ఇది పేదలను పట్టించుకోని ప్రజాస్వామ్యం

1 Jan, 2019 01:35 IST|Sakshi

పశ్చిమ బెంగాల్‌ గవర్నర్, మహాత్మాగాంధీ, రాజగోపాలాచారి మనవడు, ప్రముఖ జీవిత చరిత్ర కారుడు, మేధావి రాజమోహన్‌ గాంధీ విజయవాడ విచ్చేసిన సందర్భంగా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ  ప్రొఫెసర్‌ అడ్లూరి రఘురామరాజు సాక్షి పాఠకులకోసం ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు,

ప్రపంచంలో ప్రజాస్వామ్యం గురించి సాధారణంగానూ, భారత్‌లో ప్రజాస్వామ్యంపై ప్రత్యేకంగానూ మీ అభిప్రాయాలు వివరించండి.ప్రజాస్వామ్యంపై మహాత్మాగాంధీ అభిప్రాయాలను తెలుపండి
గ్లోబల్‌గా మారిపోయిన ప్రపంచం ఇప్పుడు, ఇటీవలి సంవత్సరాల్లో ట్రైబల్‌గా మారిపోయింది. దేశం తర్వాత దేశంలో రాజకీయనాయకులు తమ దేశం ప్రతిఒక్కరిదీ కాకుండా కొద్ది గ్రూపుల స్వంతమై ఉందనే భావాన్ని ముందుకు తెస్తున్నారు. అమెరికాను మళ్లీ వెనక్కు తీసుకెళదాం అంటున్న ట్రంప్‌ అమెరికా శ్వేత ప్రజలు తమ దేశాన్ని మళ్లీ నల్లజాతి ప్రజలనుంచి, స్పానిష్‌ మాట్లాడే అమెరికన్ల నుంచి, ఆసియన్‌ అమెరికన్ల నుంచి తమ స్వాధీనంలోకి తెచ్చుకోవాలనే భావాన్ని ప్రతిపాదిస్తున్నారు. నల్లవారు, శ్వేతేతరులు అమెరికన్లు కాదని చెబుతున్న ఆయన అభిప్రాయం ప్రతి ప్రజాస్వామిక నియమాన్నే కాకుండా అమెరికా రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తోంది. ఇక్కడ భారత్‌లో కూడా అదేవిధమైన ప్రకటనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఆలోచన గాంధీ, మన స్వాతంత్య్రోద్యమం పునాదులనే పూర్తిగా వ్యతిరేకిస్తోంది. పైగా ఇది మన రాజ్యాంగానికే అభాస. ప్రతి భారతీయుడికీ భారతదేశం సమానంగా చెందుతుందన్నది గాంధీ 1909లో హింద్‌ స్వరాజ్‌ అనే శక్తివంతమైన రచన చేసినప్పటి నుంచే పెట్టుకున్న స్థిరమైన అభిప్రాయం. ఇక ప్రజాస్వామ్యం, అభివృద్ధి విషయానికి వస్తే, ధనబలం ఎన్నికలను ప్రభావితం చేస్తున్నప్పుడు అభివృద్ధి అంటే ఇప్పటికే ధనవంతులైన వారిని మరింత ధనవంతులుగా చేస్తుందనే అర్థం.

నేడు మానవ వనరులతో సహా సహజ వనరులను ఆలోచనారాహిత్యంతో ఉపయోగిస్తుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 
వికలాంగులు, రోగులు, గ్రామీణులు, పేదలు, నిర్వాసితులు, మహిళలు, పిల్లలు తదితరులకు సహకరించని అభివృద్ది ఇప్పటికే బలంగా ఉన్నవారికి, సంపన్నులుగా ఉన్నవారికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. సహజ వనరులను జాగ్రత్తగా, వివేకంతో ఉపయోగించుకోవడానికి బదులుగా వాటిని విచ్చలవిడిగా కొల్లగొడుతున్నట్లయితే భవిష్యత్తు ఇప్పటికంటే భయంకరంగా మారిపోతుంది. ఈ వాస్తవం గురించి జాగరూకత పెరుగుతోంది. మనలో ప్రతి ఒక్కరూ మన అభివృద్ధి చట్రాన్ని తిరగదోడి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు, గ్రామీణ భారతంలో విద్య, వైద్య స్థాయిలను పెంచుతూ, మన సహజవనరులను భూమి, నీరు, అడవులు, మానవ నైపుణ్యాలను పరిరక్షించేలా ఉద్యమాన్ని ప్రోత్సహించాల్సి ఉంది.

నేటివరకు గాంధీ ప్రవచించిన గ్రామస్వరాజ్‌ ఊహాస్వర్గం గానే ఉంటూ వస్తోందా?
కొంతమంది గ్రామస్వరాజ్యాన్ని ఊహాస్వర్గం అని పిలుస్తూండవచ్చు. కానీ మన గ్రామాల్లో జీవితాన్ని పునరుద్ధరించని సుసంపన్న భారత్‌ గురించిన స్వప్నమే పూర్తిగా ఊహాస్వర్గం అని చెప్పాలి. భారత్‌లోని కోట్లాది మంది ప్రజలందరూ ముంబై, కోల్‌కతా,  ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, చెన్నై వంటి నగరాలకు వలస వెళ్లవచ్చు అని ఆలోచించేవారు తమ మెదడును పరీక్షించుకోవలసి ఉంది. పైగా ఈ అన్ని నగరాలూ ఇప్పటికే నివాసయోగ్యం కాకుండా పోయాయి. అందుకే మన గ్రామాల్లోని జీ వితాన్ని పునరుద్ధరించడమనేది ఈ రోజు యుద్ధప్రాతిపదికపై చేయాల్సిన విధి.

ఆధునిక దక్షిణ భారతదేశంపై మీరు ఇటీవల ప్రచురించిన ’’ఎ హిస్టరీ ఫ్రమ్‌ ది 17త్‌ సెంచరీ టు అవర్‌ టైమ్స్‌’’ గురించి క్లుప్తంగా మా పాఠకులకు చెబుతారా?
ప్రాచీన చరిత్ర గురించి రెండు ముక్కల్లో చెప్పడం సాధ్యం కాదు కదా? కానీ, ఆంధ్ర, తెలంగాణ ప్రజలు దక్షిణ భారత దేశం గురించిన ఈ నాలుగు శతాబ్దాల చిత్రణను తప్పకుండా చదువుతారని భావిస్తాను. ఈ పుస్తకరచనలో రెండు తెలుగురాష్ట్రాలకు చెందిన  పలువురు స్నేహితులు నాకు ఎంతగానో సహకరించారు. దక్షిణభారత్‌ గురించి అధ్యయనానికి నోచుకోని పరిణామపూర్వక సందర్భాలను పునశ్చరణ చేయడమే నా ప్రాజెక్టు లక్ష్యం. 17, 18, 19, 20 శతాబ్దాల్లో దక్షిణ భారతదేశం ఎలా ఉండేది. ఈ ప్రాంతాన్ని పాలించిన ఏ పాలకులనుంచి బ్రిటిష్‌ పాలకులు తమ ఆధిపత్యాన్ని స్థిరపర్చుకున్నారు? బ్రిటన్‌ ఆక్రమణను అడ్డుకోవడానికి ఇక్కడి పాలకులు చేతులు కలపడానికి ప్రయత్నించారా? ఈ ప్రాంతంలోని అనేక కులాలు, భాషా బృందాల మధ్య ఎలాంటి సంబంధాలు ఏర్పడ్డాయి? వేరుగా ఉన్నప్పటికీ రాజకీయ స్వాతంత్య్రం, సామాజిక న్యాయం కోసం ఇక్కడి పోరాటాలు ఎలా రూపుదిద్దుకున్నాయి? నాలుగు శతాబ్దాల కాలంలో దక్షిణ భారత్‌ను మార్చిన గుర్తించదగిన ఉద్యమాల్లో స్త్రీపురుషుల పాత్ర ఎలాంటింది? అఖిల భారత స్థాయిలో నాయకత్వం కోసం దక్షిణ భారతదేశం గట్టిగా ప్రయత్నిస్తోందా?ఆధునిక దక్షిణ భారత్‌కి ఒక విశిష్టమైన గుణం ఉందా ఇలాంటి ప్రశ్నలే నేను ఈ పుస్తకంలో సంధించాను. పండితులు నా సమాధానాలను విమర్శిస్తారని, నేను లేవనెత్తని ప్రశ్నలను సంధిస్తారని ఆశిసున్నాను.

తాము ఇప్పటికే చేస్తున్న పనికి అదనంగా జోడించాల్సిన రంగాలను కనుగొనడానికి కొంతమంది యువ, ప్రతిభావంతులైన రచయితలు, స్కాలర్లు మిమ్మల్ని సంప్రదిస్తే మీరు వారికి ఏం సూచిస్తారు?
పలువురు ప్రముఖుల జీవిత చరిత్రలు (గాంధీ, పటేల్, రాజాజీ, దర్బార్‌ గోపాల్‌దాస్, జిన్నా) రాసిన అనుభవంతో నేను జీవిత చరిత్రలు రాయాలనే సూచిస్తాను. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి వారి వారి  జీవితాలనుంచి శక్తివంతమైన గాధలను చెప్పగలరు. ఒక పరిశోధకుడు లేక రచయిత మరొక వ్యక్తి గురించి తీవ్రంగా ఆసక్తి కలిగి ఉంటే ఆ వ్యక్తి జీవిత చరిత్ర రాయడమే విలువైనదిగా ఉంటుంది. 1972లో  లండన్‌లోని ఒక స్కాలర్‌ నాకు జీవిత చరిత్ర రచన గురించి రెండు చిట్కాలు సూచించారు. ఒకటి మీరెన్నుకున్న అంశంపై సహానుభూతి, రెండు అతడిని లేక ఆమెను విమర్శించాలని భావించడం. అలాగే  చరిత్ర ప్రత్యేకించి చిన్న, పెద్ద ప్రాంతాల చరిత్ర చాలా ఆసక్తికరమైనది. అవిభాజ్య పంజాబ్‌ గురించి నేను 2013లో నేను రాసిన పుస్తకం ప్రచురించిన తర్వాత చాలామంది దాన్ని ఆదరించారు. దాంతో నేను  మరింత పెద్దదైన దక్షిణ భారత్‌ చరిత్ర గురించి రాయాలనే కుతుహలం పెరిగింది. నిజానికి అవి అసాధారణమైన, అనూహ్యమైన,  మరువలేని పరిణామాలను క్రోడీకరించినట్లయితే జిల్లా, తాలూకా, పట్టణం, గ్రామం వంటి వాటి చరిత్ర కూడా ఆసక్తికరంగా ఉంటుంది.   

ఎ.రఘురామరాజు 

మరిన్ని వార్తలు