లెక్కల చిక్కులు!

3 Apr, 2017 03:01 IST|Sakshi
లెక్కల చిక్కులు!

జేఈఈ మెయిన్‌ పరీక్షలో 15 వరకు క్లిష్ట ప్రశ్నలు
కెమిస్ట్రీ కాస్త కఠినం.. సులభంగా ఫిజిక్స్‌
తగ్గనున్న కటాఫ్‌ మార్కులు!
ఈనెల 18 నుంచి 22 వరకు వెబ్‌సైట్‌లో ‘కీ’


సాక్షి, హైదరాబాద్‌: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఇతర కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి ఇంజనీరింగ్‌ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పరీక్షలో విద్యార్థులకు లెక్కల తిప్పలు తప్పలేదు. ఎప్పుడూ ఫిజిక్స్‌లో టఫ్‌ ప్రశ్నలు ఇచ్చేవారు. ఈసారి ఫిజిక్స్‌ ఈజీగా ఇవ్వగా, మ్యాథమెటిక్స్‌ ఇబ్బంది పెట్టినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. మ్యాథమెటిక్స్‌లో మొత్తం 30 ప్రశ్నల్లో 8 ప్రశ్నలు అధిక సమయం తీసుకునేవే రావడంతో ఎక్కువ మంది విద్యార్థులు రాయలేకపోయారు.

మరో 7 ప్రశ్నలు ఆలోచిస్తే తప్ప రాయలేని విధంగా ఇచ్చినట్లు సబ్జెక్టు నిపుణులు ఎంఎన్‌ రావు పేర్కొన్నారు. మిగిలిన 15 ప్రశ్నలు మాత్రమే కాస్త సులభంగా ఉండేవి వచ్చినట్లు వెల్లడించారు. గడిచిన రెండుమూడేళ్లలో జేఈఈ మెయిన్‌ మ్యాథమెటిక్స్‌ ప్రశ్నల్లో సులభ ప్రశ్నలు 20కి పైగా ఇచ్చేవారు. దీంతో సాధారణ విద్యార్థులు కూడా బాగా రాయగలిగే వారు. కానీ ఈసారి ప్రతిభావంతులు కూడా సమయం సరిపోక ఒకటీ రెండు ప్రశ్నలు రాయలేని పరిస్థితి.

కెమిస్ట్రీలో కూడా..
మరోవైపు కెమిస్ట్రీలో కూడా కాస్త ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. మొత్తం 30 ప్రశ్నల్లో 6 ప్రశ్నలు టఫ్‌గా ఉన్నాయని, మిగతా ప్రశ్నలు సులభంగానే ఉన్నాయని పేర్కొంటున్నారు. గతానికి భిన్నంగా ఈసారి ఫిజిక్స్‌ సులభంగా వచ్చిందని సబ్జెక్టు నిపుణులు రామకృష్ణ తెలిపారు. అయితే మ్యాథమెటిక్స్‌లో ఎక్కువ సమయం తీసుకున్న విద్యార్థులు.. చివరల్లో సమయం సరిపోక ఫిజిక్స్‌లో అన్నింటికి సమాధానాలు గుర్తించలేకపోయారని చెప్పారు. దీంతో ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కటాఫ్‌ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. గతేడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు జనరల్‌ కేటగిరీలో 100 మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా అర్హత సాధించగా, ఈసారి ఇంకా తగ్గే అవకాశం ఉందని, లేదంటే 100 మార్కుల వరకు ఉండవచ్చని చెబుతున్నారు.

95 శాతం విద్యార్థుల హాజరు..
రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష రాసేందుకు 69,467 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా, 95 శాతం మంది హాజరైనట్లు తెలిసింది. పరీక్ష హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నిర్వహించారు. హైదరాబాద్‌ కేంద్రంలో 96 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు సమాచారం. వరంగల్, హన్మకొండలో 17 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా మొదటి పేపర్‌కు 97.5 శాతం, రెండో పేపర్‌కు 94 శాతం విద్యార్థులు హాజరయ్యారు.

 మరోవైపు వెబ్‌సైట్‌లో ప్రాథమిక కీని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఆదివారమే అందుబాటులో ఉంచుతుందని విద్యార్థులు భావించారు. కాని ఈనెల 18 నుంచి 22 వరకు ‘కీ’ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని సీబీఎస్‌ఈ వెల్లడించింది. అలాగే ఆయా తేదీల్లోనే విద్యార్థుల ఓఎంఆర్‌ పత్రాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది.

8, 9 తేదీల్లో ఆన్‌లైన్‌లో జేఈఈ మెయిన్‌
ఇక ఈనెల 8, 9 తేదీల్లో ఆన్‌లైన్‌లో జేఈఈ మెయిన్‌ పరీక్షను సీబీఎస్‌ఈ నిర్వహించనుంది. 27న ఫలితాలను వెల్ల డించనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన 2.20 లక్షల మంది జాబితాను కూడా అదే రోజు ప్రకటించనుంది. ఈనెల 28 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఐఐటీ మద్రాసు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ను స్వీకరించనుంది. ఐఐటీల్లో ప్రవేశాల కు మే 21వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాత పరీక్ష నిర్వహించనుంది.

Read latest Home-latest-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు