కమలం వీరుల కోసం కసరత్తు 

29 Sep, 2018 08:55 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా అవతరించాలని కలలుగంటున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించింది. ఆయా నియోజకవర్గాల నుంచి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మొదలు, జాతీయ స్థాయిలో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతల అభిప్రాయాల మేరకే అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తొలి విడత సమావేశం గురువారం పాత ఆదిలాబాద్‌ పరిధిలోని నాలుగు జిల్లాల్లో జరిగాయి. ఆయా జిల్లాల పార్టీ ఇన్‌చార్జిలు పార్టీ కమిటీల్లోని పదాధికారుల అభిప్రాయాలు సేకరించారు. అక్టోబర్‌ 4న రాష్ట్ర సంఘటనా మంత్రి అయిన మంత్రి శ్రీనివాస్‌ సమక్షంలో పార్టీ నేతలు కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, మురళీధర్‌రావు తదితర కోర్‌ కమిటీతో జరిగే సమావేశానికి ఏ స్థాయిల్లోని నాయకులను తీసుకెళ్లాలనే అంశంపై చర్చించారు.
 
4న నియోజకవర్గ నేతల అభిప్రాయ సేకరణ
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని 10 నియోజకవర్గాల పార్టీ నాయకులతో మంత్రి శ్రీనివాస్, పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ , జి.కిషన్‌రెడ్డి తదితర నేతలు ఈ నెల 4న హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులతో స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకొని, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు దీటైన అభ్యర్థి ఎవరనే విషయాన్ని వారి ద్వారానే తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు. పార్టీ ఎవరికి సీటిస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే దానిపైనే మంత్రి శ్రీనివాస్‌ నేతృత్వంలోని కోర్‌కమిటీ దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. పార్టీ బలహీనంగా ఉన్న చోట ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులను తీసుకొచ్చే అంశంపై కూడా వారు నేతల అభిప్రాయాలు తీసుకోనున్నారు.

కోర్‌ కమిటీ సమావేశానికి     వెళ్లేది వీరే..
ప్రతి నియోజకవర్గం నుంచి మండల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గానికి చెందిన జిల్లా పదాధికారులు, రాష్ట్ర, జాతీయ పార్టీ కమిటీల్లోని సభ్యులు, స్టేట్‌ కౌన్సిల్‌ సభ్యులు ఈ సమావేశాలకు హాజరవుతారు. వీరి నుంచే రాష్ట్ర కోర్‌ కమిటీ అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించనుంది.

ఏ సెగ్మెంట్‌లో ఎవరు..?
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నాలుగు జిల్లాలలో ఉన్న 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో చాలా చోట్ల అభ్యర్థులు ఇప్పటికే ఖరారయ్యారు. పార్టీకి అండగా ఉంటూ వస్తున్న వీరిని మార్చే అవకాశాలు లేవు. ఆదిలాబాద్‌లో పాయల్‌ శంకర్, ముథోల్‌లో రమాదేవి, మంచిర్యాలలో ముల్కల్ల మల్లారెడ్డి, బెల్లంపల్లిలో కొయ్యల ఏమాజీలు అభ్యర్థులుగా కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ వేరే అభ్యర్థులు కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదు. చెన్నూరులో పార్టీ ముఖ్య నాయకుడు అందుగుల శ్రీనివాస్‌ వైపు నియోజకవర్గ నేతలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 2009 ఎన్నికల్లో పీఆర్‌పీ నుంచి పోటీ చేసి 20వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్న అందుగుల శ్రీనివాస్‌ తరువాత బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో టీడీపీ మిత్రపక్షాల అభ్యర్థిగా పోటీ చేసిన రామ్‌వేణుకు డిపాజిట్‌ రాకపోవడం, అందుగుల శ్రీనివాస్‌ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని పార్టీ పటిష్టత కోసం కృషి చేయడంతో ఆయనకు మద్ధతు ఎక్కువగా ఉంది.

రామ్‌ వేణు సైతం తన వంతుగా మరోసారి టికెట్టు సంపాదించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. నిర్మల్‌లో మల్లికార్జునరెడ్డికి వైద్యుడిగా మంచిపేరుంది. ఆయన సంతానం కూడా వైద్యవృత్తిలోనే ఉండడంతో మల్లికార్జునరెడ్డి ప్రస్తుతం పూర్తిగా బీజేపీ కార్యకలాపాలతోనే ఉన్నారు. ఆయనకే టికెట్టు వస్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో మాజీ డిప్యూటీ స్పీకర్‌ భీంరెడ్డి కూతురు స్వర్ణారెడ్డి ఇటీవల పార్టీలో చేరారు. పార్టీ నాయకుల నుంచి తీసుకునే అభిప్రాయ సేకరణలో సీనియర్‌ నేత మల్లికార్జునరెడ్డి వైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఆసిఫాబాద్‌లో పార్టీ సీనియర్‌ నాయకుడు, జెడ్‌పీటీసీ రామ్‌నాయక్‌కు అన్ని మండలాల నుంచి మద్ధతు ఉంది. ఆయన గత కొంతకాలంగా నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు చేస్తున్న కార్యక్రమాలు తోడ్పడే అవకాశాలున్నాయి. సిర్పూరులో డాక్టర్‌ శ్రీనివాస్,  ఖానాపూర్‌లో వండూరి ప్రభాకర్‌లు టికెట్టు ఆశిస్తుండగా, బోథ్‌లో మడావి రాజు, నానాజిల మధ్య పోటీ నెలకొంది. నియోజకవర్గ నేతల అభిప్రాయాలకు విలువ ఇస్తే సరైన అభ్యర్థి లభిస్తాడని నాయకులు భావిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు