ప్రత్యేక రాయితీ!

8 Dec, 2018 01:17 IST|Sakshi

అక్షర తూణీరం

సడీ చప్పుడూ లేదు. అంతా సద్దుమణిగింది. పొగ లేదు. దుమ్ము లేదు. కాలుష్యం లేదు. తిట్లు లేవు. శాపనార్థాలు లేవు. మొత్తం మీద నేతలందర్నీ శుద్ధి చేశారు. పరస్పరం తలంట్లు పోసుకున్నారు. ఇదొక చిన్న విరామం. రోజు రోజూ కరిగిపోయి ఓట్ల పండుగ రానే వచ్చింది. అయిదేళ్లకోసారి వచ్చే ఓట్ల మేళా. పార్టీల జాతకాలు తిరగరాసే ముఖ్య ఘట్టం. దేశభక్తి మసకబారి రాజకీయం పూర్తి వ్యాపారం అయినప్పటి నించి ఓట్లకి రేట్లు వచ్చాయ్‌. అంతకుముందు గాలికి, నీళ్లకి, మట్టికి ధరలుంటాయని మనకి తెలియదు.

యాభై ఏళ్లనాడు గ్రామ పెద్దలు సూచించిన గుర్తుకి ఓటు వేస్తుండేవారు ఎక్కువమంది. మంచి చెడు మనకి తెలియదు, ఆ పెద్దోళ్లకి తెలుస్తుందని నమ్మేవారు. అదొక పుణ్యకాలం. కాల క్రమంలో పెద్ద మనుషులు అంతరించారు. సామాన్య ప్రజానీకం ఎవర్ని నమ్మాలో తెలియని అయోమయంలో పడ్డారు. క్రమేపీ అందరికీ లోకం పోకడ అర్థమవుతూ వచ్చింది. ఓటు అమూల్యమైందనే సిద్ధాంతం నించి దానికో మూల్యం ఉంది అనే సత్యంలోకి వచ్చింది. ఆధునిక ప్రజాస్వామ్యంలో ఎవరికెవరు రుణపడాల్సిన పన్లేదనే సూత్రం అమల్లోకి వచ్చింది. ‘నాయకులు కావల్సినన్ని వాగ్దానాలు గుప్పించారు. కానీ ఏదీ నాకు దక్కింది లేదు. నా విలువైన ఓటుని మాటలతో దక్కించుకున్నారు. నేనింకా మోసపోను. నా హక్కుని డిమాండ్‌ని బట్టి అమ్మేసి సొమ్ము చేసుకుంటాను. ఇంక మా మధ్య బాకీలుండవ్‌’ అనే లాజిక్‌ని ఎక్కువమంది అనుసరిస్తున్నారు. అక్కడనించి ఎన్నికలు చాలా ఖరీదైన జూదంగా మారింది. పోటీ చేయడమంటే కోట్లతో వ్యవహారం. దీన్ని పెట్టుబడిగానే భావిస్తారు. కొన్నిసార్లు వ్యాపారం కలిసొస్తుంది. కొన్నిసార్లు రాదు.

ఒక విశ్లేషకుడు ఏమన్నాడంటే– మనకి సగటు మనిషి కాకుండా, మేధావి అయినవాడు మేధావినని అనుకొనేవాడు ఉన్నారు. ఈ మేధావులు తప్పులోనో పప్పులోనో కాలువేసేవారే. సగటు మనిషి గాడిదలా ఆలోచించి తప్పిపోయిన గాడిద జాడని పసిగడతాడు. ప్రజలనాడిని పట్టుకున్నవాడే పొలిటీషియన్‌. నేటి మనిషి ఇన్‌స్టెంట్‌ తిండికి, బతుక్కి అలవాటు పడ్డాడు.‘నేనొక పెద్ద ప్రాజెక్ట్‌ నిర్మిస్తా. అయిదేళ్లలో లక్ష ఎకరాలకి నీళ్లు, పదివేల మందికి ఉపాధి’ అని దణ్ణాలు పెట్టి చెప్పినా ఎవరూ వినిపించుకోరు. అదే రేపట్నించి రేషన్‌కార్డ్‌ మీద ఉప్పుతో పదహారూ ఇస్తామంటే తలలూపుతారు. అందుకే నెలవారీ పింఛన్‌ పథకాలు సూపర్‌హిట్‌ నినాదం. రెండుగదుల ఇల్లు కట్టించి ఇస్తారట. ఇచ్చేదాకా ఏటా యాభైవేలు అపరాధ రుసుం చెల్లిస్తారట. ఎంత ఔదార్యం!? మీ దరిద్రాన్ని ఏకమొత్తంగా రూపుమాపే పథకాలున్నాయని ఎవరూ చెప్పరు. జన సామాన్య ఓటర్‌ దరిద్రాన్నీ అలాగే పోషిస్తూ, ప్రజల సొమ్మునే కొంచెం కొంచెం చిలకరిస్తూ రాజరికం అనుభవించడమే నేటి మన ప్రజాస్వామ్యం.

ఒక రోడ్డు వేస్తే, ఒక వంతెన కడితే వాటి గురించి మళ్లీ ఎన్నికల దాకా డప్పు కొట్టుకునే నేతలు ప్రజా సేవకులా? కనీస బాధ్యతలు నిర్వర్తించడం కూడా మహా త్యాగంగా చెప్పుకోవడం నేటి మన నాయకుల నైజం అయింది. పవర్‌ కోసం పడుతున్న ఆరాటం చూస్తుంటేనే రాజకీయం ఎంత లాభసాటి వ్యవహారమో అర్థమవుతుంది. అందుకే ప్రజలు ఓటు వేయడానికే కాదు, ఊకదంపుడు ఉపన్యాసాలకు వచ్చి కూచోడానికి కూడా రేట్లు నిర్ణయించుకున్నారు. రాజకీయ నాయకులు తమ సభలకి తామే జనాన్ని తోలి, తిరిగి వారే వారిని చూసి ముగ్ధులైపోవడం. దీన్నే ‘ఆత్మలోకంలో దివాలా’ అంటారు.

ఎన్నికల వేళ అంతా కట్టుదిట్టం చేశామంటారు. నిజమే ఈ రెండ్రోజులూ లిక్కర్‌ షాపులు బంద్‌ చేశారట. ఎప్పుడూ వ్యసనపరుడు మందుచూపుతో అప్రమత్తంగా ఉంటాడు. దాదాపు నెలరోజులుగా కొన్ని నిర్జన ప్రాంతాల్లో మందుపాతర్లు వెలిశాయని చెప్పుకుంటున్నారు. గడచిన కొద్ది రోజులుగా షాపుల్లో మందు అమ్మకాల గ్రాఫ్‌ని చూస్తే కథ అర్థమవుతుంది. డబ్బు అన్ని సెంటర్లకీ చాపకింద నీళ్లలా ఎప్పుడో పాకింది. గమనించండి, ఈ మహోత్సవ వేళ ఏ మందుబాబైనా పొడిగా పొద్దుపుచ్చుతాడేమో! ఇప్పటికే కొన్ని నియోజక వర్గాల్లో ఓటు రేటు నిర్ధారణ అయింది. పోటీ చేసే వారిలో ఇద్దరూ డబ్బు పంచుతారు. ‘ఇద్దరి దగ్గరా తీసుకోండి. ఓటు మాత్రం నాకే వెయ్యండి’ అని ఎవరికి వారే ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నారు.

శ్రీ రమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు