ఫ్రంట్‌తోనే ఆధిపత్యానికి చెక్‌!

31 Mar, 2018 01:34 IST|Sakshi
సీఎం చంద్రశేఖర్‌ రావు

సందర్భం

కేంద్రం లేదా జాతీయ పాలక పార్టీల ఆధిపత్యాన్ని సవాలు చేయటానికి సిద్ధపడే ఏ కూటమైనా.. ఉదారవాద ఆర్థిక విధానాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోతున్న ఆర్థిక స్వాతంత్య్రం సార్వభౌమత్వాన్ని ఎజెండాగా మార్చకపోతే ఫలవంతం కాదు.

రాజకీయాలు కూడా ఉపాంత ప్రయోజనం సూత్రానికి అతీతం కాదన్న విషయం గత నాలుగేళ్లుగా సాగుతున్న మోదీ పర్వం చూస్తే అర్థమవుతుంది. 2014లో కాంగ్రెస్‌ ముక్త భారత్‌ నినాదంతో అధికారానికి వచ్చిన బీజేపీ నేడు ప్రతిపక్ష ముక్త భారత్‌ నినాదమిస్తోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ కోల్పోయిన శక్తిని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది. విధానపరంగా చూసినపుడు బీజేపీకి నికరమైన ప్రతిపక్షంగా ఉన్నది వామపక్షం మాత్రమే. సాధారణ ప్రతిపక్షాలను ఎదుర్కోవటానికి అనుసరించే వ్యూహానికి విధానపరమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కోవటానికి అనుసరించే వ్యూహానికి మధ్య తేడా ఉంటుంది. 

అందుకే బీజేపీ మోదీ నేతృత్వంలో ముప్పేట వ్యూహాన్ని అనుసరిస్తోంది. మొదటి వ్యూహం కాంగ్రెస్‌ తిరిగి కోలుకోకుండా చేసే ప్రయత్నం. రెండో వ్యూహం విధానపరమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వామపక్షాల పాత్రను కుదించే యత్నం. త్రిపుర ఎన్నికల్లో బీజేపీ ఆరెస్సెస్‌లు అనుసరించిన వ్యూహం ఈ కోవకే వస్తుంది. మూడోది అవసరమైన మిత్రులను కూడదీసుకుని, అవసరం లేని మిత్రులను సాగనంపే వ్యూహం. తాజాగా చర్చనీయాంశమవుతోంది ఈ మూడో వ్యూహమే. 

2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగల సంఖ్యాబలం సమకూరటంతో సంకీర్ణ రాజకీయాలకు తెరపడనున్నదా అన్న ప్రశ్నను ముందుకు తెచ్చారు. నాలుగేళ్లు గడిచాక తిరిగి దేశం ఆ ప్రశ్నను గుర్తు తెచ్చుకొంటోంది. పార్లమెంట్‌లో ఉన్న సంఖ్యాబలం పొందికను పరిశీలిస్తే గత పాతికేళ్లుగా ప్రాంతీయ పార్టీలు కనీసం సగం స్థానాలు గెల్చుకుంటూ వచ్చాయి. దేశవ్యాప్తంగా పోటీ చేసే కాంగ్రెస్‌ బీజేపీలు ఉమ్మడిగా సగం స్థానాలకు మాత్రమే పరిమితమ వుతూ వచ్చాయి. బీజేపీ తన రాజకీయాధిపత్యాన్ని కొనసాగించుకోవాలంటే ప్రాతీయ పార్టీల కోటలకు గండి కొట్టకుండా సాధ్యంకాదు. 

ప్రతిపక్ష రహిత పార్లమెంటరీ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది. గత మూడేళ్లుగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల బీజేపీ అనుసరించిన వైఖరి, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని (దుర్‌) వినియోగిస్తున్న తీరు గమనిస్తే రాజకీయ రంగంలో బీజేపీ అనుసరిస్తున్న పెత్తందారీ పోకడలు ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తు చేస్తున్నాయి. కాంగ్రెస్‌ అథారిటేరియనిజంకి వ్యతిరేకంగా నాటి ప్రతిపక్షాలు జట్టుకట్టాయి. భారత రాజకీయాల్లో అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా సాగిన పోరాటం ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటంగా గుర్తింపు పొందింది. సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం సాగించే రాజకీయ పోరాటం రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్న వ్యూహంతో ముడిపడి ఉంది. 

ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల హక్కుల కోసం వివిధ రాష్ట్రాలు గొంతెత్తుతున్నాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి నడుం కడితే రాష్ట్రాల ఆర్థిక హక్కుల పరిరక్షణ కోసం కేరళ వామపక్ష ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల పరిరక్షణ నినాదం ముందుకొచ్చినపుడు గత మూడు దశాబ్దాలుగా అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు ప్రత్యామ్నాయం వెతక్కుండా రాష్ట్రాల హక్కులు పరిరక్షించుకోవటం సాధ్యం కాదు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం నేపథ్యంలోనే రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను సంఘటితం చేస్తూ సర్కారియా కమిషన్‌ తెరమీదకు వచ్చింది. అది కల్పించిన ప్రత్యేకతలన్నీ ఆర్థిక విధానాల నేపథ్యంలో కుదించుకుపోతూ వచ్చాయి. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం నియమించే ఆర్థిక సంఘాలు  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక ద్రవ్య సంబంధాలను ఉదారవాద విధానాల చట్రం పరిధి దాటిపోకుండా చూస్తున్నాయి. 

రాష్ట్రాల హక్కుల కోసం, కేంద్రం లేదా జాతీయ పాలక పార్టీల ఆధిపత్యాన్ని సవాలు చేయటానికి సిద్ధపడే ఏ కూటమైనా.. ఉదారవాద ఆర్థిక విధానాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోతున్న ఆర్థిక స్వాతంత్య్రం, సార్వభౌమత్వాన్ని ఎజెండాగా మార్చకపోతే ఫలవంతం కాదు. ప్రాంతీయ పార్టీల కూటమి గానీ లేదా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ గానీ రాజ్యాంగ స్ఫూర్తి, కేంద్ర  ప్రభుత్వాల పెత్తందారీ పోకడలు, లౌకికతత్వ పరిరక్షణ, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక స్వావలంబన విధానాలు అమలు జరపగలిగే స్వేచ్ఛ, అంతిమంగా రాజ్యాంగంలోని సమాఖ్యస్ఫూర్తి పరిరక్షణ లక్ష్యాలుగా పెట్టుకోవాలి. బీజేపీ పెత్తందారీ పోకడలను నిలువరించటమే నేటి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం లక్ష్యంగా మారాలి.

- కొండూరి వీరయ్య
వ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు ‘ 98717 94037

మరిన్ని వార్తలు