ఏపీ సీఎం అసమర్థుడు 

8 Feb, 2018 01:36 IST|Sakshi

లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వరప్రసాదరావు

 టీడీపీ ఎంపీ జయదేవ్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం 

సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  మొదట వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రధాని ప్రసంగాన్ని బహిష్కరించి వాకౌట్‌ చేస్తున్నట్టు ప్రకటించి సభ నుంచి బయటకు వెళ్లారు. అనంతరం బడ్జెట్‌పై చర్చలో గల్లా జయదేవ్‌ వైఎస్సార్‌సీపీపై దూషణలతో ప్రసంగం ప్రారంభించారు. దీంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు వరప్రసాదరావు, వైవీ సుబ్బారెడ్డి సభలోకి వచ్చి జయదేవ్‌ వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. ఆ వెంటనే స్పీకర్‌ను కలిసి ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా తమకూ అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో వరప్రసాదరావుకు అవకాశం కల్పించారు.

‘‘టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ తన ప్రసంగంలో మా పార్టీ అధ్యక్షుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మా అధ్యక్షుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించారు. ఒకవేళ అలా జరిగి ఉంటే సిల్లీ కారణాలపై 16 నెలలు జైల్లో ఉండేవారు కాదు. ఒక వ్యక్తి ఇక్కడ లేనప్పుడు వారి గురించి ఎలా మాట్లాడుతారు? ఇది పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధం. ఆ వ్యాఖ్యలను స్పీకర్‌ తొలగించాలి..’’ అని వరప్రసాదరావు కోరారు. దీనికి వెంటనే సభాపతి స్థానంలో ఉన్న ఉపసభాపతి స్పందిస్తూ.. అన్‌పార్లమెంటరీ పదాలు ఉంటే వాటిని తొలగిస్తామని ప్రకటన చేశారు.

ఆ తర్వాత వరప్రసాదరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాష్ట్రప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ‘‘ఏపీ ముఖ్యమంత్రి పూర్తిగా అసమర్థుడు. నాలుగేళ్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయారు. పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేకపోయారు’’ అని మండిపడ్డారు. పట్టిసీమలో అవినీతి జరిగిందని కాగ్‌ తప్పు పట్టిందని.. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.   

మరిన్ని వార్తలు