ఒక అద్భుత చరిత్ర

8 Feb, 2018 01:38 IST|Sakshi

జీవన కాలమ్‌

వయసు మీద పడుతున్న చాంపియన్‌లో ‘వాడితనం’ మందగించింది. కానీ వేడితనం ఇంకా తిరగబడుతోంది. పోటీల పద్ధతులు మారి, చేతిలో రాకెట్లు మారి, కాలం మారినా మనసులో ఉద్ధతి మారలేదు.

ఉన్నట్టుండి రాత్రి 11 గంట లకి తుళ్లిపడి లేచాడు. ఇక నిద్ర పట్టలేదు. మర్నాడు సాయంకాలం ఫైనల్‌ మ్యాచ్‌. ఇది తన జీవితంలో 30వ పోటీ. ఏం జరుగుతుంది? ఇదీ ఫెదరర్‌ మనస్సుని ఆవరించుకున్న ఆలోచన. గెలిస్తే చరిత్ర. ఓడి పోతే? అది మరొక రకమైన చరిత్ర. అయినా మనసు ఓటమిని అంగీకరించడం లేదు. ఇప్పటికే పోటీ నుంచి నాదల్, జకోవిచ్, ఆండీ ముర్రే (అందరూ ముప్పయ్యో పడిలోనున్న ఆటగాళ్లు) వైదొలిగారు. ఫెదరర్‌ వారసుడనిపించదగ్గ అలెగ్జాండర్‌ జ్వరేవ్‌ (20 ఏళ్లవాడు) ఓడిపోయినప్పుడు ఫెదరర్‌ ఓ మాట అన్నాడు. ‘‘ప్రపంచ కప్పుమీదే దృష్టి పెట్టుకోవడం ఆటలో ఏకాగ్రతని బలి తీసుకుంటుంది’’ అని. ఇప్పుడు తను అదే చేస్తున్నాడా? ఒకరికి హితవు చెప్పడం సులువు. మర్నాటి సాయంకాలం ఒక జీవిత కాలం దూరంగా ఉన్నట్టనిపించింది. ఉదయం అయితే లేచినప్పటినుంచీ ఆటకి సిద్ధమయ్యే వ్యాపకం ఉంటుంది. ఇప్పుడు రోజంతా ఏం చేయాలి? ఎప్పుడో తెల్లవారుఝామున 3 గంటలకి చిన్న కునుకు పట్టింది. ఇలాంటి సందర్భాలు ఫెదరర్‌ జీవితంలో ఎన్నో ఉన్నాయి. కానీ ఇది మరీ ప్రముఖమైనది. కారణం ఇరవయ్యో చాంపియన్‌షిప్పే ప్రపంచ చరిత్ర.

ఫెదరర్‌ వయస్సు 36 సంవత్సరాల 173 రోజులు. ఇప్పుడు ఎదురు నిలిచిన ప్రత్యర్థి చిలిచ్‌ వయస్సు 29. 2003 నుంచి 2008 మధ్య ఫెదరర్‌ 13 చాంపియన్‌షిప్పులు గెలుచుకున్నాడు. తర్వాతి ఏడేళ్లలో కేవలం నాలుగే, వయసు లుప్తమవుతున్న శక్తిని గుర్తుచేస్తోంది. 2004 నుంచీ తనతో పోటీ చేసినవారు దాదాపు అందరూ రిటైరయిపోయారు. ఇప్పుడు గెలిస్తే ఫెదరర్‌ ఒక తరానికి మకుటంలేని మహారాజవుతాడు. ఈ విచికిత్సని 16 గంటలు భరించాడు.

ఆ సాయంకాలం టెన్నిస్‌ కోర్టులో జరిగిన ఆట మహాకావ్యం. గెలవాలన్న ముందుతరంతో ఓటమిని ఎదిరించే పాత తరం పోటీ పడుతోంది. కానీ వయసు శరీరానిది కాదు. ఆ స్థాయిలో ఆలోచనది. నాలుగో సెట్‌లో ఫెదరర్‌ బ్యాక్‌ హ్యాండ్‌ వాలీలు కేవలం చిత్ర కారుడి ఆయిల్‌ పెయింటింగ్‌లు.

గెలిచిన క్షణంలో ప్రతీ చాంపియన్‌ కన్నీటి పర్యంతం అవుతాడు. కానీ ఫెదరర్‌ ‘ప్రతీ’ చాంపియన్‌ కాడు. ఈ తరంలో 20వ సారి చాంపియన్‌ షిప్‌ గెలుచు కున్న ఒకే ఒక పురుష క్రీడాకారుడు. 36 సంవత్సరాల వయసున్న ఆటగాళ్లలో రెండవవాడు. 1972లో ఆస్ట్రే   లియా ఓపెన్‌ గెలుచుకున్న కెన్‌ రోజ్‌వాల్‌కి 36 సంవ త్సరాల 93 రోజులు.

మా అబ్బాయి నన్ను వెక్కిరించాడు. ‘ఎందుకీ కాలమ్‌?’ అని. తెలుగుదేశంలో ఎంతమందికి టెన్నిస్‌ ఆట మీద ఆసక్తి ఉంటుంది? అంటాడు. 2004 నుంచీ– అంటే తన 23వ ఏటినుంచీ ప్రపంచంలో జయించడాన్ని వ్యసనం చేసుకున్న ఆటగాడు ఫెదరర్‌. అడ్డమయిన కారణాలకీ బస్సులు తగలెట్టి, స్కూళ్లలో టీచర్లనే కాల్చి చంపే కుర్రకారుకి, మొహాలకి ముసుగులు వేసుకుని సైనికులను కాల్చే యువతరం పెచ్చు రేగుతున్న తరానికి ఫెదరర్‌ ఏ మాత్రమయినా స్ఫూర్తిని ఇవ్వగలి గితే– ఒక వ్యక్తిలో చిత్తశుద్ధి, ఏకాగ్రత, అకుంఠిత దీక్ష ఏ స్థాయిలో మనిషిని నిలపగలవో ఎవరయినా గుర్తించగ లిగితే, ఫెదరర్‌ ఎవరో, అతను ఆడే ఆట గొప్పతనం ఏమిటో తెలియకపోయినా ఫరవాలేదు. గొప్పతనానికి చిరునామా లేదు. తెంపరితనానికి ఉంది. ఆచరణ ఆవ గింజ, ఆదర్శం ఆకాశం.
ప్రపంచకప్పు 20వ సారి పట్టుకుని ఆవేశంతో ఏడ్చాడు ఫెదరర్‌. ‘నేనే నమ్మలేకపోతున్నాను. బొత్తిగా ఇది కాశీమజిలీ కథ’ అన్నాడు. చూస్తున్న లక్షలాది ప్రజా నీకమూ, ఆ మాటకి వస్తే ప్రపంచమంతా అదే అను కున్నారు. ‘ఇది అపూర్వకమైన కాశీమజిలీ కథ’.

వయసు మీద పడుతున్న చాంపియన్‌లో ‘వాడి తనం’ మందగించింది. కానీ వేడితనం ఇంకా తిరగబడు తోంది. పోటీల పద్ధతులు మారి, చేతిలో రాకెట్లు మారి, కాలం మారినా మనసులో ఉద్ధతి మారలేదు. గెలవా లన్న ‘నిప్పు’ రగులుతూనే ఉంది. అంతే. ఆ క్షణంలో కాలం ఘనీభవించింది. తన ఆలోచనల్లోంచి వయసుని అతి క్రూరంగా గెంటేశాడు.

ప్రీతీ రామమూర్తి అనే పాత్రికేయురాలు తన్మయ త్వంతో కేవలం కవిత్వాన్ని చెప్పింది. ‘‘ఇవాళ ప్రేక్షకుల ముందు ఫెదరర్‌ ప్రదర్శన లక్ష సందర్భాలలో ఒకటి కావచ్చు. కానీ It represents a sense of life. ఈ విజ యం అతనికి అవసరం లేకపోవచ్చు. కానీ ఇందులో అమలిన తన్మయత్వం ఉంది. తొందరపాటు లేదు. ఓ స్థితప్రజ్ఞుడి విన్యాసం ఉంది. ఫెదరర్‌ తనని తాను నిలదొక్కుకుని కాలాన్ని మెడబట్టుకుని లొంగదీసుకుని తనతో కూచిపూడి నృత్యం చేయించే విలాసం ఉంది’’.

రెండు వాక్యాలయినా ఇంగ్లీషులో చెప్పాలని నా కక్కుర్తి. It is no longer a cliched religious experien ce... Of late, it appears that Federer has managed to take control, grabbing TIME by its shoulder and making it dance a slow waltz with him.


- గొల్లపూడి మారుతీరావు

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా