పోటీచేసేది నేరగాళ్లా? అక్రమార్జనపరులా?

22 Mar, 2019 00:44 IST|Sakshi

విశ్లేషణ

ఎన్నికల రణరంగం మళ్లీ ఆరంభం. పోటీ చేయదలచుకున్న అభ్యర్థులందరూ తమ వివరాలు ప్రమాణ పత్రాల రూపంలో ఇవ్వక తప్పని నిజ ప్రకటనలు మొదలవుతాయి. మన ఓట్లడుక్కునే అభ్యర్థులు ఎవరో ఏమిటో వారి నేపథ్యం సరైందో కాదో తెలియకుండానే ఓటు వేయడం మంచిదా? నేరగాళ్లను పోటీ చేయకుండా ఆపే చట్టాలు మన ప్రజాస్వామ్య దేశంలో లేవు. కనీసం వారి వివరాలైనా తెలియడం మంచిదని ఒక సామాన్యుడు సాగించిన పోరాటం విజయం సాధించడం వల్లనే మనకీ హక్కు లభించింది. అహ్మదాబాద్‌ ఐఐఎం ఆచార్యుడు త్రిలోచన్‌ శాస్త్రి కొందరు మిత్రులతో కలిసి అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రసీ ఏడీఆర్‌ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎన్నికల సంస్కరణల రంగంలో కృషి చేస్తున్నారు.

నేరగాళ్లను చట్టసభలకు పోటీ చేయకుండా నిరోధించకపోయినా ఫరవాలేదు కాని వారి వివరాలు వారంతట వారే తెలియజెప్పాలని ఎందుకు నియమాలు చేయరు అని ఆయన కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా అడిగారు. లా కమిషన్‌ కూడా ఆ మేరకు చేసిన సిఫార్సులను కోర్టు ముందుంచారు. అభ్యర్థి సమర్థుడా కాదా, అతనికి శక్తి ఉందా అని పరిశీలించేందుకు ఓటర్లకు ఆ సమాచారం అవసరమని వాదించారు. ఆశ్చర్యమేమంటే దేశంలోని ప్రతిరాజకీయ పార్టీ ఈ వాదనను ప్రతిపాదనను వ్యతిరేకించింది. కానీ అడిగిన ప్రశ్న కోర్టుకు సమంజసంగా తోచింది. భారత ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలన్నిటికీ నోటీసులు ఇచ్చింది. వారంతా కోర్టు ముందుకు వచ్చి మా అభ్యర్థులెవరూ తాముచేసిన నేరాల చిట్టా ఇవ్వరు. తమ సంపాదన సమాచారం ఇవ్వరు. ఆ సమాచారం కోరే అధికారం ఓటర్లకు లేదని వాదించారు. 

వివాదాస్పదమైన అంశంపైన ఏ చట్టాలూ లేకపోతే స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు నిర్వహించవలసిన బాధ్యత కలిగిన ఎన్నికల కమిషన్‌ ఆ ఖాళీని పూరించి తగిన చర్యలు తీసుకునే అధికారం ఉంటుం దని కోర్టు నిర్ధారించింది. ఆర్టికల్‌ 324 ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు తగిన అధికారాలన్నీ కమిషన్‌కు ఉన్నాయి. కనుక పోటీ చేసే అభ్యర్థి తన వివరాలు ఇవ్వాలని ఆదేశిస్తూ నియమాలు జారీ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఓటు వేయడం అంటే తన అభిప్రాయం ప్రకారం పాలించే అర్హత ఎవరికి ఉందో నిర్ణయించే అధికారం. ఆ అధికారం ఇచ్చే ముందు వారిగురించి తెలుసుకునే అధికారం హక్కు పౌరులకు ఉంది. ఇదికూడా ఆర్టికిల్‌ 19(1) (ఎ)లో అంతర్భాగమే అని న్యాయస్థానం మే 2, 2002న తేల్చింది. ఈ తీర్పులోనే ప్రజలకు తెలుసుకునే హక్కు సమాచార హక్కు ఉందని సుప్రీంకోర్టు నిర్ద్వంద్వంగా నిర్ధారించింది. పోటీ చేసే అభ్యర్థుల సమాచారం విషయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించింది. సమాచారం లేని పౌరుల వల్ల ప్రజాస్వామ్యం పరిహాసాస్పదం అవుతుందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.  

ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యానికి ఒక విజయాన్ని అందించింది. కాని ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ విజయాన్ని నీరుగార్చాయి. మంచి నాయకుడు, రాజకీయ తత్వవేత్తగా పేరున్న వాజ్‌పేయి నాయకత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు బీజేపీకి పూర్తి ఆధిక్యత లేదు. మైనారిటీలో ఉంది. కనుక ఇతర మిత్రపార్టీల పైన ఆధారపడి జీవిస్తున్నది. కానీ మిత్ర ప్రతిపక్ష పార్టీలన్నీ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించాయి. దీంతో కేంద్రం ఈ తీర్పును వమ్ముచేస్తూ ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించింది. రెండేళ్లు లేదా అంతకన్న ఎక్కువ జైలు శిక్ష విధించతగిన నేరాలలో శిక్ష పొందారో లేదో అభ్యర్థులు చెప్పాలని మాత్రం (సెక్షన్‌ 33ఎ) నియమం రూపొందిం చారు. సుప్రీంకోర్టు తీర్పులో ఏమి చెప్పినప్పటికీ అభ్యర్థులెవరూ అదనపు సమాచారం ఏదీ ఇవ్వనవసరం లేదని 33 బి నియమాన్ని చేర్చారు. మళ్లీ ఏడీఆఆర్‌ పీయూసీఎల్‌ సుప్రీంకోర్టుకు వెళ్లాయి  ఏడీఆర్‌ పీయూసీఎల్‌ పక్షాన మన తెలుగుతేజం పద్మభూషణ్‌ పవని పరమేశ్వరరావు (పీపీ రావుగా సుప్రసిద్ధులు) రాజిందర్‌ సచార్‌తో కలిసి వాదించి గెలి చారు. జస్టిస్‌ బి వెంకట్రాం రెడ్డి న్యాయమూర్తులు ఎంబిషా,  డీఎం ధర్మాధికారి, ధర్మాసనం నుంచి అత్యంత ప్రథానమైన ఈ సమాచార హక్కును ఓట ర్లకు ప్రసాదించారు.

ప్రతిపోలింగ్‌ బూత్‌లో ఓటరు ఓటు వేయడానికి వెళ్లేముందు ఈ అఫిడవిట్ల ప్రతులు పెద్ద సైజు అక్షరాలలో ముద్రించి ఓటరు పరిశీలనకు అందుబాటులో ఉంచాలి. చదువు ఉంటే ఫరవాలేదు కాని నేర చరిత్రను బట్టి అభ్యర్థి సంపాదన తీరును బట్టి అతను అక్రమమార్గాలు అనుసరించిన వాడో కాదో తెలుసుకోవచ్చు. నిజాలు అవగాహన చేసుకుని నా ఓటు పొందడానికి అర్హుడేనా అని ఆలోచించి, ఆ తరువాతే ఓ నిర్ణయానికి రావాలి.


మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

మరిన్ని వార్తలు