టీడీపీ, బీజేపీ దొంగాట | Sakshi
Sakshi News home page

టీడీపీ, బీజేపీ దొంగాట

Published Fri, Jun 15 2018 2:27 AM

TDP and BJP Political Drama on Kadapa Steel Plant - Sakshi

సాక్షి, అమరావతి: కడపలో స్టీల్‌ప్లాంటు ఏర్పాటు చేయాలనే చిత్తశుద్ధి బీజేపీ, టీడీపీలకు ఏమాత్రం లేదన్న విషయం అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సాక్షిగా రుజువైంది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయరాదని నాలుగేళ్ల క్రితమే టీడీపీ –బీజేపీ ద్వయం నిర్ణయించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ  అఫిడవిట్‌ సాక్షిగా తేలిపోయింది. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడం వీలుకాదని నాలుగేళ్ల కిత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టుకు రాతపూర్వకంగా సమర్పించిన అఫిడవిట్‌లోనే స్పష్టం చేసింది. వెనుకబడిన కడపలో ఫ్యాక్టరీ ఏర్పాటుచేసేది లేదని కేంద్ర ప్రభుత్వం తెలియజేసిన తర్వాత కూడా మూడున్నరేళ్లు బీజేపీతో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కాపురం చేసింది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా రెండు మంత్రి పదవులను కూడా అనుభవించింది.

అత్యంత వెనుకబడిన ప్రాంతమైన కడపలో పరిశ్రమ ఏర్పాటు చేసేది లేదని కేంద్రం తెలియజేసిన  తర్వాత కూడా గత మూడున్నరేళ్ల కాలంలో  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని పలుమార్లు పొగిడారు. ఢిల్లీకి వెళ్లి సన్మానాలు చేశారు. స్టీల్‌ప్లాంటు ఏర్పాటు చేయకపోతే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తెలిసినా ప్రధానమంత్రి మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్రెండ్‌షిప్‌ కొనసాగింది. ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేది లేదని బయటకు చెప్పకుండా దాచిపెట్టి ఇద్దరూ దొంగ నాటకాలు ఆడుతూ వచ్చారు. వెనుకబడిన రాయలసీమలోని కడపలో ఉక్కు కర్మాగారం పెట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, ఆ ప్రాంతాన్ని పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ధ్యాస చంద్రబాబుకు గానీ, బీజేపీకి గానీ ఏ కోశానా లేదని దీనిని బట్టి తేటతెల్లమవుతోంది. ఫ్యాక్టరీ రాదన్న విషయాన్ని నాలుగేళ్లు దాచిపెట్టి ప్రజలను మోసం చేసింది చాలక.. స్టీల్‌ప్లాంటు రాదని ఇప్పుడే తెలిసినట్లుగా.. దీని సాధన కోసం ఆమరణ దీక్ష చేస్తామంటూ టీడీపీ నేతలు ప్రజలను ఇంకా మభ్యపెట్టేందుకు పూనుకోవడం గమనార్హం. 

బాధ్యులెవరు?
వెనుకబడిన రాయలసీమలోని వైఎస్సార్‌ కడప జిల్లాలో నాలుగేళ్లుగా ఉక్కు కర్మాగారం నిర్మాణానికి కనీసం శంకుస్థాపన కూడా జరగకపోవడానికి బాధ్యులెవరు? విభజన చట్టంలో ఉన్న ‘కడప ఉక్కు’ సాకారం చేయడంలో విఫలమైంది ఎవరు? అ ప్రశ్నలు ఎవరిని అడిగినా రాష్ట్రంలోని టీడీపీ సర్కారు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలేనని ఠక్కున సమాధానం చెబుతారు. క్రియారహితంగా వ్యవహరించడం ద్వారా కడప ఉక్కు కర్మాగారం అనే రాష్ట్ర ప్రజల కలను చెదరగొట్టిన తెలుగుదేశం పాలకులే ఇప్పుడు కడప ఉక్కు సాధన కోసం నిరసన ప్రదర్శనలు, బందులు నిర్వహిస్తామంటూ కొత్త నాటకానికి తెరలేపడం చూసి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఏమాత్రం చిత్తశుద్ది చూపకుండా నాలుగేళ్లు మోసం చేసిన తెలుగుదేశం నాయకులు ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఆమరణదీక్ష, బందులంటూ కుయుక్తులు పన్నుతున్నారని రాయలసీమకు చెందిన రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. 

ఆర్థిక అంశం ఒక్కటే కాదు
‘కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడం లాభదాయకం కాదని సెయిల్‌ 2014 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వ రంగ సంస్థలతో పరిశ్రమ ఏర్పాటుకు.. లాభదాయకమా? కాదా? అనే అంశం ఒక్కటే ప్రామాణికం కాదు. వెనుకబడిన ప్రాంతాల్లో ఆర్థిక, పారిశ్రామిక ప్రగతి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యాల కోసం ప్రభుత్వ రంగ సంస్థలతో పరిశ్రమలు ఏర్పాటు చేయించి ఆర్థికంగా నిలదొక్కుకుని నడిచేలా ఆర్థిక వెసులుబాట్లను ప్రభుత్వంకల్పించాలి. లాభదాయకత మాత్రమే చూసుకోవడానికి ప్రభుత్వమేమీ వ్యాపార సంస్థ కాదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, పారిశ్రామిక ప్రగతి అన్నీ ప్రభుత్వ బాధ్యతలు.

ఈ బాధ్యతల కోసం ప్రభుత్వ రంగ సంస్థలకు రాయితీలు ఇచ్చి వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. టీడీపీ ప్రభుత్వం ఇవే అంశాలను ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింటే ఎప్పుడో కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులు ఆరంభమై ఉండేవి. దురదృష్టవశాత్తూ టీడీపీ సర్కారు ఈ దిశగా పనిచేయలేదు...’ అని  పరిశ్రమల శాఖపై అపార అనుభవం ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వివరించారు. ‘ఇప్పటికైనా టీడీపీ, బీజేపీలు ఓట్ల డ్రామాలు కట్టిబెట్టి వెనుకబడిన కడపలో స్టీల్‌ప్లాంటు ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈ కర్మాగారం ఏర్పాటు ఆర్థికంగా ఆచరణ సాధ్యం కాదని ఎప్పుడో సెయిల్‌ చెప్పింది. మూడున్నరేళ్ల కిత్రమే ఈ విషయం చంద్రబాబుకు తెలుసు.  మరి ఇప్పుడు ఇదేదో కొత్తగా జరిగినట్లు దీనికి నిరసనగా ఆమరణ నిరాహారదీక్ష  చేస్తామని టీడీపీ నేతలు ప్రకటించడం విడ్డూరంగా ఉంది. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టి ఇప్పుడు ఓట్ల కోసం ఉద్యమం అంటే నమ్మడానికేమైనా ప్రజలు అమాయకులా’ అని కాంగ్రెస్, వామపక్షాల నేతలు ఎద్దేవా చేస్తున్నారు..

కాంగ్రెస్‌దీ తప్పే...
కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనలేదు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు  సాధ్యాసాధ్యాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) రాష్ట్ర పునర్‌విభజన (అపాయింటెండ్‌) తేదీ (2014 జూన్‌ 2) నుంచి ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించాలని  కేంద్ర పునర్విభజన చట్టంలో ఉంది. దీని ప్రకారం 2014 డిసెంబరులో సెయిల్‌ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.  పరిశ్రమ ఏర్పాటు చేయాలి అని కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొని ఉంటే ఈ సమస్యే వచ్చేది కాదంటూ బీజేపీ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. 

వైఎస్‌ కృషివల్లే 
కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుచేస్తామని  రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొనడానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసిన బీజాలే కారణం. కడప జిల్లాలో బ్రహ్మణి ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్‌ సర్కారు భూములు కేటాయించింది. 20వేల మందికి ప్రత్యక్షంగా, లక్షమందికి పరోక్షంగా  ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో  దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి బ్రహ్మణి స్టీల్‌ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.  10 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో,  రూ.20వేల కోట్లు అంచనా వ్యయంతో బ్రహ్మణీ స్టీల్స్‌కు 2007 జూన్‌10న భూమి పూజ చేశారు. రూ. 1500 కోట్ల కోట్లతో నిర్మాణ పనులు కూడా జరిగాయి. స్టీల్‌ ఫ్లాంట్‌ పనులు  వేగంగా సాగుతున్న సమయంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి చనిపోవడంతో బ్రహ్మణీ స్టీల్స్‌కు రాజకీయ గ్రహణం పట్టింది. ఈ కర్మాగారానికి కేటాయించిన భూమిని, గనులను, నీటి కేటాయింపులను టీడీపీ సర్కారు రద్దు చేసింది. తద్వారా బ్రహ్మణి ఉక్కు కర్మాగారం ఏర్పాటు కాకుండా అడ్డుకట్ట వేసింది. కనీసం  దీని స్థానంలో ప్రభుత్వ రంగ సంస్థతో భారీ స్టీల్‌ప్లాంటు నిర్మాణానికి చొరవ తీసుకోవాల్సిన చంద్రబాబు సర్కారు.. విభజన చట్టంలోని హామీ అమలు కోసం కూడా చిత్తశుద్ధితో కృషి చేయకుండా రాజకీయ డ్రామాలు  ఆడుతూ వచ్చింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement