ఎర్నెస్ట్‌ హెమింగ్వే

12 Feb, 2018 00:51 IST|Sakshi
ఎర్నెస్ట్‌ హెమింగ్వే (ఫైల్‌ ఫొటో)

గ్రేట్‌ రైటర్‌

రచయిత కాకమునుపు పాత్రికేయుడిగా పనిచేశారు ఎర్నెస్ట్‌ హెమింగ్వే (1899–1961). నేపథ్యానికి మరీ ఎక్కువ పదాలు వృథా చేయకుండా, తక్కువ మాటల్లో ఉపరితల సారాన్ని చేరవేయగల ప్రజ్ఞ అలా అబ్బింది. అదే ‘ఐస్‌బెర్గ్‌ థియరీ’(మంచుకొండ సిద్ధాంతం) శైలిగా ఇరవయ్యో శతాబ్దపు కాల్పనిక సాహిత్యం మీద అత్యంత ప్రభావం చూపింది. ఆయన, ‘ద సన్‌ ఆల్సో రైజెస్‌’, ‘ఎ ఫేర్‌వెల్‌ టు ఆర్మ్స్‌’, ‘ఫర్‌ హూమ్‌ ద బెల్‌ టోల్స్‌’ లాంటి నవలలు అమెరికా సాహిత్యంలో క్లాసిక్స్‌గా నిలిచాయి. సముద్రం మీద ఒక పెద్ద చేపతో చేసిన ముసలి జాలరి పోరాటగాథను ‘ది ఓల్డ్‌మాన్‌ అండ్‌ ద సీ’గా మలిచారు. ఇది ఆయనకు విశేషమైన పేరు తెచ్చిపెట్టింది. దీనికి వచ్చిన కీర్తి ఆయన పాత రచనల మీద వెలుగు ప్రసరించేట్టు చేసింది. ఈ నవలిక కేశవరెడ్డి సుప్రసిద్ధ తెలుగు నవల ‘అతడు అడవిని జయించాడు’కు స్ఫూర్తిగా నిలిచింది. 1954లో హెమింగ్వేను నోబెల్‌ సాహిత్య పురస్కారం వరించడానికి ఇదే ప్రధాన కారణమైంది. మొత్తం పది నవలలూ, పది కథా సంకలనాలూ, ఐదు నాన్‌ఫిక్షన్‌ రచనలూ రాసిన హెమింగ్వే జీవితాన్ని గాఢమైన యుద్ధానుభవాలూ, దాదాపుగా మృత్యువు ఒడికి చేర్చిన విమాన ప్రమాదాలూ ప్రభావితం చేశాయి.

మరిన్ని వార్తలు