వెనక్కి తగ్గని ‘షహీన్‌బాగ్‌’

23 Jan, 2020 00:27 IST|Sakshi

సందర్భం

షహీన్‌బాగ్‌ గురించి కొత్తగా పరిచయం చేయ వలసిన అవసరం లేదు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనోద్యమంతో ఆ పేరు నెలరోజులుగా మీడియాలో మారుమోగు తోంది. దక్షిణ ఢిల్లీలోని ఆ బస్తీలో పనిపాటలు చేసుకునే ముస్లింల జనాభా అధికం. ఎముకలు కొరికే శీతాకాలం చలిలో మహి ళలంతా రాత్రింబవళ్లు తమ పిల్లలతో కలిసి ఆ ఉద్యమంలో పాల్గొంటున్నారు. వారికి నచ్చజెప్పి అక్కడినుంచి పంపేయాలని పోలీసులు, పాలనా యంత్రాంగం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చట్టాన్ని ఉపసంహరించుకుంటే తప్ప అక్కడి నుంచి కదలబోమంటున్న ఆందోళనకారులపై కేంద్ర బీజేపీ నేతలు చేసిన విమర్శలు ఏమాత్రం పనిచేయలేదు. బలవంతంగా వారిని అక్కడి నుంచి పంపించాలని పోలీసులు అనుకున్నా ఉద్యమం శాంతియుతంగా సాగడంవల్లా, జాతీయ, అంతర్జాతీయ మీడియా షహీన్‌బాగ్‌పై నిరంతరం దృష్టి పెట్టడం వల్లా అది కుదరలేదు. ఆందోళన శిబిరం కారణంగా దక్షిణ ఢిల్లీని, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడానూ అనుసంధానిస్తున్న ప్రధాన రహదారికి ఆటంకం కలగడంతో న్యాయ స్థానం కూడా పోలీసులకు చీవాట్లు పెట్టింది.  అయితే నిరసన తెలిపేందుకు ఉద్యమకారులకున్న హక్కును న్యాయస్థానాలు తోసిపుచ్చడం లేదు.

కానీ వారిని ఒప్పించి అక్కడి నుంచి పంపించా లంటున్నాయి. ఆ దిశగా పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోగా ఉద్యమం తీవ్రత మరింత పెరిగింది. షహీన్‌బాగ్‌ తరహా నిరసనలే దేశంలోని మరో 40 నగరాల్లో జరుగుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన విపక్షాలు నిరాశానిస్పృహలతో ఈ నిరసనోద్యమాలను సాగి స్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తదితర నేతలు ఆరోపి  స్తున్నారు. ప్రతిపక్ష నాయకులు సీఏఏపై తప్పుడు వార్తలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శి స్తున్నారు. ఈ ఉద్యమాలు సహజసిద్ధమైనవి కాదని, విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్‌ వీటి వెన కున్నాయన్నది బీజేపీ ప్రధాన ఆరోపణ. కానీ ఆందోళనకారులు దీన్ని కొట్టిపడేస్తున్నారు. ప్రజా సమస్యలపై ఈ స్థాయిలో ఆందోళనలు నిర్వహిం చగల సత్తా కాంగ్రెస్‌కి ఉంటే అది ఇప్పుడున్నంత దయనీయ స్థితిలో పడేది కాదని వారంటున్నారు. అటు కాంగ్రెస్‌ నేతలు అడపా దడపా నిరసన శిబిరానికొస్తున్నారు. దీనిద్వారా లబ్ధి పొందే ప్రయ త్నాలూ చేస్తున్నారు. విమర్శించడానికి బీజేపీకి ఆయుధం అందిస్తున్నారు.

తమకు ఎవరి ప్రోద్బ లమూ లేదని, తమకెవరూ డబ్బులు కూడా ఇవ్వడం లేదని, కేవలం ఆ చట్టం ప్రజా వ్యతిరేక మైనది కనుకే తాము వ్యతిరేకిస్తున్నామని, నిరసన తెలియజేస్తున్నామని ఉద్యమకారులు వివరిం చారు. షహీన్‌బాగ్‌ ఉద్యమంలో మహిళలు అధిక సంఖ్యలో ఉండటం బీజేపీకి ఒక సవాలుగా మారింది. కుల, మతాలకు అతీతంగా వివిధ వర్గాలవారు షహీన్‌బాగ్‌ ఆందోళనలో పాలుపం చుకుంటున్నారు. ఉద్యమకారులను కలిసి, వారి లోవున్న భయాందోళనలు తొలగించాల్సిన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పెద్దలు దీనికి రాజకీయ రంగు పులమడానికి ప్రయత్నించడం ద్వారా ఒకవిధంగా తప్పు చేస్తున్నారు. ఆందోళనకారులకు అపోహ లుండొచ్చు. వాటికి ప్రాతిపదిక లేకపోవచ్చు. వారివి తప్పుడు అభిప్రాయాలే కావొచ్చు. ఆందో ళన చేస్తున్నవారికి నచ్చజెబుదామని, ఒప్పిద్దామని చూడకుండా ఇష్టానుసారం ఆరోపణలు చేయడం వల్ల పరిస్థితి చక్కబడకపోగా, మరింత వికటి స్తుంది. షహీన్‌బాగ్‌ ఉద్యమాన్ని తేలికచేయడం వల్ల లేదా అణచడానికి ప్రయత్నించడం వల్ల అది మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఏర్పడు తుంది. ఇప్పటికే షహీన్‌బాగ్‌ దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించగలిగింది. 

లక్ష్మణ్‌ వెంకట్‌ కూచి
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు