ఉగ్రదాడి తెస్తున్న పెను ప్రమాదం

16 Feb, 2019 04:55 IST|Sakshi

జాతిహితం

జమ్మూ–కశ్మీర్‌లోని పుల్వామాలో సైనిక కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడి స్థానిక ఘర్షణల ఫలితం కాదు. ఐఎస్‌ఐ ప్రేరేపిత జైషే అహ్మద్‌ వ్యూహంలో భాగంగా ఆ దాడి జరిగింది. ఉగ్రదాడులు జరిగిన ప్రతి సందర్భంలోనూ పాక్‌ ప్రమాదకరమైన వ్యూహాన్ని అమలు చేస్తూంటుంది. నేను కోరిందల్లా ఇవ్వు. లేకపోతే నా తలను నేనే పేల్చుకుంటాను అంటూ తనతలపై తానే ట్రిగ్గర్‌ గురిపెట్టుకునే తరహాలో పాకిస్తాన్‌ వ్యవహరిస్తోంది. పైగా ఇరు దేశాల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగినప్పుడు చల్చార్చడానికి అమెరికాతో సహా ప్రపంచ దేశాలు ముందుకొచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. ఈ క్రమంలో యుద్ధ ప్రకటన ఎవరు చేసినా దాని ఫలితం ప్రమాదకరంగానే ముగుస్తుంది.

పాకిస్తాన్‌ వ్యూహచింతనపై దక్షిణాసియా వ్యవహారాల్లో అమెరికన్‌ నిపుణుడు స్టీఫెన్‌ పి. కోహెన్‌ తెలివిగా వర్ణించారు. పాకిస్తాన్‌ తన తలపై తుపాకీ గురిపెట్టుకుని ఇతర ప్రపంచంతో చర్చలు సాగిస్తూం టుందని వ్యాఖ్యానించారు. దాని సారాంశం ఏమిటంటే, నేను కోరిం దల్లా ఇవ్వు. లేకపోతే నా తలను నేనే పేల్చుకుంటాను. ఆ తర్వాత ఏర్పడే గందరగోళంతో మీరు తలపట్టుకోవలసి వస్తుంది. సరిగ్గా అలాంటి ట్రిగ్గర్‌నే పాకిస్తాన్‌ ఇప్పుడు పుల్వామాలో లాగిందా? (ఉగ్ర మారణహోమం)

మొదటగా పుల్వామాలో సైనిక కాన్వాయ్‌పై జరిగిన దాడి పూర్తిగా దేశీయంగా జరిగిన ఉగ్రదాడి అని చెప్పడానికి చాలా తక్కువ అవకాశాలున్నాయి. ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాది తిరుగుబాటుతత్వం జీర్ణించుకుపోయిన భారతీయ కశ్మీర్‌ వాసి. కానీ అతడు పూర్తిగా భారతీయ వ్యూహరచనతో అమలుచేసిన ఉగ్రచర్యలో భాగం కాదని చెప్పడానికి తగిన కారణాలున్నాయి.1. జైషే మహమ్మద్‌ ఈ దాడికి తానే కారణమని ప్రకటించింది. ఇది పూర్తిగా పాకిస్తాన్‌ కేంద్రంగా ఉంటూ ఐఎస్‌ఐ నియంత్రణలో ఉండే సంస్థ. 2. ఈ ఉగ్రచర్యకు దారితీసిన తిరుగుబాటుతత్వం, ప్రేరణ స్థానికపరమైనదే కావచ్చు, కానీ ఔత్సాహిక స్థానిక బృందాల వద్ద ఇంతటి అధునాతనమైన పేలుడు పదార్థాలు (చాలావరకు ఆర్డీఎక్స్‌ లేక ఆర్డీక్స్‌ కలిపినవి) లభ్యమవుతాయని, గురిచూసి కొట్టే యంత్రాంగంతో కూడిన నైపుణ్యాలు వీరికి ఉంటాయని చెప్పడానికి కనీస సాక్ష్యాధారాలు కూడా లేవు. 3. ఆత్మాహుతి బాంబర్‌ రికార్డు చేసిన చివరి వీడియోను చూడండి. అతడు వాడిన భాష కశ్మీరీల బాధలకు ప్రతీకారం కోరుతున్నట్లు లేదు. పైగా భారత్‌లో ఇతర ప్రాంతాల్లోని ముస్లింలను రెచ్చగొడుతున్నట్లుగా కూడా ఆ ప్రకటనలో లేదు. పైగా బాబ్రీ మసీదు, గుజరాత్‌ ఘటనలు ప్రస్తావించాడు. ‘ఆవు మూత్రం తాగే వారికి’ వ్యతిరేకంగా తిరుగుబాటుకు ‘మన ముస్లింలు అందరూ’ సిద్ధపడాలని పిలుపునిచ్చాడు. ఇలాంటి భాష లష్కరే తోయిబా కంటే మించి జైషే ఉగ్రసంస్థ నుంచి పుట్టుకొచ్చిందే తప్ప స్థానికులది కాదు. (ప్రతీకారం తీర్చుకునేందుకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ: ప్రధాని)

పుల్వామాలో జరిగిన దాడి గతంలో జైషే నిర్వహించిన దాడులకు అచ్చుగుద్దినట్లుంది. 2001లో శ్రీనగర్‌లో రాష్ట్ర అసెంబ్లీపై ఆత్మాహుతి దాడి, అదే సంవత్సరం పార్లమెంటుపై జరిగిన దాడి, ఇటీవల పఠాన్‌ కోట్, గుర్దాస్‌పూర్‌లపై దాడులు మొత్తంగా ఒకే లక్ష్యాన్ని ప్రకటించాయి. కశ్మీర్‌ వెలుపల ఏదో ఒక స్థాయిలో బీభత్సం సృష్టించాలి. ముంబైలో 2008లో లష్కర్‌ ఇలాగే చేసింది. కానీ దాని శక్తియుక్తులను చాలావరకు కశ్మీర్‌లో జరుగుతున్న పోరాటంలోనే ఇప్పటికీ ఉపయోగిస్తోంది. అయితే జైషే దానికంటే చిన్న సంస్థ అయినప్పటికీ, మరింత దుష్టత్వంతో, అపార వనరులతో ఐఎస్‌ఐ మద్ధతుతో ఇలాంటి ప్రభావశీలమైన దాడులను ఎంచుకుని మరీ సాగిస్తోంది.

జైషే ఎంత శక్తిసంపన్నంగా తయారైందో మనకు ఐసీ–814 విమానం హైజాక్‌ కాలం నుంచే తెలుసు. అది 90ల చివర్లోనే భారతీయ విమానాన్ని కఠ్మాండులో హైజాక్‌ చేసి సురక్షితంగా కాందహార్‌లో దించి, ప్రయాణికులను వదిలిపెట్టాలంటే భారత్‌ జైళ్లలో ఉండే దాని కీలక నేతలను విడుదల చేయాల్సిందేనని పట్టుబట్టి మరీ సాధించుకుంది. జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌ విడుదల ప్రక్రియ వరకు పూర్తిగా అది ఐఎస్‌ఐ కనుసన్నల్లో నడిచిందని పదే పదే రుజువవుతూ వస్తోంది. పాకిస్తాన్‌ ప్రభుత్వ యంత్రాంగం, ఐఎస్‌ఐ అయితే.. లష్కర్, హఫీజ్‌ సయీద్‌ల కంటే జైషేనే తమ అతిపెద్ద ఆస్తిగా భావిస్తున్నాయి. జైషే వీరి అతి ప్రధాన శక్తిగా తయారైంది. 

చైనా ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించింది కాబట్టే మసూద్‌ అజర్‌ని కాపాడే విషయంలో సిగ్గులేకుండా పాక్‌తో పోటీపడుతోంది. అందుకే ఉగ్రవాది స్థానిక కశ్మీరీ కావడంలో ఆశ్చర్యపడాల్సింది లేదు. విమాన హైజాక్, పార్లమెంట్‌ తదితర చోట్ల జరిపిన దాడులతో సహా జైషే సాగించిన ప్రతి ఉగ్రచర్యలోనూ భారతీయ కశ్మీరీలను కీలక భాగస్వాములుగా చేస్తూ వస్తోంది. కాబట్టే ఉగ్రవాదానికి స్థానిక మూలాలను వెదుకుతూ ఉగ్రచర్చల్లో పాకిస్తాన్‌కు నేరుగా పాత్ర లేదనిపించేలా జరుగుతున్న సూత్రబద్ధ చర్చల్లో సమయం వృ«థా చేయడం మానడం చాలా మంచిది. 

ఇప్పుడు మనం ఈ ప్రశ్నను ఎందుకు లేవనెత్తుతున్నాం. పాకిస్తాన్‌ చివరికి తన తలపైకే ట్రిగ్గర్‌ గురిపెట్టుకుందా? జైషే, లష్కరే గతంలో ఎలాంటి ప్రతీకార ప్రకటనలకు దిగకుండానే దాడులకు పాల్పడేవి. అటల్‌ బిహారీ వాజ్‌పేయి నుంచి మన్మోహన్‌ సింగ్‌ హయాం మధ్య కాలంలో భారత్‌ ఆగ్రహావేశాల ప్రదర్శననుంచి బయటపడి పాక్‌పై అంతర్జాతీయ ఒత్తిడిని తీసుకొచ్చే విధానాలవైపునకు మళ్లింది. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం కంటే మౌలికంగా యుద్ధ వ్యతిరేక వ్యూహతత్వం వైపు మొగ్గుచూపింది. 

మోదీ ప్రభుత్వం ఇలాంటి నటనను సాగించడం లేదు. మన్మో హన్, వాజ్‌పేయి తదితర ప్రభుత్వాలు గతంలో వ్యవహరించిన తీరుని మోదీ ప్రభుత్వం పిరికి చేష్టగా భావిస్తోంది. ప్రత్యేకించి ఉడీ సర్జికల్‌ దాడుల అనంతరం ఉగ్రదాడులకు వ్యతిరేకంగా దాడిని నిలి పివేయడం, లేక చాలా కాలం తనకు తాను నిబ్బరంగా ఉండటం మోదీ ప్రభుత్వానికి సాధ్యం కాదు. అలాగే పాక్‌ కూడా యుద్ధానికి సమీపంలోకి వచ్చింది. అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా ఎక్కడ అనేది ఎవరికీ తెలీదు కానీ ఆ తరుణం సంభవించడానికి ఎక్కువ కాలం పట్టేట్టు లేదు. 

ప్రతీకారాత్మక ప్రతిస్పందన త్వరలో సంభవించవచ్చు. ప్రత్యర్థిపై తాము వీరోచిత విజయం అందుకున్నామంటూ పెద్దగా ప్రకటించుకునే రూపంలో అది ఉండవచ్చు. అదేసమయంలో భారత్‌ ఇంతవరకు కనీ వినీ ఎరుగని ఎన్నికల ప్రచారం ప్రారంభ దినాల్లోకి అడుగిడుతోంది. పుల్వామా కళంకాన్ని భరిస్తూ నరేంద్రమోదీ రెండో టర్మ్‌ అధికారంకోసం ప్రయత్నం చేయకపోవచ్చు. ఇక ఈ దాడుల వ్యూహాన్ని ఇంతటితో వదిలిపెట్టాలని నిర్ణయించుకోవడం పాకిస్తాన్‌ వంతు కావచ్చు. లేదా భారత్‌ ప్రతిచర్యకు ప్రతీకారం తీసుకోవలసిందేనంటూ తన సొంత ప్రజల ఒత్తిళ్లకు అనుగుణంగా అది స్పందించవచ్చు. సైనికపరంగా ఏం జరిగినప్పటికీ అది ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌ పాలనకు ముగింపు పలుకుతుంది. భారత్‌తో ఎంత చిన్న లేక పెద్ద యుద్ధానికి దిగిన పాక్‌ పాలకుడు పదవిని కాపాడుకున్న ఘటన లేదని చరిత్ర మనకు తెలుపుతోంది. అయూబ్‌ ఖాన్‌(1965), యాహ్యా ఖాన్‌ (1971), నవాజ్‌ షరీఫ్‌(1999)ల పతనం ఇదే చెబుతోంది. 

తర్వాతేం జరుగుతుందో చెప్పే నిర్ణాయక శక్తి ఇమ్రాన్‌కు ఉండకపోవచ్చు. కార్గిల్‌ ఉదంతం తర్వాత నవాజ్‌లాగే తను కూడా ఆర్మీ లేక ఐఎస్‌ఐ తలబిరుసుతనానికి ఇమ్రాన్‌ కూడా ఫలితం అనుభవించవచ్చు. ఆరకంగా బలిపశువు కాకూడదంటే ఇమ్రాన్‌కు అపార నైపుణ్యంతోపాటు కాస్త అదృష్టం కూడా తోడు రావాల్సి ఉంది. ఇలాంటి అంశాల్లో ఎన్నికైన ఏ పాక్‌ ప్రధాని మాట కూడా ఇంతవరకు చెల్లుబాటు కాలేదు. పైగా ఇమ్రాన్‌ అందరికంటే బలహీనుడు. ఎలా స్పందించాలి అనేది ఆర్మీ చేతుల్లోనే ఉంది. ప్రతీకార చర్యకు పాల్పడొద్దని సైన్యానికి సలహా ఇచ్చే శక్తి ఇమ్రాన్‌కు ఉంటుందనీ చెప్పలేం. తమ తలలను పేల్చుకోవాలా వద్దా అనేది సైన్యమే నిర్ణయించుకోగలదు. వీటిలో ఏది జరిగినా నష్టపోయేది మాత్రం ఇమ్రానే మరి.

మోదీకి ఆయన వారసులకు మధ్య తేఢాను పక్కనబెట్టి చూస్తే, రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. 2008లో ముంబైలో లేక 2001–02లో జమ్మూ–కశ్మీర్, భారత పార్లమెంటుపై ఉగ్రదాడులు జరిగినప్పుడు అమెరికన్, యూరోపియన్‌ నేతలు పరుగున వచ్చి భారత్‌ను బుజ్జగించారు. రష్యా, చైనా కూడా తమ వంతు పాత్ర పోషించాయి. పాక్‌ను ఖండిస్తూ భారత్‌కు సంఘీభావం ప్రకటించడం ద్వారా వారు భారతీయుల ఆగ్రహాన్ని చల్లార్చారు. కానీ అలాంటి ప్రపంచం ఇప్పుడు లేదు. అమెరికాలో ట్రంప్‌ గెలిచి అమెరికాను ఉన్నత స్థితిలో నిలుపుతానంటూ చేసిన బాసను నెరవేర్చుకునే దిశగా ప్రయాణిస్తూ ప్రపంచాన్ని పట్టించుకోవడం మానేశాడు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా తక్షణం ట్వీట్‌ చేయడానికి కూడా ట్రంప్‌ పూనుకోకపోవచ్చు. ఆధునిక ప్రపంచపు చిరకాల ప్రత్యర్థులు తమ ప్రాంతంలో ఘర్షణల పరిష్కారంలోనే కొట్టుమిట్టులాడుతున్నారు. మనగురించి పట్టించుకునే తీరిక, శక్తి వారికి ఉండకపోవచ్చు. 

భారతీయ ఉపఖండం ప్రపంచానికి గతంనుంచి హెచ్చరిక చేస్తూ వచ్చేది. ‘మా మధ్యకు వచ్చి ఘర్షణలను నిలిపివేయడానికి ప్రయత్నించండి లేకుంటే మేం పరస్పరం అణ్వాయుధాలు ప్రయోగించుకుంటాం.’ తమవద్ద అణ్వాయుధాలు ఉన్నాయని ప్రకటించుకుంటూ ఉపఖండం ప్రపంచాన్ని ఒకరకంగా బ్లాక్‌మెయిల్‌ చేసేది. ఇప్పుడు ఇలా బెదిరించినా ప్రపంచం పట్టించుకునే స్థితి కనిపించడం లేదు. పైగా అణ్వాయుధాలు బలహీనమైన ఓటమికి దగ్గరగా ఉన్న దేశాలకు ప్రాధాన్యతా ఆయుధాలుగా మారాయి. 1990లో వీపీ సింగ్‌ అసమర్థత కారణంగా పాకిస్తాన్‌ తన అణ్వాయుధ బూచిని పూర్తిగా తనకు ప్రయోజనం కలిగేలా ఉపయోగించుకుంది. ఆ క్రమంలో భారత్‌నుంచి ఎలాంటి చిన్న ప్రతిఘటన కూడా జరగకుండా పాక్‌ జాగ్రత్తపడింది. ఇక వ్యూహాత్మక అణ్వాయుధాల విషయానికి వస్తే పాకిస్తాన్‌ ఇంతవరకు వాటిని పరీ క్షించలేదు. ఇప్పుడు వారు విధ్వంసకరమైన దిగ్భ్రాంతిని కలిగించవచ్చు. పైగా భారత ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు అణ్వాయుధాలు ఏక పక్షంగా ప్రభావం చూపుతాయని  ఎంతమాత్రం భావించడం లేదు. ఒకవేళ ఈ ఎన్నికల వారాల్లో అలాంటి అవకాశాన్ని చేజిక్కించుకోవాలని భారత్‌ చూస్తున్నట్లయితే ముందుగా ట్రిగ్గర్‌ మనమే నొక్కవచ్చు కూడా.

వ్యాసకర్త : శేఖర్‌ గుప్తా, ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌

twitter@shekargupta

మరిన్ని వార్తలు