రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యమే రక్ష

24 Mar, 2019 00:25 IST|Sakshi

అభిప్రాయం 

సామాజిక న్యాయసాధన కోసం భారత రాజ్యాంగా నికి కట్టుబడి అది అనుమతి స్తున్న సామాజిక కార్యాచర ణను ప్రోత్సహిస్తూ ప్రజా గాయకుడు గద్దర్‌ ఒక సామాజికోద్యమాన్ని ప్రారంభిస్తున్నారని విని ఎంతో సంతోషించాను. ఈ బృహత్తర కార్యక్రమానికి ‘సేవ్‌ డెమోక్రసీ, సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’ (ఎస్‌డీఎస్‌సీ) అనే పేరు పెట్టారని విని మరీ సంతోషించాను. రాజ్యాంగ సంవిధానం పరి మితులతో, అది కలిగించే ప్రయోజనాలతోనూ, రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక ఆచరణలతోనూ నాలుగు దశాబ్దాలుగా న్యాయవాదిగా, న్యాయమూ ర్తిగా  కుస్తీపట్టినవాడిని. సామాజిక న్యాయం కోసం క్రియాశీలంగా పనిచేస్తున్నామని బాహాటంగా ప్రక టించుకుంటున్న చాలామంది బాబాసాహెబ్‌ అంబే డ్కర్‌ మార్గదర్శకత్వం కింద నిర్మితమైన భారత రాజ్యాంగం ప్రథమ లక్ష్యం సామాజిక న్యాయమేనని స్పష్టంగా వాదించలేకపోవడం నా జీవిత పర్యంతం విచారాన్ని కలిగిస్తూ వస్తోంది. అత్యంత శక్తిమంతంగా తమ వాణిని వినిపిస్తున్న (సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో) కొంతమంది సైతం, రాజ్యాంగచట్రం తమకు సాధికారత ఇవ్వలేక పోతున్నదనీ, వాస్తవానికి అది తమకు అవరోధంగా ఉంటోందనీ వ్యాఖ్యానించడం నన్ను తీవ్రంగా కల వరపెడుతోంది.

మానవ గౌరవం సర్వోన్నత లక్ష్యం
మానవ గౌరవం పట్ల అంకితభావం, మానవాళిని కాపాడాల్సిన అవసరం నాడు రాజ్యాంగ సభ చర్చల్లో ‘రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం’ రూపొం దించే ఆలోచనకు ప్రేరణ కలిగించాయి. మహో న్నతమైన సామాజిక న్యాయం నిజంగానే శక్తిమం తమైన మానవ భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. అంతే కాకుండా అది హింసకు దారి తీసే అవకాశం కూడా ఉంది. అయితే సామాజిక న్యాయాన్ని సాధించే సామాజిక కార్యాచరణ రూపకల్పనకు హింస ఒక సమస్యాత్మక వాహకం అన్నది చారిత్రక సత్యం. ఇది అంతర్గత సమస్య మాత్రమే కాదు. దీని పర్యవసా నాలు సైతం సమస్యాత్మకమైనవే. 

రాజకీయ పార్టీలు తమ సభ్యుల్లో కొందరిని హింసాత్మక చర్యలకు దింపుతున్న ధోరణి పెరుగు తోంది. ఎన్నికలతో ముడిపడిన రాజకీయాల్లో హింసను అంతర్గత భాగం చేస్తున్నారు. నిజమైన ప్రజాస్వామిక ప్రక్రియను ధ్వంసం చేస్తూ సామాజిక న్యాయం అనే రాజ్యాంగ లక్ష్య సాధనను అసాధ్యం చేస్తున్న శక్తులకు వ్యతిరేకంగా నిలవాల్సిన బాధ్యత సామాజిక బృందాలు, సామాజిక ఉద్యమాలపై ఉంది.

భారత రాజ్యాంగం ముసాయిదాను ఆమోదిం చిన సందర్భంలో బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఈ విషయాన్ని అద్భుతంగా (ఎప్పటిలాగే) ప్రస్తావిం చారు: ‘‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూడు సూత్రాలను ఒక త్రయంలోని వేరు విభాగా లుగా భావించకూడదు. ఈ మూడింట్లో ఒకదాన్ని మరొకదాన్నుంచి విడదీసి చూడటం అంటే ప్రజా స్వామ్య లక్ష్యమే ఓడిపోతుందనే అర్థంలో వీటిని విడదీయలేని త్రయంగా రూపొందించారు. సమా నత్వం లేకుండా స్వేచ్ఛ అనేది అనేకమందిపై కొద్ది మంది ఆధిక్యతకు వీలుకల్పిస్తుంది. అలాగే స్వేచ్ఛ లేని సమానత్వం వ్యక్తిగత చొరవను చంపేస్తుంది. సౌభ్రాతృత్వం లేకుండా స్వేచ్ఛ, సమానత్వం అనేవి సహజ క్రమాన్ని సంతరించుకోలేవు. అలాంటి స్థితిలో వాటిని ఒక కానిస్టేబుల్‌ మాత్రమే అమలు చేయాల్సి ఉంటుంది’’.

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఈ విషయాన్ని మరింతగా నొక్కి చేప్తూ భారత సమాజంలో రెండు కీలకమైన అంశాలు కనిపించడం లేదన్నారు. దీనివల్లే బౌద్ధ భిక్షువుల కాలంలో భారతదేశం అభివృద్ధి చేసిన ప్రజాస్వామ్యం ప్రస్తుతం ప్రేరణ కోల్పోయిం దని ఆయన అభిప్రాయం. వీటిలో మొదటిది సమా నత్వం. దీన్నే ప్రత్యేకంగా పేర్కొంటూ అంబేడ్కర్, సామాజిక, ఆర్థిక రంగాల్లో విస్తృతమైన, కొట్టొచ్చి నట్లు కనబడే అసమానత్వాన్ని మనం అనుమతించి నట్లయితే రాజకీయ ప్రజాస్వామ్యం తనంతట తానుగా పేలిపోయే అవకాశాలు మిక్కుటంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మార్క్సిస్టు దృక్పథంలో ప్రజలు తిరగబడతారనే అర్థంలో అంబేడ్కర్‌ చెప్పలేదని నా నమ్మకం. పైగా భ్రమలు నశించిన ప్రజలు నిస్పృహలతో బలమైన నేతలపట్ల స్వామిభక్తిని, విశ్వాసాన్ని ప్రదర్శించడం ప్రారంభిస్తారని, దీంతో ఇలాంటి బలమైన నేతలు ‘ఇతరుల’ను దాడిచేసి నిర్మూలించదగిన శత్రువు లుగా నిర్వచిస్తూ, ప్రా«థమిక అస్తిత్వాలను సైతం సులభంగా మరుగుపరుస్తారని కూడా అంబేడ్కర్‌ భావించినట్లు నేను నమ్ముతున్నాను.

ఆర్థిక అసమానత్వం పెరుగుతోందని ఒకరి తర్వాత ఒకరుగా ఆర్థశాస్త్రజ్ఞులు ఎత్తిచూపుతుం డటం, నయా ఉదారవాద వ్యవస్థ లక్షణం సహ జంగానే వెనుకబాటుతనపు దురవస్థలను మరిం తగా పెంచుతున్నందున సామాజిక, ఆర్థిక నిచ్చెనలో సామాన్య ప్రజల అవకాశాలు, ఆశలు కుదించుకు పోతున్నాయి. దీంతో ప్రపంచమంతటా ఇతరుల పట్ల ద్వేషాన్ని వ్యాప్తి చేసే శక్తిమంతుల పెరుగుదల కోసం మనం ఎదురు చూడాల్సి వచ్చింది. ఇది గత నాలుగైదు దశాబ్దాల్లో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, నైతిక క్రమంపై ఆధిపత్యం చలాయించడానికి సిద్ధమై వచ్చిన అనైతిక రాజకీయ అర్థశాస్త్రపు సహజ పరి ణామమే.

అడుగంటుతున్న సౌభ్రాతృత్వం
ఘోరమైన కుల దొంతరలు, అంతస్తుల కారణంగా అసమ సమాజంలో అమలు జరుగుతున్న ఘోర మైన విధానాలతో  భారతీయ సమాజంలో సౌభ్రా తృత్వం క్షీణించిపోవడం పట్ల అంబేడ్కర్‌ కలవరప డ్డారు. ‘సౌభ్రాతృత్వం అంటే అర్థం ఏమిటి’ అని ఆయన ప్రశ్నిస్తూనే, ’సమస్త భారతీయుల ఉమ్మడి సోదరత్వం – భారతీయులు ఒకే ప్రజ అనే భావ మేనం’టూ సమాధానం చెప్పారు. ‘ఇది సామాజిక జీవితంలో ఐక్యత, సంఘీభావాన్ని ఇచ్చే సూత్రం. దీన్ని సాధించడం కష్టతరం’ అని అభిప్రాయప డ్డారు. ఎందుకంటే భారతీయులమైన మనం వర్గాలు గానే కాకుండా అంతస్తులవారీ అసమానత్వంతో కూడిన కులాలుగా వేరు చేయబడి ఉన్నాం. ఇదే మనల్ని అమానవీకరణ పాలు చేస్తోంది.

దురదృష్టవశాత్తూ, భారతీయ కులీనులు ప్రోత్సహించిన ‘దురాశ మంచిదే’ అనే రకం రాజ కీయ అర్ధశాస్త్ర విధానంలో, – కొంతమంది హేతు బద్ధమైన వ్యక్తులు సైతం, ఇది పెట్టుబడిదారీ  విధా నపు కొల్లగొట్టే రూపంగా ఉత్పరివర్తనం చెందిందని, దీనిలోంచి పుట్టిన ఆశ్రితపక్షపాతం రాజ్యాంగ వ్యవ స్థల ప్రాణాధారాలను కూడా కబళించేస్తోందని చెబుతూ వస్తున్నారు– రాజ్యాంగ నిర్మాతలు వివరిం చిన ప్రాథమిక లక్ష్యం (మన జాతీయ అస్తిత్వ హేతువు) గురించి  మాట్లాడటాన్ని కూడా మనం ప్రస్తుతం ఆపివేశాం. ప్రభుత్వ విధానం అనుసరించే ఆదేశ సూత్రాలను, ప్రత్యేకించి ఆర్టికల్‌ 38, 39 (బి)ని గురించి కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు మాట్లాడుతున్నాయి. మనది పెరుగుతున్న యువ తరం కలిగిన దేశం. మన జాతీయ జనాభా  రాను రాను తరుణ వయస్సులోకి మారుతోంది. 60 నుంచి 70 శాతం వరకు జాతీయ సంపద జనాభాలో ఒక్క శాతం మంది చేతుల్లో ఉండటంతో అసమానత్వం వేగంగా పెరుగుతోంది. అంటే అతికొద్ది మంది వ్యక్తులు అనేకమంది జీవితాలను పణంగా పెట్టి అందరి సంక్షేమం నుంచి కొందరి సంక్షేమం వైపుగా ప్రభుత్వ విధానాలను మళ్లించి, కైవసం చేసుకుం టున్నారని ఇది సూచిస్తోంది. దీని ఫలితంగా పుట్టుకొస్తున్న అసంతృప్తి జనాభాపరంగా మనకున్న సానుకూలతను జనాభాపరమైన విధ్వంసంగా మార్చివేస్తోంది.

రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రభుత్వ వ్యవహారాలకు చెందిన ప్రధాన లక్ష్యాలలో ఒకటైన ‘జాతినిర్మాణ ప్రయ త్నంలో పాటించాల్సిన నైతిక ప్రమాణం’ నయా ఉదారవాద శక్తుల దాడి వల్ల ఒక పద్ధతి ప్రకారం నిర్మూలించబడింది. అయితే ఇక్కడ నేను మరొక విషయాన్ని తప్పక జోడించాల్సి ఉంది. మన  రాజ్యాంగపు నైతిక కట్టడంపై అది నిర్మించదలిచిన రాజ్యపాలనపై మతఛాందస వాదుల దాడి అనేది శూన్యం లోంచి పుట్టుకురాలేదు. హింసను ప్రబో ధిస్తున్న మిలిటెంట్‌ వామపక్షం కూడా మన రాజ్యాంగ నైతికతపై దాడిలో తక్కువ పాత్ర పోషించడం లేదు. సమసమాజ లక్ష్యాల సాధన ప్రక్రియలో మందకొడి, జాప్యందారీ విధానాల వల్ల రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాల సాధన అసాధ్యమై పోతుండటంతో, వామపక్ష అతివాదులు మన రాజ్యాంగం పేర్కొన్న నైతిక ప్రమాణాలను పద్ధతి ప్రకారం కించపరుస్తున్నారు. రాజ్యాంగ నిర్మాణాన్ని నిష్ఫలమైనదిగా ముద్రవేయడం ద్వారా వీరు యువ తను నిస్పృహలో ముంచెత్తుతున్నారు. అదే సమ యంలో ఉదారవాద రాజ్యాంగవాదులు ప్రజా స్వామ్యాన్ని క్రమవిధానంతో కూడిన దృక్పథంతో మాత్రమే చూస్తూ వస్తున్నారు తప్పితే.. అణగారిన వర్గాల సహజసిద్ధమైన గౌరవానికి అనుగుణంగా గుర్తించదగిన జీవన నాణ్యతా ప్రయోజనాలను కల్పించడం గురించి స్పష్టంగా మాట్లాడటం లేదు. ఈవిధంగా వీరు పరిపాలన, రాజ్యాంగ సంవిధానా నికి సంబంధించిన మౌలిక వ్యవస్థలను హరింపచేస్తు న్నారు. ఇది మన వ్యవస్థలో బోలుతనంతో కూడిన అనైతిక స్థితిని తయారు చేస్తోంది. ఇక్కడే ఫాసిస్టు శక్తులు తమ విభజన రాజకీయాల విషాన్ని మరింత సమర్థంగా చొప్పించేస్తున్నాయి. మనం దీనికి మూల్యాన్ని చెల్లిస్తున్నాము. ఈ పరిస్థితిని మనం పూర్తిగా మార్చాల్సి ఉంది.

అలక్ష్యానికి గురైనవారి వేదిక
రాజ్యాంగ సందేశాన్ని ప్రజ లలోకి తీసుకుపోవడానికి ప్రయత్నించే ప్రతి నూతన సామాజిక ఉద్యమ ప్రారంభం సందర్భంగా నా హృదయంలో కాస్త ఆశలు మోసులెత్తేవి. ఉద్యమాన్ని ప్రారంభిస్తున్న ఈ బృందం నిజంగానే రాజ్యాంగ నైతికతను అర్థం చేసు కుని సంపదలు కోల్పోయిన వారికీ, అలక్ష్యానికి గురై నవారికీ రాజకీయ, ఆర్థిక, సామాజిక ఆకాంక్షలను నెరవేర్చుకునే విషయంలో మానవ గౌరవాన్ని, సౌభ్రాతృత్వాన్ని నిలబెట్టే విధంగా ఒక వేదికను అందిస్తుందని నేను ప్రతి సందర్భంలోనూ ఆశించేవా డిని. రాజ్యాంగం, రాజ్యాంగ ప్రాసంగికత గురించి రాజకీయ క్రమాలు, వ్యవస్థలకు సంబంధించిన సమాచారాన్ని వీరు పూర్తిగా తెలియపరుస్తారనీ, తద్వారా అధికారంలో ఉన్న శక్తులు సామాజిక న్యాయాన్ని మరింత సంపూర్ణంగా ప్రోత్సహించే విధానాలను రూపొందించి అమలు చేస్తాయని నేను ఆశించేవాడిని. ‘మన సామాజిక, ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో రాజ్యాంగ పద్ధతులను ఎత్తిపడుతుం దనీ, రక్తపాత విప్లవ పద్ధతులను పరిత్యజిస్తుందని’ ఆనాడు బాబాసాహెబ్‌ ఆశించారు. ఇప్పుడు ఏర్పడ నున్న నూతన సామాజిక ఉద్యమం కూడా అలాంటి ఆశను మళ్లీ కలిగిస్తోంది. పైగా ప్రారంభమయ్యే ప్రతి నూతన సామాజిక ఉద్యమం కూడా’ అంతర్గత పార్టీ ప్రజాస్వామ్యాన్ని చురుకుగా ప్రోత్సహిస్తుందని, వ్యక్తి స్వేచ్ఛలను గొప్ప వ్యక్తుల పాదాలకింద పరిచే పద్ధతులను ప్రోత్సహించదని, లేక సంస్థలను పక్కన పెట్టే తరహా అధికారాలను అంటగట్టే రీతిలో వారిని విశ్వసించదని నేను నమ్ముతున్నాను. మతంలో భక్తి అనేది ఆత్మల విముక్తికి మార్గం కావచ్చు. కానీ రాజ కీయాల్లో భక్తి లేక వీరపూజ అనేవి పతనానికీ, నియంతృత్వానికీ అనివార్యంగా బాటలు వేస్తాయి.’’

గొప్ప చింతనాపరులు, ప్రజాకవులు గాఢమైన అంతర్‌ దృష్టిని కలిగి ఉంటారు. తమకు జరిగే అవ మానం వారిని అపరిమిత అధికారాన్ని ప్రశ్నించేం దుకు పురికొల్పుతుంది, సామాన్య ప్రజల అభిమ తాన్ని దృష్టిలోకి తీసుకోని విధంగా వ్యవహరించే అన్యాయానికి సంబంధించిన కొలమానాలను అర్థం చేసుకునే సహానుభూతి వారికి ఉంటుంది. ఈ తత్వం సామాజిక ఉద్యమంలో అంతర్గత తనిఖీలకు ఉప యోగపడుతుంది. వ్యక్తం చేసే విలువల మధ్య వైరుధ్యం గురించి చేసే ఆకాశాన్నంటే వాగాడం బరం, అమానవీకరించే కేంద్రీకృత అధికారం పట్ల దురాశ పెరిగిపోవడాన్ని జాగ్రత్తగా గమనిస్తే అవి వ్యవస్థ సంస్కరణకు వనరులు అవుతాయి. ఈ నూతన సామాజిక ఉద్యమ నిర్వాహకులు ఈ అంశం పట్ల నిరంతరం దృష్టి పెడుతారని నేను ఆశిస్తున్నాను.

మన రాజ్యాంగం ఊహించిన గొప్ప నైతిక విప్లవాన్ని తీసుకురావడం కోసం జరిగే ప్రయత్నా లను విజయం లేదా పరాజయం అనే సాధారణ కొలమానాల నుంచి అంచనా వేయలేం. అంబేడ్కర్‌ నుంచి రామ్‌ మనోహర్‌ లోహియా వరకు ఈ దేశం లోని అతిగొప్ప చింతనాపరులు, నైతిక ధీరనాయ కుల్లో కొందరు ఎన్నికల్లో కానీ ఇతరత్రా కానీ తక్షణ విజయాలను సాధించలేదన్నది తెలిసిన విషయమే. కానీ వారి ఉజ్వల దార్శనికత, నైతిక ధృతి తరం తర్వాత తరాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఈ కొత్త సామాజిక ఉద్యమాన్ని ప్రారంభిస్తున్న నాయకు లకు నా సలహా ఇదే. 

ఈ ఎన్నికల్లోనూ లేక మరో ఎన్నికల్లోనూ సాధించే విజయం గురించి తక్కువగా ఆలోచిం చండి, రాజ్యాంగ దార్శనికతను ముందుకు తీసుకుని పోవడంలో సాధించే అంతిమ విజయాల గురించి అధికంగా ఆలోచించండి. అధికారంలో ఉన్న వారికి రాజ్యాంగతత్వం గురించి నిత్యం ఎత్తిచూపుతుండ టమే మీ లక్ష్యం కావాలి. మన రాజ్యాంగం వ్యవస్థీ కరించిన ‘రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం’ ఒక్కటి మాత్రమే సమస్త ప్రజల గౌరవానికి హామీని ఇవ్వ గలదని, అదొక్కటి మాత్రమే వారిమధ్య సోదర త్వాన్ని పరిరక్షించగలదని మీరు మన యువతీ యువకులకు నిత్యం చెబుతూ ఉండండి.
(రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ‘సేవ్‌ డెమాక్రసీ, సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’  ఉద్యమం వ్యవ స్థాపక సభకు పంపిన సందేశం సంక్షిప్త రూపం)


జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి 
వ్యాసకర్త సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి

మరిన్ని వార్తలు