గతి తప్పిన విధానాలే రైతుకు శాపాలు

3 Jul, 2018 01:21 IST|Sakshi
గతి తప్పిన విధానాలే రైతుకు శాపాలు

విశ్లేషణ

నిర్ధేశిత లక్ష్యాల సాధనలో ప్రతియేటా ఆమడదూరంలో వెనుకబడిపోవడం భారత వ్యవసాయరంగం దుస్థితికి అద్దం పడుతుంది. ఆహారధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకత.. మొత్తంగా వ్యవసాయాభివృద్ధి రేటును అనుకొన్నవిధంగా ఏ సంవత్సరంలోనూ అందుకోలేకపోవడం అనేక దశాబ్దాలుగా అనుభవంలోకి వచ్చిన వాస్తవం. ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న జనాభాకు సరిపోయే పరిమాణంలో ఆహార ధాన్యాలను పండించలేకపోతున్నాం.  గతేడాది (2017–18) దేశంలో 27.95 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి వచ్చింది. దాని ఆధారంగా, 2018–19లో 28.37 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను పండించడం లక్ష్యమని కేంద్రం ప్రకటించింది. అంటే ఈ యేడాది అదనంగా 42 లక్షల టన్నులు పండించాలి.  గత నాలుగేళ్లుగా సగటున ఆహార ధాన్యాల్లో పెరుగుదల కేవలం 15 లక్షల టన్నులు మాత్రమే. 2015లో దేశ జనాభా 125.91 కోట్లుగా ఉన్నప్పుడు ఒక్కోవ్యక్తికి రోజుకు 186 గ్రాముల బియ్యం అందుబాటులో ఉన్నట్లు గణాం కాలు తెలుపుతున్నాయి. ప్రస్తుత జనాభా 130.28 కోట్లకు చేరిన నేపథ్యంలో తలసరి బియ్యం లభ్యత తిరోగమనంలో ఉంది... 185 గ్రాములకు తగ్గింది. పలు కేంద్ర, రాష్ట్ర పథకాలు అమలవుతున్నప్పటికీ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో చెప్పుకోదగ్గ పురోగతి కనిపించడం లేదు.

2010–11లో దేశంలో 24.44 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడులు రాగా 2017–18లో.. అంటే 7Sఏళ్ల తర్వాత కూడా 27.95 కోట్ల టన్నుల దిగుబడులే నమోదయ్యాయి. ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక వ్యవసాయరంగంలో క్షీణత మొదలయిందని చెప్పడానికి ఆహార ధాన్యాల దిగుబడులే ఓ ఉదాహరణ. ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే.. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం చివరి సంవత్సరమైన 2013–14లో 26.50 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు దిగుబడి కాగా; 2014–15లో ఆ మొత్తం 25.20 కోట్ల టన్నులకు తగ్గింది. అది ఎన్డీఏ ప్రభుత్వానికి తొలి సంవత్సరం. అయితే, 2015–16లో ఉత్పత్తి తగ్గి 25.15 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలే చేతికందాయి. 2016–17లో ఆ మొత్తం 27.51 కోట్ల టన్నులకు పెరిగినా 2017–18లో స్వల్పవృద్ధి మాత్రమే సాధ్యపడి 27.95 కోట్ల టన్నుల వద్ద దిగుబడి నిలిచిపోయింది.దేశ ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకొని.. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధిం చడం లక్ష్యంగా నిర్ధేశించుకోకుండా.. ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి కేవలం ఆహార ధాన్యాల దిగుమతుల మీదనే కేంద్రం ఆధారపడుతున్నదని స్పష్టం అవుతున్నది.  

ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక గోధుమలు, బియ్యం (బాస్మతియేతర రకం), పప్పులు, నూనెగింజలు, ఇతర చిరు, తృణధాన్యాల దిగుమతుల విలువ మూడేళ్లల్లో రెట్టింపయింది. 2013–14లో ఆహార ధాన్యాల దిగుమతుల బిల్లు 15.03 బిలియన్ల డాలర్లు ఉండగా 2016–17 నాటికి ఆ మొత్తం 25.09 బిలియన్ల డాలర్లకు చేరింది. ఇక దేశం నుంచి ఎగుమతులయ్యే అన్ని ఉత్పత్తుల్లో వ్యవసాయరంగ వాటా 2014–15లో 12.59%గా ఉండగా, 201–17 నాటికి 12.26%కు పడిపోయింది. దిగుమతులు పెరుగుతుండగా ఎగుమతులు తగ్గుతున్నాయి. దీనివల్లనే రూపాయి మారకం విలువ పడిపోతోంది.    
గత రెండు, మూడేళ్లుగా దేశంలోకి విదేశీ కూరగాయలు, పండ్లు విస్తారంగా దిగుమతి అవుతున్నాయి. 2014–15లో దేశంలోకి రూ.5,414 కోట్ల విలువైన కూరగాయలు పండ్లు దిగుమతి కాగా, 2016–17 నాటికి ఆ మొత్తం విలువ రూ. 5,897 కోట్లకు పెరిగింది. ప్రభుత్వ విధానాలను ఆసరా చేసుకొని వ్యాపారాలు ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి గోధుమలు, చిరుధాన్యాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి దేశీయ మార్కెట్‌లను ముంచెత్తుతున్నారు. ఫలితంగా.. రైతులకు కనీసమద్దతు ధర లభించని దుస్థితి ఎదురవుతున్నది. 1993–94లో దేశ అవసరాల్లో నూనెగింజల దిగుమతులు కేవలం 3% మాత్రమే. కానీ, ప్రస్తుతం దేశానికి అవసరమైన నూనెగింజల దిగుమతులపై సుమారు రూ.70,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

    
దేశంలో 70 రకాలకు పైగా పంటల్ని పండిస్తున్నారు. కనీస మద్దతు ధర అందిస్తున్న పంటల సంఖ్య 26 మాత్రమే. పైగా, మద్దతు ధర నిర్ధారణ ప్రాతిపదికలు అసంబద్ధంగా ఉంటున్నాయి. అన్ని పంటలకు సహేతుకమైన రీతిలో మద్దతు ధరల్ని అందించాలని రైతులు డిమాండ్‌ చేస్తోంటే, అసలు మద్దతు ధరలకు పంటలను కొనే విధానం నుంచి పూర్తిగా తప్పుకోవాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇదే విధానం అమలైతే భారతదేశ రైతాంగానికి తీరని శరాఘాతంగా మిగిలిపోతుంది.2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి చర్యలు తీసుకొంటామని మోదీ చెప్పారు. కానీ, దానికి తగ్గట్టుగా ప్రభుత్వ చర్యలు లేవు. పైగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నానాటికి పడిపోతూ ఉన్నాయి. డా‘‘ స్వామినాథన్‌ సిఫార్సుల పైన కనీస చర్యలు లేవు. ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నీతిఆయోగ్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ వ్యవసాయరంగంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రులు సభ్యులుగా ఓ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకొని.. ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్న ఎన్డీఏకు వ్యవసాయరంగంలో తీసుకోవాల్సిన మెరుగైన చర్యలను టాస్క్‌ఫోర్స్‌ ఎప్పటిలోగా సూచించగలదు? ఆ సూచనలను ఎన్డీఏ ఎప్పటి నుంచి అమలు చేయగలదు? 

విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన వ్యవసాయరంగ అభివృద్ధిని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు రెండంకెల స్థాయిలో చూపడం రైతాంగాన్ని మోసం చేయడమే.  రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు పూర్తిగా రుణమాఫీ కూడా చేయలేదు. నామ మాత్రంగా చేసిన రుణమాఫీ రైతుల వడ్డీల చెల్లింపులకు కూడా సరిపోలేదు. నాలుగేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం పట్ల రైతులకు విశ్వాసం సన్నగిల్లే ఘట నలు అనేకం చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం క్రింద సగటున 50–60 పనిదినాలు మాత్రమే వ్యవసాయ కార్మికులు పొందగలుగుతున్న నేపథ్యంలో ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానిం చడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను, లాభాలను కూలంకషంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జాతీయ కర్షక విధానం రూపొం దించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చివరి సంవత్సరంలోనైనా కేంద్రం వ్యవసాయరంగంలో దిద్దుబాటు చర్యలను తీసుకోగలిగితేనే రైతాంగానికి మేలు జరుగుతుంది తప్ప ప్రస్తుత గతి తప్పిన, కాలంచెల్లిన ప్రభుత్వాల విధానాలు రైతాంగానికి శాపాలే తప్ప 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపుకావడం హామీకే పరిమితమౌతుంది.

వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు ‘ మొబైల్‌ : 99890 24579 

మరిన్ని వార్తలు