పునర్నిర్మాణం చేయిమారితే...

3 Nov, 2018 03:09 IST|Sakshi

తెలంగాణ సమాజమంతా కలిసికట్టుగా ఒక నిర్ణ యం తీసుకోవాల్సి ఉంది. ఉద్యమ సమయంలో సబ్బండ వర్ణాలు కలిసికట్టుగా జై తెలంగాణ అని నినదించినట్లుగా ఈ ఎన్నికల్లో కూడా కీలకనిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కలిసి పోరా డింది తెలంగాణ కోసం. రాష్ట్రం సాకారం చేసుకున్నాక మళ్లీ ముక్తకంఠంతో తొలి ఎన్నికల్లో ఉద్యమనేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే తెలంగాణ జై కొట్టింది. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరెన్ని ఆరో పణలు చేసినా ఈ నాలుగున్నరేళ్లుగా తెలంగాణలో పునర్నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కేసీఆర్‌ ఆలోచనలతో, దార్శనికతతో ప్రధానంగా సాగు, తాగునీటి రంగాలకు సంబంధించిన మహత్తరమైన పనులు దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా జరుగుతున్నాయి. కాళేశ్వరం పనులు పూర్తికాబోతున్నాయి. కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్లు చివరనవున్న నడిగూడెం పాదాలను తాకాలి. అది కదా పరవశం. శక్తినంతా కూడదీసుకుని, ఉన్న వనరుల న్నింటిని ఉపయోగించుకొని తెలంగాణ సమాజనిర్మాణం జరుగుతున్నది. దీనికి కేసీఆర్‌ దార్శనికతతో పాటుగా ఆయనలో ఉన్న మొండితనం, వెనక్కు తగ్గని స్వభావం కూడా దోహదం చేస్తున్నది. కేసీఆర్‌పై రాజకీయ విమర్శలు చేసేవాళ్లు సైతం ఈ నాలుగున్నరేళ్లలో ఆయన పునర్నిర్మాణపనులను అంగీకరించారు. కాకపోతే ఇపుడు ఎన్నికలు కాబట్టి ఎవరైనా, ఏదైనా కూయవచ్చును. కేసీఆర్‌ ఆనాడు రాష్ట్ర సాధన ఉద్యమానికి ఎంత అవసరమో నేటి పునర్నిర్మాణానికి కూడా అంతే అవసరం. కేసీఆర్‌ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకుపోతున్నారు. ఈ అభివృద్ధి రథం ఆగకూడదు. ఈ పునర్నిర్మాణ ప్రక్రియకు బ్రేకులు పడకూడదు.  

సరిగ్గా రాష్ట్రసాధన ఉద్యమ సమయంలో దూరంగా వున్న శక్తులు, ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని అడ్డుతగిలిన వ్యక్తులు ఈ ఎన్నికల్లో మహాకూటమిగా రావటం కేసీఆర్‌కు రాష్ట్రసాధన తర్వాత జరుగుతున్న మరో పరీక్ష. కేసీఆర్‌కు సవాళ్లను సవాల్‌చేసి ఎదుర్కొనటం అలవాటైన విద్య. రాష్ట్రసాధన ఉద్యమంలో, రాజకీయ ప్రక్రియలో ఉద్యమజెండాను పట్టుకొని ఒక్కడుగా తెగించి కొట్లాడాడు. సరిగ్గా రాష్ట్ర అవతరణ తర్వాత జరుగుతున్న రెండవ ఎన్నికల్లో శక్తులన్నీ కట్టకట్టుకుని మీదకు దూసుకొస్తున్నా కేసీఆర్‌ ఒక్కడుగానే ధైర్యంగా, ధీశాలిగా ఈ బరిలో నిలిచి దూసుకుపోయేందుకు సిద్ధమవుతున్నారు. పదవులు రానివాళ్లు, పదవుల్లో లేని వాళ్లు, రాజకీయ వారసత్వం పోతుందని తహతహలాడుతున్న ఆధిపత్యశక్తులు కేసీఆర్‌ను ఎదుర్కోలేవు. తెలంగాణకు కేసీఆర్‌ కాకుండా ఎవరికి ఈ అధికార పగ్గాలిచ్చినా ప్రగతి కుంటుపడుతుంది. ప్రజల నోటి దగ్గరకు వచ్చిన సంక్షేమ పథకాలు ఆగిపోయే ప్రమాదముంది. ఒక నిర్మాణం జరుగుతున్న సమయంలో దాన్ని ఆపి వేరే వాళ్లకు హస్తగతం చేస్తే దాని రూపురేఖలు మారిపోవచ్చును. అందుకే కేసీఆర్‌ సీఎంగా కొనసాగాల్సిన అవసరముంది. దీన్ని సంక్షేమపథకాల లబ్ధిపొందే పేదలు గుర్తుపెట్టుకుంటారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎక్కువమంది నూతన వర్గాల నుంచి వచ్చారు. ఉద్యమం నుంచి నేరుగా వచ్చినవాళ్లు. తెలంగాణలో రాజకీయ అవినీతి లేదు. డబ్బు చుట్టూ చేరే శక్తులకు కేసీఆర్‌ బ్రేక్‌ వేశారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రేమికులు, ఆలోచనా పరులంతా అర్థం చేసుకుని తీర్పునిస్తారు.  
ఆచార్య నిర్మాణ్, హైదరాబాద్‌
 

>
మరిన్ని వార్తలు