ఆ రెండుచోట్లా ఎదురుగాలి!

26 Oct, 2019 00:50 IST|Sakshi

జాతిహితం 

జాతీయ స్థాయిలో తిరుగులేని నేతగా నరేంద్రమోదీ స్థిరపడిన తర్వాత మహారాష్ట్ర, హరియాణాల్లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశంలో రాజకీయ పవనాలు మారుతున్నాయన్నదానికి తొలి సంకేతాలను అందించాయి. మోదీ ప్రజాదరణను కోల్పోకున్నా ఆయన పార్టీ ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకతను చవిచూసింది. బీజేపీ పట్ల తమ వైఖరిని అయిదు నెలలలోపే మార్చుకున్నారంటే, జాతీయవాద భావోద్వేగాలు, పాక్‌ వ్యతిరేక ప్రచారం, మనోభావాలను ప్రేరేపించిన మతపరమైన అత్యుత్సాహం వంటి అనుకూల పవనాలన్నీ ఆర్థిక వ్యవస్థ పతనం, ఉద్యోగాలకు సంబంధించిన భయాందోళనల ముందు వెనకపట్టు పట్టాయన్న సూచనలను సంకేతిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో చాలామంది ఓటర్లు తమ ప్రాథమిక సమస్యల వైపు దృష్టి సారించినట్లే ఉంది. ప్రతిపక్షం మేలుకోవలసిన సమయమిది.

ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చి ఆలస్యంగా వెళ్లాయి. చివరకు వాయు చలనాలు కూడా రివర్స్‌ అయ్యాయి. దేశరాజధానిలో ఇవి ప్రస్తుతం పొడిపొడిగా మారాయి. పంజాబ్, హరియాణాల మీదుగా పశ్చిమం నుంచి వచ్చిన వాయుప్రవాహాలు ఆ రాష్ట్రాల్లోని రైతులు పొలాల్లో తగులబెట్టిన ఎండు దుబ్బు పొగను భారీగా వెంటబెట్టుకొచ్చాయి మరి. ఇప్పుడు ఢిల్లీలో ఉంటున్నది ఆకురాలు కాలం. రుతుపవనాల మార్పు వంటి స్పష్టమైనది కాకున్నా రాజకీయ పవనాలు కూడా మారిపోయాయి. ఆర్థిక వ్యవస్థ స్తబ్ధతకు గురైనందున గత కొద్ది సంవత్సరాలుగా బీజేపీ మతంతో కూడిన ఉద్రేకభరితమైన జాతీయవాద పవనాలను రేకెత్తించి దుమారం లేపుతూ వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు, ప్రత్యేకించి  బాలాకోట్, అభినందన్‌ ఘటనలకు ముందు బీజేపీ ఈ తరహా జాతీయ వాదాన్ని పరాకాష్టకు తీసుకెళ్లింది.  గత ఏడు దశాబ్దాలుగా పాకిస్తాన్‌ నుంచి  భారత్‌ బాహ్య ప్రమాదాన్ని ఎదుర్కొనేదని, దీన్ని ఎవరూ పరిష్కరించలేని దశలో నరేంద్రమోదీ అంతిమంగా అడ్డుకున్నారని భారతీయ ఓటర్లు నమ్మేశారు. పైగా మోదీ పాక్‌ సమస్యను  నిర్ణయాత్మకంగా, నిర్భయంగా సైనిక దండనతో పరిష్కరించేశారని, పాకిస్తాన్‌ని ఒంటరిని చేయడమే కాకుండా అంతర్జాతీయంగా భారత్‌ స్థాయిని పెంచివేశారని భారతీయ ఓటర్లు విశ్వసించారు. ఈ అభిప్రాయానికి వచ్చేశాక ఓటర్లు ఇతర పార్టీల పట్ల తమ విశ్వాసాలను విస్మరించేస్తారు కదా.

ఓటరు అభిప్రాయాలు దానికనుగుణంగా మారిపోయాయి. అదేమిటంటే.. పాకిస్తాన్‌ ముస్లిం దేశం. అది జిహాద్‌ పేరుతో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తోంది. రక్త పిపాస కలిగిన జిహాదీలు యావత్‌ ప్రపంచానికే మహమ్మారిగా మారిపోయారు. ప్రపంచమంతటా ఇస్లామిక్‌ ప్రమాదం పొంచి ఉంది. భారతీయ ముస్లింలు కూడా దానికి మినహాయింపు కాదు. కాబట్టి హిందువులు తమకు తాముగా బలోపేతం కావలసి ఉంది. కానీ ఇలాంటి దురారోపణలు ఏవీ ఎన్నికల ప్రచారంలో పనిచేయలేదు. పేదలకు వంటగ్యాస్, మరుగుదొడ్లు, ఇళ్లు, ముద్రా రుణాలు వంటి పథకాలకోసం కేంద్రప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేసిన దాదాపు రూ. 12 లక్షల కోట్ల నగదు పంపిణీనే ప్రచారంలో సమర్థ పలితాలను ఇచ్చింది. ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు వారాల పాటు నేను ఇదే విషయాన్ని రాస్తూ, మాట్లాడుతూ వచ్చాను. ఎన్నికల పరిభాషలో చెప్పాలంటే ఇది జాతీయవాదం, మతం, సంక్షేమం అనే మూడూ సృష్టించిన విధ్వంసం అనే చెప్పాలి. వీటి ముందు ప్రతిపక్షం రఫేల్‌ యుద్ధవిమానాల కుంభకోణం గురించి చేసిన ప్రచారం అపహాస్యం పాలయింది. పెద్ద నోట్లరద్దు తర్వాత మన ఆర్థిక వ్యవస్థ వృద్ది పతనం, చుక్కలంటుతున్న నిరుద్యోగితను కూడా జనం ఉపేక్షించేశారు.

 ఈ వారం జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ  ఎన్నికలు రాజకీయ పవనాలు మారుతున్నాయన్న దానికి తొలి సూచికను అందించాయి. అయితే ఈ ఎన్నికల్లో మోదీ తన ప్రజాదరణను కోల్పోయినట్లు చెప్పలేం. అదే జరిగి ఉంటే కనీసం హరియాణాలో అయినా బీజేపీ ఓటమి పాలయ్యేది. బీజేపీకి అనుకూలంగా తగిన సంఖ్యలో ఓటర్లను మోదీ సాధించారనడంలో సందేహమే లేదు. అయితే అయిదు నెలలక్రితం హరియాణాలో బీజేపీ ఓట్ల శాతం 58 శాతం మేరకు ఉండగా ఎన్నికల తర్వాత అది 28 శాతానికి గణనీయస్థాయిలో పడిపోయింది. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అత్యంత విశ్వసనీయతను సాధించిన ఇండియా టుడే–యాక్సిస్‌ ఎగ్జిట్‌ పోల్‌ ప్రకటించిన ముందస్తు ఫలితాలు రాజకీయ పవనాల మార్పుకు సంబంధించి కొన్ని సూచనలను వెలువరించాయి. గ్రామీణ యువత, నిరుద్యోగిత, రైతులు, వ్యవసాయ కార్మికులు వంటి పలు విభాగాల్లో కాంగ్రెస్‌ పార్టీ కంటే 9 శాతం అదనపు పాయింట్లతో  బీజేపీ ఇప్పటికీ ఆరోగ్యకరమైన ఆధిక్యతలో ఉంటున్నప్పటికీ పంజాబీ జనాభా గణనీయంగా ఉన్న హరియాణాలో దాని మధ్యతరగతి, అగ్రకులాలతో కూడిన గ్రామీణ ప్రజానీకం కాంగ్రెస్‌ను ఒకరకంగా ఆదుకోవడం బీజేపీకి తీవ్ర సంకటపరిస్థితిని కలిగించింది.

మహారాష్ట్రలో కూడా కుంభకోణాల బారిన పడకుండా, ప్రజామోదం పొందిన బీజేపీ ముఖ్యమంత్రి సుపరిపాలనను అందించినప్పటికీ, ఈదఫా ఎన్నికల్లో ఆ పార్టీ మెరుగు పడటానికి బదులుగా గణనీయంగా ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంది. ఇది ముందుగానే ఊహించిందే. అదేసమయంలో కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి కీలకనేతలు నిఘా సంస్థల ఆగ్రహం బారిన పడతామేమోనన్న భీతితో బీజేపీలో చేరిపోయినందున ప్రతిపక్షం ర్యాంకు కూడా పడిపోయింది. పాలకపక్షానికి అనేక అనుకూలతలు ఉన్నప్పటికీ సాపేక్షికంగా ఇలాంటి ప్రతికూల విజయం దక్కిన నేపధ్యంలో బీజేపీని దెబ్బతీసింది ఎవరనే ప్రశ్న వస్తుంది. కాంగ్రెస్‌ కంటే ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ప్రత్యేకించి గ్రామీణ పశ్చిమ మహారాష్ట్ర్‌లలో బీజేపీని బాగా దెబ్బతీశారు. గుర్తుంచుకోండి.. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన 11 వారాల తర్వాత, హౌడీ మోదీ, అమెరికాలో ట్రంప్‌తో మోదీ చర్చలు జరిగిన అయిదు వారాల తర్వాత బీజేపీ ఇలాంటి ఫలితాలు సాధించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మామల్లపురంలో టీవీ మాధ్యమాల్లో మోదీ సంచలనం రేపిన కొద్ది కాలంలోనే ఇలా జరగడం గమనార్హం. పై అన్ని అనుకూల అంశాలు ఉన్నప్పటికీ ఓటర్లు చాలామంది బీజేపీ పట్ల తమ వైఖరిని అయిదు నెలలలోపే మార్చుకున్నారంటే, జాతీయవాద భావోద్వేగాలు, పాక్‌ వ్యతిరేక ప్రచారం, మనోభావాలను ప్రేరేపించిన మతపరమైన అత్యుత్సాహం వంటి అనుకూల పవనాలన్నీ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలకు సంబంధించిన భయాందోళనల ముందు వెనకపట్టు పట్టాయన్న సూచనలను సంకేతిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో చాలామంది ఓటర్లు తమ ప్రాథమిక సమస్యల వైపు దృష్టి సారించినట్లే ఉంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మా ప్రయాణాల్లో పేదలు, ఉపాధి కోల్పోయిన ప్రజలను తరచుగా కలుసుకునేవాళ్లం. ఆర్థిక వ్యవస్థ వికాసం గురించి మోదీ, బీజేపీ చేసిన వాగ్దానాలు ఆచరణలో అమలు కాలేదని, తాము దెబ్బతిన్నామని వీరు మాకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ తాము దేశ ప్రయోజనాల కోసం మాత్రమే మోదీకి ఓటేస్తామని వీరన్నారు. దేశాన్ని రక్షించడానికి మోదీ ఉన్నారు కాబట్టి దేశం సురక్షితంగా ఉంది. కానీ ఆర్థిక వ్యవస్థ పతనం, నిరుద్యోగిత జనాలను నిజంగానే బాధపెడుతోంది. ఇక రైతులు గిట్టుబాటు ధరల లేమితో విసిగిపోయారు. నా ఉద్దేశంలో మతంతో కూడిన జాతీయవాద పవనాలను ఆర్థిక వ్యవస్థ స్తబ్దత, నిరుద్యోగం, అశాంతి, సాధారణ వ్యాకులత వంటివి ఈ ఎన్నికల్లో వెనక్కు నెట్టేసినట్లున్నాయి. పాకిస్తాన్‌పై తాజా దాడులు, కశ్మీర్, ఉగ్రవాదంపై పాలక పార్టీ, ప్రభుత్వం గొంతు చించుకున్నా అది ఎన్నికల ఫలితాలను మార్చలేకపోయాయి. అయోధ్యపై సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇవ్వనుందన్న వార్తలు కూడా హిందీ ప్రాబల్య ప్రాంతంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. వీటికి అతీతంగా చాలామంది ప్రజలు తీవ్ర బాధలకు గురవుతున్నారు. ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోవాలని వీరు కోరుకున్నారు.

హరియాణాలో, మహారాష్ట్రలో బీజేపీకి తగిలిన ఎదురు దెబ్బలు త్వరలో జరగనున్న జార్ఖండ్‌ ఎన్నికలపై ప్రభావం చూపుతాయా లేదా అన్నది ఎవరికి వారు ఊహించుకోవలసిందే. ఒకటి మాత్రం నిజం. ప్రతిపక్షం ఎట్టకేలకు జూలు విదిలించాల్సిన తరుణం ఆసన్నమైంది. అన్ని విజయాలు ఒక నేతకే ఆపాదించే వ్యక్తి ఆరాధనా సంస్కృతిలో ఎదురుదెబ్బల నుంచి ఆ అధినేతను కాయడం కష్టమే అవుతుంది. ప్రత్యేకించి ప్రస్తుత ఎన్నికల్లో ప్రత్యర్థులచే సంపూర్ణ ఓటమి చెందనప్పటికీ తక్కువ పాయింట్లతో విజయాన్ని నమోదు చేయడం పాలకపక్షానికి తీవ్ర ఆశాభంగాన్నే కలిగిస్తుంది. త్వరలోనే జార్ఖండ్‌లో, తర్వాత ఢిల్లీలో ఎన్నికలు జరగనుందున మోదీనే మళ్లీ ముందుపీటికి తీసుకురావాలా వద్దా అని బీజేపీ నిర్ణయించుకోవాలి మరి. మునిసిపల్‌ కార్పొరేషన్లపై, పోలీసులపై పూర్తి నియంత్రణ కేంద్రం చేతిలో ఉంటున్నప్పటికీ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీలో కాంగ్రెస్‌ కంటే మెరుగ్గానే రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. భారత్‌లో రాజకీయాలు మారడానికి సంవత్సరాల సమయం పడుతుంది కానీ రాజకీయ సీజన్లు మాత్రం శరవేగంగా మారతాయి. దేశరాజధానిలో ఇప్పుడున్న పొడి వాతావరణం, ఆకురాలు కాలం ప్రభావం ఏమిటో మీరు గ్రహించవచ్చు.

శేఖర్‌ గుప్తా 
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

మరిన్ని వార్తలు