సానుభూతి చిట్కాతో ఓట్లు రాలవు

15 Jun, 2018 02:27 IST|Sakshi

సందర్భం

కాళ్లకింది భూమి కదిలిపోతున్న ప్రమాద ఘంటికలు మోగినప్పుడల్లా పాలకులు సానుభూతి నాటకాలకు తెర తీసి పబ్బం గడుపుకుంటున్న వైనం భారత రాజకీయాలకు కొత్తేమీ కాదు. మోదీ హత్యకు మావోయిస్టుల కుట్ర అంటూ కేంద్ర స్థాయిలో ఇప్పుడు లేఖ మిషతో జరుగుతున్న ప్రచారం కానీ, తనపై కేంద్రం దాడి చేయవచ్చు కాబట్టి నాచుట్టూ రక్షక కవచంలా ఉండి కాపాడుకోండి అంటూ చంద్రబాబు ఆడుతున్న నాటకం కానీ పాలకవర్గ రాజకీయాల్లో, వారి పన్నాగాల్లో భాగమే. కానీ సానుభూతి కోసం తీసుకొస్తున్న ఈ గోసాయి చిట్కాలతో ఓట్లు రాలవన్నది చరిత్ర పదేపదే చెప్పిన సత్యం.

ఇటీవల ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల వ్యతిరేక చట్టం దుర్వినియోగం అవుతోందనీ, దాన్ని పునఃసమీక్షించాలనీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా సహజంగానే అణగారిన ప్రజాసమూహాల్లో దేశవ్యాప్తంగా ఆగ్రహాందోళనలు పెల్లుబికాయి. దేశంలో ఆ చట్టం కింద నమోదైన కేసులలో కేవలం 7 శాతం సందర్భాలలోనే శిక్షలు పడుతుంటే, సుప్రీంకోర్టు ఉత్తర్వు ఎస్సీ, ఎస్టీలకున్న కనీస హక్కును సైతం నీరు గార్చడమేనన్న వారి ఆగ్రహాన్ని అర్థం చేసుకోవలసిందే. డా. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మనుమడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ తదితర దళిత నేతల ఆధ్వర్యంలో పుణేలో ఆ ఉద్య మం తీవ్ర రూపం దాల్చింది. పాలకులు, పోలీసుల పెడధోరణితో అది హింసాత్మకంగా మారి 9 మంది ఉద్యమకారులను బలిగొన్నది. 

ఆ ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసులు ఆనాటి తమ సోదాల్లో ఒక లేఖ దొరికినట్లు ఇటీవలే ప్రకటించారు. అది స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మీడియాలో విశేష ప్రాచుర్యం పొందింది. దేశ ప్రధాని మోదీని హత్య చేయవలసిందిగా మావోయిస్టు పార్టీ నేత ఒకరు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ను, అలాగే తన పార్టీని ప్రేరేపిస్తూ రాసినట్లున్న లేఖ అది. ఆ లేఖలో ‘రాజీవ్‌ గాంధీని హతమార్చిన రీతిలో (మానవ బాంబు ప్రయోగం) చేయాలని’ కూడా ఆ లేఖ కుడు సూచించి ఉన్నారు.

మోదీని హత్య చేసే కుట్రలో మావోయిస్టులను, వారికి సహకరిస్తున్న పట్టణాలలోని మావోయిస్టుల పక్షపాతులైన మేధావులు, పౌరహక్కుల సంఘాల కార్యకర్తలను మాత్రమే కాకుండా కొత్తగా ప్రకాశ్‌ అంబేడ్కర్‌ వంటి దళిత నేతలను కూడా భాగస్వాములుగా ఈ లేఖ చిత్రీకరిస్తున్నది. ఒకవైపు నిత్యం అంబేడ్కర్‌ పేరును జపిస్తూ, పెద్దపెద్ద విగ్రహాలు నిర్మిస్తూ, తాము దళిత, గిరిజన, ఆదివాసీ శ్రేయోభిలాషులమని, ప్రచారం చేసుకునే మోదీ శిష్య బృందం అంబేడ్కర్‌ అనుయాయులను, వ్యక్తిగత హింసావాదులుగా చిత్రీకరించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట! పైగా మన రాష్ట్రంలో పౌరహక్కుల నేత అయిన వరవరరావు పేరు కూడా ఆ లేఖలో ప్రస్తావన రావడం చూస్తుంటే బీజేపీ, మోదీ యంత్రాంగం ఎంత చవకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నదో మరింత స్పష్టంగా అర్థం అవుతున్నది.

ఇది ఇటీవల కర్ణాటకలోనూ, ఆ తర్వాత పార్లమెంటుకు, అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలలో మోదీకి జరిగిన గర్వభంగం నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకు ఎన్డీయే పాలకుల ఎత్తుగడ అనే సందేహం వెలిబుచ్చేవారిని న్యాయంగానైతే అనుమానించాల్సిన అవసరం లేదు. ఈ లేఖలో వరవరరావును కలవండి అనీ, ఇంత పైకం (8 కోట్లు) ఖర్చవుతుందని, ఇన్ని బుల్లెట్లు కావాలి (40 లక్షల రూపాయలు) అనీ ఇన్ని వివరాలు మావోయిస్టు నేతలు రాస్తారనే విషయం సామాన్యుల ఊహకు కూడా అందనిది. ఇదంతా వరవరరావును ‘వదిలించుకునే’ ఎన్డీఏ పన్నాగంలో భాగమే అనిపించట్లేదా?

ప్రత్యేకంగా మోదీ పాలనలో, ఈ రకమైన సానుభూతి కోసం జరిగే ప్రయత్నాలు మనం నిత్యం చూస్తున్నవే. పెద్దనోట్ల రద్దు సందర్భంగా మోదీ తన ఉపన్యాసాలలో, నా చర్య వల్ల నల్లధనాన్ని కోట్లాదిగా దాచుకున్న వారినుంచి నా ప్రాణానికి సైతం ప్రమాదం రావచ్చని బహిరంగ సభలో చెప్పిన విషయం మనకు గుర్తుండే ఉంటుంది. కానీ ఆయనపై అలాంటి హత్యాప్రయత్నం ఏదీ జరగలేదు. కానీ బ్యాంకులలో దాచుకున్న తమ పైకం, తాము తీసుకుని వాడుకోడానికి ఏటీఎంల వద్ద, క్యూలలో నిలబడిన వందమందికి పైగా సాధారణ జనం ప్రాణాలు వదిలారు. గుజరాత్‌ ఎన్నికలలో గెలిచేం దుకు తన ప్రాణాలకు ముప్పు గురించి ప్రస్తావిస్తూ గతంలోనూ మోదీ ఈ భావోద్వేగాన్ని ప్రదర్శించినదీ మనమెరిగిందే.

ఎన్డీఏలో భాగస్వామిగా మోదీతో నాలుగేళ్లు అంటకాగిన సీఎం బాబు సైతం ఇటీవల ఒక కొత్త రాగం అందుకున్నారు. ‘నాపై కేంద్రం కుట్ర పన్నుతోంది. నాకేమైనా జరగొచ్చు. కేంద్రం నాపై కేసులు పెట్టో, జైల్లో పెట్టో, ఏదోవిధంగా దాడి చేయవచ్చు. ప్రజలారా, నాకు మీరంతా అండగా ఉండాలి. నా చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడి మీరే నన్ను రక్షించుకోవాలి. నేను బాగుంటే మీరు బాగున్నట్లే. నాకేదన్నా నష్టం జరిగితే అది మీకు జరిగినట్లే’ అంటూ ఇటీవల తానే కొత్త పల్లవినొకదాన్ని ఎత్తుకోవడం మనం చూస్తున్నదే కదా. ఇలా ప్రజల దృష్టి మళ్లించడంలోనూ, అవసరార్థం అవకాశవాదంగా వ్యవహరించడం అసత్యాలు, అర్ధసత్యాలతో ప్రజలను మోసం చేయడం ఇత్యాది విద్యలతో అటు మోదీ, ఇటు బాబు ఒకరిని మించిన వారొకరు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అలాగే విభజన సమయం నాటి హామీలు నెరవేర్చకుండా ఇన్నేళ్లు అవిభక్త కవలలుగా వ్యవహరించిన ఈ తోడుదొంగలిద్దరూ, తీరా ఎన్నికలు వచ్చేసరికి, లాలూచీ కుస్తీ లాగా పరస్పరం నాటకమాడటం మనం చూస్తున్నదే. 

ఈ సందర్భంగా మావోయిస్టులకు, సాధారణంగా కమ్యూనిస్టులకు కూడా ఒక విషయం చెప్పాలి. బాబుపై అలిపిరిలో నక్సలైట్లు 2003లో దాడి చేశారు. ఆ దాడినుంచి బాబు ఆయన మాట ల్లోనే చెప్పాలంటే వెంకన్న దయతో అమరావతి రాజ ధాని నిర్మాణ కర్తవ్యం పూర్తి చేసేందుకే బయటపడ్డానంటున్నారు. అప్పుడే నక్సలైట్లకు ఒక వ్యాసంలో ‘ఎందుకీ అనవసరమైన హత్యా రాజకీయాలు? వ్యక్తిగత హత్యలు సమస్యను పరిష్కరించలేవు. ఎటూ బాబు రానున్న ఎన్నికలలో కచ్చితంగా పరాజయం పొందనున్నారు. మీ అనాలోచిత చర్యవల్ల బాబుకు అదనంగా కొన్ని సానుభూతి ఓట్లు రావచ్చు. ఇలాంటి చర్యలు గర్హనీయం’ అని హెచ్చరించాను.

అదే సమయంలో అటు మోదీ, ఇటు బాబు కూడా గుర్తుంచుకోవలసింది ఒకటుంది. అలిపిరి ఘటన తర్వాత జరిగిన ఎన్నికల్లో బాబు పట్ల సానుభూతి పవనాలేవీ బాబును ఓటమినుంచి రక్షించలేదు. ప్రజలు ఆయనను ఓడించి వైఎస్సార్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీనే గెలిపించారు. అప్పటిదాకా టీడీపీతో పొత్తు ఉన్న వాజ్‌పేయి నేతృత్వంలోని  బీజేపీని కూడా ప్రజలు ఓడించారు. కనుక, ఈ సానుభూతి గోసాయి చిట్కాలు ప్రజావ్యతిరేకత ముందు నిలబడలేవు. అలాగే వరవరరావును, ఇతర ప్రజానుకూల మేధావులను, దళిత నేతలను వారి వారి రాజ కీయ దృక్పథాలతో విభేదాలు ఉండినా, వెంటాడి వేధించేందుకు పాలకులు పన్నుతున్న కుట్రలను వ్యతిరేకించడం సాధారణ మానవత, సంస్కారం కలవారందరి కర్తవ్యం.

ఏది ఏమైనా ఈ లేఖ కమ్యూనిస్టులమనుకునే వారందరి కళ్లు తెరిపించాలి. ఇక్కడ పాలకులు శ్రామికవర్గ పోరాట శక్తులను సామాజిక అణచివేతకు గురవుతున్న ప్రజాసంఘాలను కలిపి, హంతకులుగా చిత్రించే యత్నం చేస్తున్నారన్న వాస్తవం గుర్తించాలి. దీనిని ఎదుర్కొనడానికి మార్క్సిస్టు పార్టీలు అణగారిన ప్రజాసమూహాల నేతలు, ఐక్యమై పోరాడటమే మార్గం. లాల్‌ నీల్‌ నినాదం ఆచరణ రూపం దాల్చాలి. ఇందుకు తెలంగాణలో ఏర్పడిన, బహుజన వామపక్ష సంఘటన ఒక మంచి ఉదాహరణ. ఆచరణలో దేశవ్యాప్తంగా అలాంటి కృషి జరగాలి. 

మన సిద్ధాంతాలు, తీర్మానాలు విస్తృత ప్రజానీకం నుంచి మనం వేరుపడేందుకు తావివ్వరాదని మావోయిస్టులైనా, సాంప్రదాయ మార్క్సిస్టు పార్టీలైనా గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు ఏపీనే తీసుకుందాం. అక్కడ ప్రధానంగా వైఎస్సార్‌సీపీ ఒకవైపు ప్రత్యేక హోదా పట్ల, ఏపీ సమస్యల పట్ల ప్రజా చైతన్యాన్ని పెంచుతూ, ప్రజా ఉద్యమాలను నిర్వహించే ప్రధాన పార్టీగా ఉంది. మరోవైపు ప్రజావ్యతిరేక నయవంచన పార్టీలుగా బాబు నాయకత్వాన టీడీపీ (వెన్నుపోటు), మతతత్వ మోదీ పార్టీ ఉన్నాయి. తమ శక్త్యానుసారం ఏదో ఒక మోతాదులో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న వామపక్ష పార్టీలు, ప్రత్యేకహోదా సాధన సమితి వంటివి ఉన్నాయి. మరోవైపు తాను బాబు చేతిలో మోసపోయానంటూ ప్రజలకోసమే జనసేన అంటున్న పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు.

ప్రజా ప్రయోజనాల కోసం కలిసి వచ్చేవారందరితో కలిసి పోరాడటం వామపక్షాలు చేయాలి. అదే సమయంలో కీలకమైన ఎన్నికల సమయంలో పుష్కలంగా విజయావకాశాలు ఉన్న వైఎస్సార్‌ సీపీకి ఏదో ఒక పద్ధతిలో తోడ్పడే విధానం చేపట్టాలి. దానిని వైఎస్సార్‌ సీపీ సైతం ఆహ్వానించాలి. అంతే కానీ ముక్కోణపు పోటీ అని, తృతీయ ఫ్రంట్‌ అని వామపక్షాలు ప్రయత్నిస్తే అవి 2009 నాటి మహాకూటమిలాగా ప్రజలకు దూరం అయ్యే అవకాశం లేకపోలేదు. ఏ నినాదమైనా ఆచరణాత్మకం కావాలంటే, అది ప్రజాబాహుళ్యంతో కలిసి వున్నప్పుడే సాధ్యం. ప్రజలనుంచి ఒంటరయితే ఎంత గొప్ప సిద్ధాంతమైనా నిరుపయోగమే.

డాక్టర్‌ ఏపీ విఠల్‌
వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు
మొబైల్‌ : 98480 69720

 

మరిన్ని వార్తలు