వార్నర్‌ లేని సన్‌రైజర్స్‌...

31 Mar, 2018 01:35 IST|Sakshi
రషీద్‌ఖాన్, భువనేశ్వర్

 మరో 7 రోజుల్లో..

2014లో 528 పరుగులు ...2015లో 562...2016లో 848...2017లో 641...సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున గత నాలుగేళ్లు డేవిడ్‌ వార్నర్‌ ప్రదర్శన ఇది. ఒంటి చేత్తో అతను మ్యాచ్‌లు గెలిపించాడు.  2014 నుంచి 59 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌ 52.63 సగటు, 147.71 స్ట్రైక్‌ రేట్‌తో 2,579 పరుగులు చేశాడు. ఇందులో 26 అర్ధ శతకాలు, ఒక శతకం ఉన్నాయి. ఇదే సమయంలో జట్టంతా చేసిన పరుగులు 6,292. సగటు23.74 కాగా, స్ట్రైక్‌ రేట్‌ 123.98 మాత్రమే. వీటిలో 28 అర్ధ శతకాలున్నాయి.

ఇప్పటివరకు సన్‌రైజర్స్‌ జట్టులో వార్నర్‌ ఆట ఒక ఎత్తు అయితే మిగతా ఆటగాళ్ల ఆట అంతా ఒక ఎత్తు. 2016లో విశ్వరూపం చూపించిన వార్నర్‌ ఏకంగా 848 పరుగులు చేసి ఫ్రాంచైజీని విజేతగా నిలిపాడు. 10 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా తన హార్డ్‌ హిట్టింగ్‌తో మెరుపు ఆరంభం దక్కేది. చివరకు జట్టుకు గౌరవప్రద స్కోరు అందేది. బ్యాటింగ్‌లో వార్నర్‌ వేసిన పునాదిపై భువనేశ్వర్, రషీద్‌ఖాన్‌ వంటి బౌలర్లు గెలుపు మేడ కట్టేవారు.

అతడి చురుకైన ఫీల్డింగ్‌ కూడా ఎంతో మేలు చేసేది. నిలకడ లేమితో సతమతం అవుతున్న శిఖర్‌ ధావన్‌ వార్నర్‌ సహచర్యంతోనే తిరిగి గాడిన పడ్డాడని చెప్పొచ్చు. ఇలాంటి ఆటగాడు ఇప్పుడు ఐపీఎల్‌కు దూరం కావడం ఫ్రాంచైజీకి పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. కొత్త సీజన్‌లో భారమంతా ధావన్, మనీశ్‌ పాండేలపై పడనుంది. వార్నర్‌ స్థానంలో మంచి హిట్టర్లయిన గప్టిల్, కుశాల్‌ పెరీరా, హేల్స్, మోర్గాన్, లెండిల్‌ సిమ్మన్స్, క్లాసెన్‌లలో ఒకరిని ఎంచుకుంటే సన్‌ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండవచ్చు.  

విలియమ్సన్‌ ఏం చేస్తాడో!
వార్నర్‌ స్థానంలో కెప్టెన్‌ ఎవరా..? అని ఆలోచిస్తున్న అభిమానులకు విలియమ్సన్‌ నియామకం ఆశ్చర్యపర్చింది. జట్టులో చోటే కష్టమైన అతడికి ఏకంగా సారథ్యం అప్పగించడం సాహసమే అని చెప్పాలి. గత మూడు సీజన్లలో సన్‌రైజర్స్‌కు 15 మ్యాచ్‌లాడిన విలియమ్సన్‌ 411 పరుగులే చేశాడు. ఇందులో మూడే అర్ధ శతకాలు. స్వదేశంలో ఇటీవలి ముక్కోణపు టి20 టోర్నీ సందర్భంగానూ పొట్టి ఫార్మాట్‌లో అతడి ఆటతీరుపై విమర్శలు వచ్చాయి. అయితే... తర్వాతి మ్యాచ్‌లో అతడు 46 బంతుల్లో 72 పరుగులు చేసి వాటికి జవాబిచ్చాడు.

సాంకేతికతలో తిరుగులేని ఈ కివీస్‌ సారథి మూడేళ్ల ఐపీఎల్‌ స్ట్రైక్‌ రేట్‌ 129.24. దీనిని అతడు మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో ధావన్, మనీశ్‌ పాండే వంటివారితో మంచి భాగస్వామ్యాలు నమోదు చేయాలి. చివర్లో యూసుఫ్‌ పఠాన్, హుడా వంటి హిట్టర్లు చెలరేగితే జట్టు భారీ స్కోరు చేయగలుగుతుంది. ఇక వైస్‌ కెప్టెన్‌ హోదా దక్కిన పేసర్‌ భువనేశ్వర్‌పైన కూడా పెద్ద బాధ్యత ఉంది. తక్కువ స్కోరు చేసిన మ్యాచ్‌లో భువీ, రషీద్‌ఖాన్, షకిబ్‌ల బౌలింగ్‌ ప్రతిభే గట్టెక్కించగలుగుతుంది. వనరులను వినియోగించుకోవడం, వ్యూహాలు పన్నడం వంటివి కెప్టెన్‌గా విలియమ్సన్‌ సామర్థ్యానికి పరీక్షే.  

సన్‌రైజర్స్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), ధావన్, మనీశ్‌ పాండే, రికీ భుయ్, సచిన్‌ బేబీ, తన్మయ్‌ అగర్వాల్, భువనేశ్వర్, రషీద్‌ఖాన్, థంపి, సిద్ధార్థ్‌ కౌల్, ఖలీల్‌ అహ్మద్, నటరాజన్, సందీప్‌శర్మ, స్టాన్‌లేక్, షకీబ్, హుడా, కార్లోస్‌ బ్రాత్‌వైట్, యూసుఫ్‌ పఠాన్, నబీ, జోర్డాన్, బిపుల్‌ శర్మ, మెహదీ హసన్, వద్ధిమాన్‌ సాహా, శ్రీవత్స్‌ గోస్వామి.         
– సాక్షి క్రీడా విభాగం
 

మరిన్ని వార్తలు