ఏమాటకామాట చెప్పుకోవాలి

26 Oct, 2019 01:08 IST|Sakshi

అక్షర తూణీరం 

ఊళ్లో చెట్టుకొమ్మకి తేనెపట్టు పడుతుంది. చైత్ర వైశాఖాలు వసంత రుతువు. అప్పుడు చెట్లు చిగిర్చి పూలు పూస్తాయ్‌. అందుకని వేసవిలో తేనెపట్లు ఎక్కువగా కనిపిస్తాయ్‌. వాటిని తేనె కోసం నిర్దాక్షిణ్యంగా దులిపేస్తుంటారు. తుట్టెకి పొగ పెడతారు. అవి దిక్కు తెలియక పట్టు వదిలేసి పారిపోతూ కనిపిస్తాయ్‌. కాసేపటి తర్వాత ఆశ చావని తేనెటీగలు మళ్లీ అక్కడికి చేరతాయ్‌. ఖాళీగా ఉన్న మైనపు పట్టు చుట్టూ ఈగలు రొద చేస్తూ తిరు గుతూ కనిపిస్తాయ్‌. మావూరి పెద్దమనిషి ఒకాయన, ‘మావోడి పద్ధతి అట్టా ఉంది’ అంటూ నిట్టూర్చాడు. మావోడంటే ఆయన ఉద్దేశం చంద్రబాబునాయుడు. ఇదిగో రోజూ ఓ హద్దూ పొద్దూ లేకుండా బాబు, మిగతా పాత మినిస్టర్లు అర్థంపర్థం లేకుండా ఈగల్లా రొద చేయడం చూస్తుంటే నాకదే గుర్తొస్తోంది అనగానే, ‘మీరు పచ్చి తెలుగుదేశం కదా. మీరే ఇట్లా వ్యాఖ్యానిస్తే ఎట్లాగండీ’ అన్నాను.

‘దేనికదే, ఓడిపోయి అయిదు నెలలైనా కాలేదు. ఇంకా అయిదేళ్లు జరగాలి. ఇప్పట్నుంచే బెంగ పెట్టేసుకుంటే ఎట్లా? దిగులుతో రోజులు మరీ గడ్డుగా కదుల్తాయ్‌’ మా పెద్దమనిషి బాధపడ్డాడు. ‘పైగా జనం కసిగా తీర్పు ఇచ్చారు కదా. ఇప్పుడు నించుంటే గన్‌షాట్‌గా గెలుస్తార్ట! పిచ్చి భ్రమలు. చంద్రబాబు ఇంతకంటే చిత్తుగా ఓడిపోతాడని మేం అనుకున్నదే. చుట్టూ చేరిన భజన బృందం వడపప్పు పానకంలా దొరికింది దొరికినట్టు బొక్కేశారు. తెలుస్తున్నా ఎవర్నీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. అసలు మా వోడికి ఎన్నికల్లో నెగ్గడం బొత్తిగా రాని విద్య’ అనగా అదేంటండీ అన్నట్టు ప్రశ్నార్థకంగా చూశా. ‘నిజానికి మావోడు సింగిల్‌గా పోటీ చేసిందీ లేదు. గెలిచి ఏడిసిందీ లేదు. మొన్నే కదా ఒంటరిగా బరిలోకి దిగింది. ‘వద్దురా బాబూ, లెగిస్తే మనిషి కాదన్నట్టు ఉండు. బీజేపీ కండువా కప్పుకోమని మేమంతా చిలక్కి చెప్పినట్టు చెబితే వింటేనా?’ అంటూ చాలా బాధపడ్డాడు. కాసేపు నిస్పృహతో మావూరి పెద్దమనిషి మౌనంగా ఉండిపోయాడు.

 చంద్రబాబు ఎన్నికల ముందు మోదీకి దీటుగా నిలబడగలననీ, అవసరమైతే ప్రధాని కాగలననీ ఊగారు. అన్ని పార్టీలు సోదిలోకి రాకుండా పోయేసరికి మళ్లీ ఆ ప్రస్తావనే లేదు. ఎక్కడికీ కదిలిందీ లేదు. ఎక్కడా మాట్లాడిందీ లేదు. కనీసం తెలంగాణకి అయినా వచ్చింది లేదు. అనేక వ్యాధుల బారినపడి అల్లాడుతుంటే వచ్చి పలకరించింది లేదు. మొన్న జరిగిన బై ఎలక్షన్లో కాంగ్రెస్‌కి దన్నుగా వచ్చి నిలబడిందీ లేదు. కనీసం ఆర్టీసీ కార్మికులకు నేనున్నానని వత్తాసుగా వచ్చింది లేదు. మా పెద్దమనిషి చుట్ట కాల్చడం పూర్తిచేసి, కొత్త దమ్ముతో వచ్చి మాట కలిపాడు. ‘ఏమాటకామాట చెప్పుకోవాలి. దేవుడి కొండకింద మందు నిషేధిం చడం బావుంది. చాలా మంచిది. దాంట్లోనూ సాధక బాధకాలుంటాయ్‌. నిన్నటిదాకా తాగుబోతులైనోళ్లు ఉన్నట్టుండి మానెయ్యలేరు. అరికట్టడం చాలా కష్టం. ప్రయత్నిస్తే అసాధ్యం కాకపోదు.

ముందు కొండమీది దేవుడు సంతోషిస్తాడు. కొండకింది అలమేలు మంగమ్మ ఆనందిస్తుంది. స్వామి రాత్రి పొద్దున కొండ దిగివచ్చేవేళ దారి ప్రశాంతంగా ఉంటుంది. ఆ దేవుడు ఈ నిషేధాన్ని దీవిస్తాడు. చూస్తూ ఉండండి’ అన్నాడు. నేనేదో అనబోతుంటే ఏమాటకామాట చెప్పుకోవాలని గుర్తు చేశాడు. ‘మావోడి ధోరణి చూస్తుంటే, మెల్లిగా జరిగి జరిగి బీజేపీలో చేరిపోయేట్టున్నాడు’ అనగానే నేను ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. ‘మీకేం ఖర్మండీ’ అన్నాను అప్రయత్నంగా. ఆయన పెద్దగా నవ్వి, ‘మీరు భలే తెలియనట్టు మాట్లాడుతున్నారండీ’ అన్నాడు. ‘ఎవరైనా సరే, నాకు ఆయన మీద వ్యక్తిగతంగా ద్వేషం లేదు. పగ లేదు. తేడా లేదు. మాకున్నదల్లా సిద్ధాంత భేదాలు అని స్పీచిలో చెప్పాడో అప్పుడే అర్థం చేసుకోవాలి’ అంటూ మావూరి పెద్దమనిషి సూత్రీకరించాడు. ‘ఇప్పుడు మావోడు జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి అర్జంటుగా ఓదారి మార్గం కావాలి. నాకు కన్పిస్తున్న ఒకే ఒక దారి బీజేపీ. ఇప్పటికే అక్కడ అడుగు పెట్టడానికి వీలుగా కొన్ని మెట్లు కట్టుకున్నాడు కదా. బాబుకి చాలా సులువు అవుతుంది. ఏమాటకామాట చెప్పుకోవాలి’ అంటూ ముగించాడు. నాకెందుకో మావూరి పెద్దమనిషితో పూర్తిగా ఏకీభవించాలనిపించింది.

శ్రీరమణ 
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు) 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు