అసమానత్వంపై పోరే అసలు విముక్తి

8 Mar, 2019 03:31 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినో త్సవం జరుపుకుంటున్న సందర్భంలో మనం ఉన్నాం. గతం కంటే మహిళలకు మహిళా దినం జరుపుకోవాలనే స్పృహ పెరిగింది. దీనితోపాటు మార్చి 8 స్ఫూర్తిని పక్కదారి పట్టించే ప్రయత్నాలు కూడా గత 15 సంవత్సరాలుగా సాగుతున్నాయనేది మరో వాస్తవం. ‘హ్యాపీ ఉమెన్స్‌ డే’ అంటూ వారం రోజుల ముందు నుండే బహుళజాతి కంపెనీలు టీవీ లలో ప్రకటనలు గుప్పిస్తుంటారు. 170 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులను చూస్తే... మానవ హక్కులు మహిళల హక్కులుగా పరిణామం చెందని రోజులవి.

1848లో అమెరికా బట్టల ఫ్యాక్టరీల్లో కార్మిక మహి ళలు 10 గంటల పని దినం, సమాన పనికి సమాన వేతనం, మెరుగైన పని పరిస్థితుల కోసం గడ్డకట్టిన చలిలో ర్యాలీలు, సమ్మెలు, వాకౌట్‌లు చివరికి ప్రాణ త్యాగాలు కూడా చేసి చరిత్రలో నిలిచిపోయారు. మహిళా ట్రేడ్‌ యానియన్లను ఏర్పాటు చేసుకు న్నారు. కార్మిక మహిళల పోరాటాలతో మహిళల ఓటు హక్కు ఉద్యమం కూడా జత కలిసింది. నాటి నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా రకరకాల డిమాండ్లతో మహిళలు తమ హక్కుల సాధన కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి లైంగిక వేధిం పులకు వ్యతిరేకంగా సమాన వేతనం కోసం జరిగిన ‘మీటూ’ ఉద్యమం పెద్దదిగా చెప్పుకోవచ్చు.

చేదునిజం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా దేశ పార్లమెంట్లలో మహిళల వాటా నేటికీ 22 శాతం మాత్రమే, భూమిపై హక్కులు 20 శాతంకన్నా తక్కువ కాని మహిళా కూలీలు మాత్రం 43 శాతంగా ఉంటూ సమానత్వానికి సుదూర స్థాయిలో ఉన్నారు. ఇక భారత్‌ మహిళల పరిస్థితి నాలుగేళ్లలో ప్రమాద కర స్థాయికి చేరిందని రాయిటర్‌ సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. రాజకీయ రంగంలో మహిళల పరి స్థితి 188లో భారత్‌ 147వ స్థానంలో ఉందంటే మోదీ ప్రభుత్వం మాటలకు, చేతలకు పొంతన లేద నేది ఒక వాస్తవం.

హిందూత్వ సంస్కృతి, సంప్రదా       యాల గురించి మాట్లాడుతున్న బీజేపీ దృష్టిలో స్త్రీ అంటే నాలుగు గోడల మధ్య ఉంటూ ఇంటికి, పిల్లలకి, భర్తకు సేవ చేస్తూ ఉండాలి. అమ్మాయిలపై అత్యాచారాలు జరగడానికి వారు వేసుకునే జీన్స్‌ పాంట్లు, టీషర్టులే కారణమని వాదిస్తున్నారు. కశ్మీర్‌ కథువా బీజేపీ పాలిత ప్రాంతాల్లో జరుగుతున్న మైన ర్లపై అత్యాచారాల్లో రాజకీయ నాయకులే భాగమై నారు. ఎప్పటిలాగే చట్టం వారిని రక్షిస్తున్నది. పైగా చట్టసభల్లో మైనర్లపై అత్యాచారం జరిపితే ఉరిశిక్షలు అమలు చేస్తామని చట్టాలను రూపొందిస్తున్నారు. మనువాద బ్రాహ్మణీయ హిందూత్వ సంస్కృతి అమ లులో ఉన్నంత కాలం మహిళలపై హింస ఆగదు.

ఈ ప్రభుత్వాలే మరోవైపు ఆధునిక జీన్స్‌ మార్కెట్‌కు పేరున్న డెనిమ్‌ లాంటి బహుళజాతి కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందాల పోటీలను గల్లీనుండి మహానగరాల వరకు ఆహ్వానం పలుకుతున్నారు. అందాల పోటీలను గల్లీనుంచి మహానగరాల వరకు అనుమతులివ్వడంతో సెక్స్‌ వ్యాపారం, ట్రాఫికింగ్, టూరిజం, సినిమాలలో విదేశీ పెట్టుబడులు, ఇంటర్నెట్, సెల్‌ఫోన్, కాస్మో టిక్స్‌ మార్కెట్‌ యథేచ్చగా నడుస్తున్నాయి. చట్టాల ద్వారా శిక్షపడేది చాలా తక్కువ. అది కూడా పేదలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలకు మాత్రమే. కోర్టుల చుట్టూ తిరగలేక బాధితులు కోర్టులపై విశ్వాసాన్ని కోల్పోతున్నారు.

2014 మేనిఫెస్టోలో మహిళలు జాతి నిర్మాతలు అన్న మోదీ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టంలో మార్పులు తేవడంవలన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 80 శాతం మహిళలు గ్రామ పరిపాలనకు దూరమయ్యారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఊసే లేదు. నేటి పాలకులకు దళిత మహిళలు మనుషులే కాదు. ఇన్ని అరాచకాలు మహిళలపై జరు గుతున్నా, పీడిత మహిళలవైపు నిలిచినా, పాలకు లను ప్రశ్నించినా మహిళా నాయకులను దేశ వ్యాప్తంగా ఉపా చట్టంతో నెలల తరబడి జైళ్లలో నిర్బంధిస్తున్నారు. వీళ్లను అర్బన్‌ నక్సలైట్లుగా పత్రి కలలో తాటికాయంత అక్షరాలతో ప్రచారం చేస్తారు.

ఇక రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాల్లో, కుటుంబ హింసలో ముందే ఉండి శిక్షలు కూడా తక్కువ శాతం పడుతున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కుల దురహంకార హత్యలు విపరీతంగా పెరిగాయి. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ లేని పరిస్థితి ఉన్నది. ఈ క్రమంలోనే మాదిగ కులానికి చెందిన సుశ్రూత కొడుకు దేవర్శల దారుణ హత్య, సజీవ దహనం, ప్రణయ్‌ హత్య, అమృతపై వేధింపులు మహిళలకు ముప్పును కలిగిస్తున్నాయి.

మహిళల చైతన్యం, వ్యక్తిత్వం, ఆమెపట్ల దాడులకు పురికొల్పుతున్నాయి.. అదేసమయంలో పురుషుడి ఆధిపత్యం, స్త్రీ అంటే విలాస వస్తువని, సొంత ఆస్తి అనే భావజాలం మరింత పెరుగుతున్నది. స్త్రీ పురు షుల మధ్య అంతరాలు పాలకుల విధానాలవల్ల మరింత పెరుగుతున్నాయి. స్త్రీలు పురుషుల బాని సలు కాదని పితృస్వామ్య సంకెళ్లను తెంపుకుని అంత ర్జాతీయ మహిళాదినంను ప్రతిపాదించిన క్లారాజె ట్కిన్‌ సూచించిన స్త్రీ విముక్తి మార్గమే నేడు కూడా శాస్త్రీయమైనది. సవ్యమైనది. (నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం)

వ్యాసకర్త: అనిత, రాష్ట్ర అధ్యక్షురాలు, చైతన్య మహిళా సంఘం anithacms@gmail.com

మరిన్ని వార్తలు