్టహాసం చేసిన మహానుభావుడూ తెలుగుదేశం పార్టీ నేతే! కీచక ప్రవృత్తితో వ్యవహరించిన అధికార పార్టీ అనుయాయులు, అప్పులిచ్చి అవసరానికి అప్పు తీసుకున్న కుటుంబాలకు కుటుంబాలనే అధోగతి పాల్జేసిన సెక్స్‌ మనీ రాకెట్‌ కుంభకోణాలలో చిక్కి కూడా ప్రభుత్వ అండతో తప్పించుకుతిరిగినవారూ చంద్రబాబు టీడీపీ స్థానిక నాయకులే.. ఇలా ఎన్నని చెప్పుకోగలం? వీరందరి ప్రవర్తనతో విసిగి వేసారి, అధికార దర్పం ముందు నోరెత్తలేని అమాయకులెందరో ఉన్నారు. అలాంటి దుర్మార్గాలకు పాల్పడే తన పార్టీవారిని అదుపులో ఉంచదలచని, ఉంచలేని నాయకత్వానికి చిహ్నంగా బాబు ఉన్నారు. ప్రజాప్రతినిధులు ఇకపై ఎలా ప్రవర్తించకూడదు అన్నదానికి ఇలాంటివి ప్రత్యక్ష రూపాలు!

కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక మంచిమనిషి నాతో ఇలా అన్నాడు. ‘‘మా కులాన్ని ప్రజానీకాన్నుంచి వేరు చేసి మాకు అప్రతిష్ట తెచ్చింది మా చంద్రబాబేనండీ, నిజానికి అవకాశాన్ని అందుకుని నూతనత్వాన్ని స్వీకరించి, నిరంతరం కృషిచేసే వాళ్లు ఎందరో మాలో ఉన్నారు. కానీ తాను చేరదీసిన కొందరు మావాళ్ల ప్రవర్తనను అదుపులో పెట్టకపోగా అండగానిలిచి ప్రజలలో మా పట్ల వ్యతిరేకత తెచ్చింది ఈ చంద్రబాబేనండీ!’’ అని కళ్లొత్తుకుంటూ చెప్పాడాయన. అలాగే తనకు మందీమార్బలం కావాలనీ, నీరు–చెట్టు, జన్మభూమి కమిటీల వంటివాటితో చంద్రబాబు మూటగట్టుకున్న ముల్లె ఏమో కానీ, సంపాదించుకున్న అప్రతిష్ట ఎంత? పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు వరప్రదాయిని అంటూనే పోలవరాన్ని తమ పార్టీకి, తనకు, తమ నేతలకు అక్షయపాత్రలుగా అవినీతి ధనరాసులు చేకూర్చే ‘వరం’గా మార్చిందీ చంద్రబాబే. దీనికోసమే ఆయన  కేంద్రం నుంచి ఆ ప్రాజెక్టు నిర్మాణం తన అధీనంలోకి ఒప్పించి, మన రైతులను నొప్పించి, తన అధీనంలోకి తెచ్చుకున్నాడన్న విషయం ఆయన అనుయాయులైన అమాత్యులు, కాంట్రాక్టర్‌ నేతల వల్లనే బయటపడింది.

రాజధాని నిర్మాణం గురించి చెప్పటం అంటే గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకున్నట్లే! అడుగడుగునా అవినీతే, అసమర్థతే! మూడు పంటలు పండే ఆ ప్రాంతంలో భూమాతను చెరబట్టి ఆ పేరుతో వేలాది ఎకరాలు, నాడు హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టి చంకన పెట్టుకున్నట్లే తాను, తన అనుయాయులు, వ్యవహరించిన తీరు, ఆ ప్రాంత ప్రజలకు గుర్తున్నది. అందుకే సింగపూర్‌లా మారనుందని భ్రమింపజేసిన ఆ ప్రాంత ప్రజలే మంగళగిరిలో బాబు సుపుత్రుడు లోకేశ్‌ని ఓడించారు. చంద్రబాబు ఏమాత్రం అర్హత, ప్రజా ఉద్యమానుభవం లేని లోకేశ్‌ని మంత్రివర్గమేదో తన తాతముత్తాతల జాగీరు అన్నట్లు, దొడ్డిదారిన ఎంఎల్‌సీని చేసి అంతటితో ఆగకుండా, అతడికి మంత్రివర్గంలో స్థానం కూడా ఇచ్చారు. లోకేశ్‌ అప్రకటిత, తదుపరి ముఖ్యమంత్రి అన్నట్లుగా ఆ తండ్రీ కొడుకులు ప్రవర్తించారు. ఫలితం అందరం చూశాం. అప్రదిష్ట ఇద్దరూ మూటగట్టుకున్నారు. కోట్లు ఖర్చుపెట్టినా కొడుకు లోకేశ్‌ మంగళగిరిలో గెలవలేదు!

ఈ సందర్భంగా నేను మా కమ్యూనిస్టు పార్టీలకు, వారి కార్యకర్తలకు ఒక విషయం స్పష్టం చేయదల్చుకున్నాను. పార్టీ అభివృద్ధికి, ప్రజాసేవకు మించిన మార్గం లేదు. ప్రజాసేవ అంటే కష్టాలలో ఉన్న ప్రజలను వస్తురీత్యా ఆదుకోవడం మాత్రమే కాదు. సర్వ సృష్టి నిర్మాతలు, భవితవ్య నిర్ణేతలు రెక్కాడినా డొక్కాడని ఈ ప్రజలే! దళితులూ, మహిళలూ, మైనారిటీలూ తదితరులకు ఎక్కడ ఏ రూపంలో అన్యా యం జరిగినా అక్కడ కమ్యూనిస్టులు వారికి అండగా నిలవాలి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజానుకూల నిర్ణయాలు తీసుకుంటే వాటికి అండగా ఉండటం, ప్రజావ్యతిరేక అంశాలు పాలనలో దొర్లితే ప్రజా ఉద్యమాలతో అవి ప్రభుత్వం దృష్టికి వచ్చేలా చేయాలి. ఇలాంటి ప్రజా ఉద్యమాలే కమ్యూనిస్టు పార్టీలకు ఊపిరి. అంతే తప్ప పాలనను మార్చే పేరుతో చంద్రబాబు, పవన్‌ వంటి నిబద్ధత లేని వారితో ‘ఐక్యవేదిక’లు, ‘ఐక్య సంఘటన’లు వంటి అడ్డదారులు తొక్కడం వంటివి కమ్యూనిస్టులను గమ్యాన్ని చేర్చలేవు. ఒక్కమాటలో చెప్పాలంటే కమ్యూనిస్టు పార్టీ అణగారిన ప్రజలందరి పార్టీ. అదే రీతిలో పునరంకితమై, ప్రాథమిక స్థాయి నుంచి ఆరంభించడం అత్యవసరం. ఏ విధమైన న్యూనతా భావానికి గురికాకుండా సృజనాత్మకతతో, నిజాయితీగా, ఆత్మవిశ్వాసంతో కమ్యూనిస్టులు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆశిద్దాం.

వ్యాసకర్త : డాక్టర్‌ ఏపీ విఠల్‌ , మార్క్సిస్టు విశ్లేషకులు
 మొబైల్‌ : 98480 69720

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు