మా ఊరు పాలమూరు గావాలే

28 Aug, 2018 00:40 IST|Sakshi

అభిప్రాయం

‘నిండిన చెరువుతో బతుకు మారిన పల్లె ప్రజల ఆర్థిక, సామాజిక, జీవన దృశ్యం’పై ఓ జర్నలిస్టు మిత్రుడు  పరిశోధనాత్మక గ్రంథం రాస్తున్నాడు. ఈ ఏడాది జూలై 12న పాలమూరు జిల్లా గ్రామాల పరిశీలనకు  వెళ్తుంటే నేనూ తోడు వెళ్లాను. భీమా ప్రాజెక్టు  గ్రామాల్లో తిరిగాం. భీమా ఫేజ్‌–1తో భూత్పూరు, సంగంబండ రెండు రిజర్వాయర్ల కింద మక్తల్, నర్వ, అమరచింత, మాగనూరు, కృష్ణా మండలాలకు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఫేజ్‌–2 కింద శంకరస ముద్రం, రంగసముద్రం, ఏనుకుంట రిజర్వాయర్ల కింద మరో లక్ష ఎకరాలు సాగులోకి వచ్చింది. ఏగిలువారక ముందే నర్వ మండలం లక్కెర్‌ దొడ్డి గ్రామం  చేరినం. ఈ పల్లె మీదుగా యాంకీ వైపు వెళ్లాం. కంది, ఆముదం, వరి, మొక్కజొన్న చేలతో భూమికి రంగే సినట్లు పచ్చగా పరుచుకు న్నాయి. అమరచింత, నర్వ మండలాల్లో 25 గ్రామాలు తిరిగి చీకటి పడే వేళకు నర్వ గ్రామం వచ్చాం. ఇక్కడే నా జర్నలిస్టు మిత్రునికి  ఓ బీడీ కార్మికురాలితో పరిచయం ఉంది.

పేరు రాజేశ్వరి. ‘రాజేశ్వరి యవ్వనం అంతా బీడీలు చుట్టటంతోనే గడిచిపోయిందని, నెత్తురు సచ్చి, బొక్కలు తేలి, చావుకు దగ్గరైన మనిషని, ఇప్పుడు బతికి ఉందో లేదో’ అనే అనుమానం వ్యక్తంచేస్తూ మార్గమధ్యం లోనే చెప్పాడు. ఆమె ఇంటికి వెళ్లాం. రాజేశ్వరి ఉంది. కానీ జర్నలిస్టు మిత్రుడు చెప్పిన ఛాయలు ఒక్కటీ ఆమెలో కనిపించలేదు. సంపూర్ణ ఆరో గ్యంగా  ఉంది. రాజేశ్వరిని కదిలిస్తే‘ఇప్పుడు బీడీలు సుడతలేను. పోయిన ఏడాదే  భీమా కాల్వ నీళ్లు ఒది లిండ్రు. సెర్లళ్లకు నీళ్లిడిసిండ్రు. ఎకరన్నర భూమి ఉంటే సాగు జేసుకున్నం. వడ్లు నాగుకు తెచ్చి మొలక అలికినం. తొలి ఏడాది 46 క్వింటాళ్ల దిగు బడి వచ్చింది. అప్పు సప్పులు పోనూ రూ. 36 వేలు మిగిలినయి. ఆసుపత్రికి పోతే టీబీ లేదన్నరు. తిండి బాగా తినమన్నరు. బలం మందులు రాసిండ్రు’ ఆమె చెప్పుకుంటూ పోతూనే ఉంది. కరువు జిల్లా  పాలమూరు ప్రాజెక్టులు  తెచ్చిన మార్పులు ఒక్కొక్కటి నెమరేసుకుంటుంటే నీటిపా రుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కష్టం గుర్తొచ్చింది. 2015 అక్టోబర్‌ 1న నీటి పారుదల శాఖ అధికా రులతో మంత్రి హరీశ్‌రావు సమావేశం అయ్యారు. అనుకోకుండా  ఆ సమావేశానికి నేనూ వెళ్లాను. పాల మూరు జిల్లా పెండింగ్‌ ప్రాజెక్టుల మీద సమీక్ష అది.

 ‘వచ్చే ఏడాది జూన్‌ నాటికి  కృష్ణమ్మ జలాలు పంట పొలాలను తడపాలి.æమీకేం కావాలో చెప్పండి’ అని ఇంజనీర్లను అడిగారు. ఇంజనీర్లు గుక్కతిప్పుకో కుండా చిట్టా చదివారు. వేల కోట్ల ఖర్చు, పైగా అనుమతులు అంటే చిన్న మాటలా? ఆస్థానంలో మరో వ్యక్తి ఉంటే  చేతులు ఎత్తేసేవాడే. కానీ హరీశ్‌ రావు ‘ఓకే డన్‌.. ఇక మీ పనుల్లో ఉండండి’ అని చెప్పాడు. ‘వచ్చే ఖరీఫ్‌ నాటికి పాలమూరు జిల్లా రైతాంగానికి 5 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అంది స్తాం’ అని ప్రకటన చేశారు. ఆయనతో కలిసి నేను ఉద్యమంలో పని చేసిన. పట్టుపడితే వదలడు. ఏదో ఒక మూల అనుమానం ఉన్నప్పటికీ కాళ్లకు చక్రాలు కట్టుకొని కాలచక్రంతో పోటీపడుతూ గిర్రున తిరు గుతూ కల్వకుర్తి, కోయిల్‌సాగర్, జూరాల, భీమా ప్రాజెక్టులను పూర్తి చేశారు. నిత్య ప్రయాణంతో అటు కాళే శ్వరానికి.. ఇటు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుల మధ్య బాటపడ్డది. పెద్ద మేస్త్రీ అవతార మెత్తి ప్రాజెక్టుల వద్ద ఎన్ని నిద్రలేని రాత్రులు గడి పారో చెప్పటం కష్టం.

ఎట్టకేలకు కల్వకుర్తి ఎత్తిపో తల ద్వారా 1.6 లక్షలు, నెట్టెంపాడు ద్వారా 1.2 లక్షలు, భీమా ద్వారా 1.4 లక్షలు, కోయిల్‌ సాగర్‌ కింద 8 వేల ఎకరాల కొత్త ఆయకట్టుతో చెప్పినట్టు గానే 5 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చారు.2017–18లో ఈ విస్తీర్ణం 6.5 లక్షలకు పెరిగింది. జూరాల కింద ఆయకట్టుతో కలిపితే అది 7.5 లక్ష లకు చేరింది. మిషన్‌ కాకతీయ కింద చెరువుల పునః నిర్మాణం చేసి నది నీళ్లతో నింపితే ఇంకో 2.68 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది.పాలమూరు పల్లెల్లో ఇంతకాలం కరువెందుకు రాజ్యమేలింది? కళ్ల ముందు నీళ్లున్నా... కంటి నిండా నీళ్లతో వలసెందుకు పోయిండ్రు?  పనిగట్టుకొని  పాలమూరును ఎండబెట్టింది ఎవడు’? ఇలా ఎన్నోప్రశ్నలు,ఇంకెన్నో ఆలోచనలు మెదడును మెలిపెడు తుంటే చీకట్లోనే తిరుగుబాట పట్టాం. పొలంలో పొద్దంతా కాయకష్టం చేసుకొని ఇంటికి చేరిన పల్లె జనం రేపటి సూర్యోదయం కోసం మెల్లగా నులక మంచాల మీద వాలిపోతున్నారు. మా కారు వేగం అందుకుంది... మల్లన్న సాగర్‌ నీళ్లతో రేపటి మా దుబ్బాక పల్లెల్లో కూడా కాల్వ కింది భూములు, ధాన్యం రాశుల మీద ఓ పుస్తకం రాయగలననే భరోసాతో... 

సోలిపేట రామలింగారెడ్డి
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు,
దుబ్బాక ఎమ్మెల్యే ‘ 94403 80141

మరిన్ని వార్తలు