శిల్పం – సారం

3 Nov, 2019 00:47 IST|Sakshi

జనతంత్రం 

‘కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్‌’. ఓ తెలుగు సినిమాలో హీరో డైలాగ్‌ అది. కొన్ని కొన్ని ఏం ఖర్మ. ఇప్పుడు ఏది నమ్మాలన్నా ముందు కటౌట్‌ చూసి తీరవలసిన పరిస్థితి. ఇందుకు రాజకీయాలూ మినహాయింపు కాదు. ఆ మాటకొస్తే, కటౌట్‌ అవసరం రాజకీయాల్లోనే మరింత పెరిగింది. మన రాష్ట్రాలకో, మన దేశానికో ఈ పరిణామం పరిమితం కాలేదు. ప్రపంచంలోని అనేక  దేశాల్లో మనకిప్పుడు ఇదే తంతు కనిపిస్తున్నది.

ఒక నేత జీవన గమనం, ఆ సమయంలో ఆ దేశపు వర్తమాన చరిత్ర పెనవేసుకొనిపోయినప్పుడు ఆ నేత జాతినేత స్థాయిని అందుకుంటారు. ఆ కటౌట్‌ ముందు మిగిలిన వాళ్లు వెలవెలబోతారు. భారత జాతీయోద్యమ కాలంలో మహాత్మాగాందీ, ఆయన నీడలో ఎదిగి నవభారత నిర్మాణ సారథ్యం అందుకున్న పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ, భారత రాజకీయాల్లో శక్తిస్వరూపిణిగా వ్యవహరించిన ఇందిరాగాంధీ మాత్రమే గతంలో ఆ స్థాయిని అందుకోగలిగారు. ప్రస్తుత ప్రపంచంలో చాలామంది శక్తిమంతమైన నేతలు కనిపిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గతంలో ఏ అధ్యక్షునికీ తీసిపోనివిధంగా అధికారాన్ని చెలాయించగలుగుతున్నాడు. రష్యా నియంత జోసెఫ్‌ స్టాలిన్‌ అధికార ప్రభకు ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్‌ హవా ఏమాత్రం దిగదుడుపు కాదు. చైనా చరిత్రను మలుపుతిప్పిన మావో జెడాంగ్, మరో మార్గం తొక్కించిన డెంగ్‌ షావో పింగ్‌ల ప్రభావం కంటే ప్రస్తుత అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రభావం తక్కువేమీ కాదు. భారతదేశంలో ఇందిరాగాంధీ కటౌట్‌ స్థాయికి నరేంద్రభాయ్‌ దామోదర్‌దాస్‌ మోదీ కూడా ఎదిగారని పరిశీలకుల నిశ్చితాభిప్రాయం. ఈ సంవత్సరం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలు కూడా ఇదే అభిప్రాయాన్ని నిర్ద్వం ద్వంగా నిరూపించాయి.

మొన్నటి మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైనా తేడా వచ్చిందా? ఫలితాల ప్రకారం మోదీ పలుకుబడి కొంచెం తగ్గిందనుకోవాలా? రాహుల్‌గాంధీకి ఆదరణ పెరిగిందనుకోవాలా? మోదీ వ్యతిరేకులు మాత్రం ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం చెబుతున్నారు. ఫలితాలను నిష్పాక్షికంగా పరిశీలిస్తే మాత్రం కాదనే అభిప్రాయం కలుగుతుంది. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే బీజేపీకి రెండు శాతం ఓట్లు తగ్గాయి. 17 సీట్లు తగ్గాయి. ఈసారి శివసేనతో బీజేపీకి ఎన్నికల ముందే పొత్తు కుదిరింది. కూటమికి సంపూర్ణ మెజారిటీ లభించింది. ప్రతిపక్ష ఎన్సీపీ– కాంగ్రెస్‌ కూటమికి పదిహేను సీట్లు పెరిగిన మాట వాస్తవం. ఈ పెరుగుదలలో కాంగ్రెస్‌ పాత్ర గానీ, రాహుల్‌ పలుకుబడి గానీ ఏమాత్రం లేదు. క్రెడిట్‌ అంతా శరద్‌ పవార్‌కే దక్కుతుంది. పవార్‌ అనుచ రులూ, సన్నిహితులపై రకరకాల కేసులను బీజేపీ ప్రభుత్వం బనాయించింది. ఎన్‌సీపీ నాయకశ్రేణుల నుంచి పలువురు ముఖ్యులను సామదాన భేదోపాయాలతో లాగేసుకొని బీజేపీ–శివసేన టికెట్లు కేటాయిం చారు.

మహారాష్ట్రలోని బలమైన సామాజికవర్గమైన మరాఠాలకు ఇప్పటికీ గౌరవప్రదమైన నాయకుడు శరద్‌ పవారే. ఆయనను బీజేపీ కూటమి వేధిస్తున్నదనే అభి ప్రాయం మరాఠాల్లో ఏర్పడింది. అగ్రశ్రేణి సహచరుల ఫిరాయింపులవల్ల తానే స్వయంగా రంగంలోకి దిగిన పవార్‌ వయోభారాన్ని లెక్కచేయకుండా ఊరూవాడా కలయదిరిగాడు. వర్షంలో తడుస్తూనే సభల్లో పాల్గొన్నాడు. ఈ దృశ్యాలు మరాఠాలను కలచివేశాయి. బీజేపీ తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్‌ కల్పించిన విషయాన్ని కూడా తాత్కాలికంగా పక్కనపెట్టి మరాఠాలు ఎన్సీపీ కూటమికి ఓట్ల వర్షం కురిపించారు. వారి ప్రాబల్యం ఉన్న పశ్చిమ మహారాష్ట్రలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఆమేరకు మాత్రమే బీజేపీ– శివసేన కూటమి నష్టపోయింది.

హరియాణాలో బలమైన సామాజికవర్గంగా వున్న జాట్‌లను కాదని, ఒక సరికొత్త కాంబినేషన్‌తో గత ఎన్నికల్లో బీజేపీ ప్రయోగం చేసి విజయం సాధించింది. బీజేపీ తమను దూరం పెడుతోందన్న ఆగ్రహం జాట్లలో వుంది. జాట్‌ పార్టీగా ముద్రపడిన ఎన్‌ఎల్‌డీ నాయకత్వం జైల్లో వుంది. దుష్యంత్‌ చౌటాలా నాయకత్వంలో చీలిపోయిన జేజేపీ విడిగా పోటీ చేసింది. ఐఎన్‌ఎల్‌డీ క్షీణ దశ కారణంగా జాట్లందరూ గంపగుత్తగా కాంగ్రెస్‌కు ఓటేశారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ అధికార పీఠానికి అల్లంత దూరంలోనే నిలబడిపోవాల్సి వచ్చింది. ఎన్నికల తర్వాత దేవీలాల్‌ మునిమనవడు దుష్యంత్‌ చౌటాలా రూపంలో జాట్లకు సరి కొత్త ఆశాజ్యోతి కనిపిస్తున్నది. చౌధురీ చరణ్‌సింగ్‌ తర్వాత జాట్లకు ఆరాధ్య నాయకుడు దేవీలాల్‌. ఆయనను జననాయక్‌ అని పిలుచుకునేవారు. అదే పేరుతో జననాయక్‌ జనతా పార్టీని దుష్యంత్‌ నిలబెట్టాడు. భవిష్యత్‌లో మెజారిటీ జాట్లు దుష్యంత్‌ వైపు మళ్లడం ఖాయంగానే కనిపిస్తున్నది. కనుక హరియాణాలో ఇక ముందు కాంగ్రెస్‌ పార్టీ ఈ బలాన్ని నిలబెట్టుకోవడం సాధ్యం కాదు. బీజేపీకి మరాఠా–జాట్‌ల ఝలక్‌గానే ఈ రెండు రాష్ట్రాల ఫలితాలను భావించాలి తప్ప, ఇది మోదీ క్షీణత కాదు. రాహుల్‌ వృద్ధి అసలే కాదు.  

ఇప్పటిదాకా భారత పార్లమెంట్‌ దిగువ సభకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. మొదటి తొమ్మిది దఫాల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఏనాడూ 40 శాతం కంటే తక్కువ ఓట్లు రాలేదు. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లోనయితే ఏకంగా 50 శాతానికి దగ్గరగా (49.10) ఓట్లు వచ్చాయి. ఈసారి కాంగ్రెస్‌ పార్టీ సాధించిన ఓట్లు 19.49 శాతం మాత్రమే. మొత్తం 61 కోట్లమంది ఓటు వేస్తే అందులో కాంగ్రెస్‌ వాటా సుమారుగా 12 కోట్లు. బీజేపీకి 23 కోట్లమంది ఓటు వేశారు. అంటే 37.86 శాతం. కాంగ్రెస్‌ పార్టీ తిరిగి జాతీయ స్థాయిలో ప్రభావం చూపాలంటే ఇప్పటి తన బలాన్ని రెట్టింపు చేసుకోవాలి. అది సాధ్యమవుతుందన్న నమ్మకం కలగడం లేదు. మోదీ ముందు రాహుల్‌ కటౌట్‌ వెలవెలబోతున్నది. కాంగ్రెస్‌ పార్టీ కంటెంట్‌ (విధానాలు) కూడా గందరగోళంగా తయారైంది. క్లిష్ట సమయాల్లో పలాయనమంత్రాలు జపించడం రాహుల్‌గాంధీకి అలవాటుగా మారింది. పార్లమెంట్‌లో ప్రధానమంత్రిని హఠాత్తుగా వెళ్లి కౌగలించుకోవడం, సభలో కూర్చొని కన్నుగీటడం ఆయన వ్యక్తిత్వాన్ని మసకబార్చాయి. అధ్యక్షుడుగా క్రియాశీలకంగా వున్న కాలంలో రాష్ట్రాల్లో వున్న పార్టీ ముఠాల మధ్య సమన్వయం సాధించలేక రాహుల్‌ చేతులెత్తేశారు. కీలకమైన విషయాల్లోను కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన వైఖరిని తీసుకోవడంలో విఫలమైంది. ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్, అయోధ్య రామమందిరం వగైరా వివాదాలపై కాంగ్రెస్‌ గొంతుక స్పష్టంగా, సమర్థంగా వినిపించలేదు. ప్రధానమంత్రి అమెరికా వెళ్లి అక్కడ ట్రంప్‌ తరఫున ఎన్నికల ప్రచారం చేసి వచ్చినా గట్టిగా నిలదీయలేని నిర్భాగ్యస్థితిలో కాంగ్రెస్‌ కొట్టుమిట్టాడుతున్నది. ఉదార జాతీయవాదం, సమ్మిళిత అభివృద్ధి, రాజీ లేని లౌకికవాదం, సోషలిస్టు తరహా ఆర్థిక విధానాలు పార్టీ సిద్ధాంతాలుగా వున్నంతకాలం కాంగ్రెస్‌ ఓటు నలభై శాతానికి తగ్గకుండా నిలబడింది. దేశాభివృద్ధికి సరళీకృత ఆర్థిక విధానాలు అత్యవసరమైన సమయంలో పరిపాలనా పగ్గాలు చేబూనిన పీవీ నరసింహారావు మార్గనిర్దేశనంలో దేశం లాభపడింది. మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పార్టీ విధానాలను పునర్నిర్వచించుకోవలసిన సమయంలో ఆయనను వానప్రస్థాశ్రమానికి పంపించడం కాంగ్రెస్‌ పార్టీకి చేటుచేసింది. వివిధ జాతీయ–అంతర్జాతీయ అంశాలపై ఆ పార్టీ అస్ప ష్టత అప్పటి నుంచీ కొనసాగుతూ నేడు పరాకాష్టకు చేరుకున్నది. రాహుల్‌ కటౌట్‌ను ఎన్నిసార్లు నిలబెట్టినా చిరుగాలులకు కూడా పడిపోతున్నది. పార్టీ కంటెంట్‌ అయోమయంగా తయారైంది. ఈ సంక్షోభాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికి అధిగమిస్తుందో... అసలు అధిగమిస్తుందో, లేదో చెప్పడం కూడా కష్టమే. 

నరేంద్ర మోదీ భారతీయ జాతినేతగా ఎదిగిన మాట నిజం. ఇండియా ఈజ్‌ ఇందిర, ఇందిర ఈజ్‌ ఇండియా అని కొందరు కీర్తించినట్టుగానే, హిందుస్థాన్‌ ఈజ్‌ మోదిస్థాన్‌ అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్న మాట నిజం. మాటలో స్పష్టత, అభివ్యక్తిలో నాటకీయత, అభినివేశ సమ్మోహనజాలం ఆయన సొంతం. ఆరెస్సెస్‌ భావతరంగిణిలో జలకమాడినవాడు కనుక అనేక అంశాలపై ఆయనకి స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఛాయ్‌వాలా స్థాయి నుంచి సంఘ్‌ శిక్షణలో కార్యకర్తగా రాటుదేలి రాజకీయ నేతగా రాణకెక్కిన కారణంగా ఎత్తుపల్లాలు తెలుసు. ఎత్తుగడలూ తెలుసు. సుశిక్షితులైన లక్షలాదిమందితో కూడిన సంఘ్‌ పరివార్‌ అండదండలు పుష్కలంగా వున్నాయి. ఆ తోడ్పాటుతో తనను తాను ఒక జాతీయ శిల్పంగా మలుచుకున్నవాడు మోదీ. హిందూత్వం న్యూక్లియస్‌గా వుండే తీవ్ర జాతీయవాదం బీజేపీకి సైద్ధాంతిక భూమిక. అందువలన బీజేపీలో విధానపరమైన గందరగోళం వుండే అవకాశం లేదు.  

మరి, కటౌట్‌కు, కంటెంట్‌కు ఢోకాలేని బీజేపీ చిరకాలం రాజ్యమేలుతుందా? ఇప్పటివరకు బీజేపీకి ఉచ్ఛదశ ఇదే. ఈ ఉచ్ఛదశలోనే పార్టీ సాధించిన ఓట్లు 23 కోట్లు. సుమారు 40 కోట్ల మంది ఆ పార్టీకి దూరంగా వున్నారు. భిన్నజాతులుగా, భిన్న మతాలుగా, వేల కులాలుగా చీలి ఉన్న భారత సమాజంలో హిందూత్వ ఎజెండా చేబూనిన బీజేపీ తన పరిధిని ఇంతకంటే విస్తృతపరుచుకోగలుగుతుందా? అందుకు ఎటువంటి మార్గాలను బీజేపీ అనుసరించబోతున్నది? హిందీయేతర ప్రజలపై హిందీ భాషను రుద్దే ఎజెండాను అటకపై దాచేస్తుందా? హిందూ సమాజంలోనే దళితులుగా, నిమ్న శూద్రులుగా వెనుకబడిపోయిన ప్రజల ఆత్మగౌరవానికి ఆలంబనగా నిలబడుతుందా? ముస్లిం, క్రైస్తవ తదితర మతావలంబులకు సొంత ఇంటి అనుభూతిని అందివ్వగలుగుతుందా? ఇత్యాది సందేహాలకు బీజేపీ ఆచరణపూర్వకంగా ఇవ్వబోయే సమాధానాలను బట్టే ఆ పార్టీ వైభవం ఆధారపడి ఉంది. ఇప్పటి ఆరి్థక మందగమనం మరింత ముదిరి, నిరుద్యోగ సమస్య మరింత ప్రబలితే ఫలితం తిరగబడవచ్చునేమో కానీ, ప్రస్తుతానికైతే అడ్వాంటేజ్‌ బీజేపీ.

వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in

మరిన్ని వార్తలు