‘స్వగృహా’లకు కొత్త ధరలు

21 Jul, 2015 03:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఆధునిక హంగులతో రూపుదిద్దుకుని అమ్ముడుపోకుండా మిగిలిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు కొత్త ధరలు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 23న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆధ్వర్యంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. బండ్లగూడలో 316 ఫ్లాట్లు, పోచారంలో 435 ఫ్లాట్లు గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. బండ్లగూడలో ప్రస్తుత ధర చదరపు అడుగుకు రూ.2,950, పోచారంలో రూ.2,800 ఉంది. దీంతో ఈ ఇళ్లు కొనేందుకు ఎవరూ ముందుకురాక ఖాళీగా పడి ఉన్నాయి.

ఇప్పుడు వీటి ధరలను సవరించి వెంటనే అమ్ముడుపోయేలా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
 
రాయితీ ధరకు ప్రభుత్వ ఉద్యోగులకు అమ్మొద్దు
బండ్లగూడ, పోచారంలలో దాదాపు రెండు వేలు చొప్పున స్వగృహ ఇళ్లు తుది పనులు జరుపుకోకుండా ఉన్నాయి. వీటిని రాయితీ ధరలకు ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అన్ని హంగులద్దుకుని 751 ఫ్లాట్లు (రెండు చోట్ల కలిపి) సిద్ధంగా ఉన్నాయి. అదనపు హంగులతో ఉన్న ఇళ్లను రాయితీ ధరలకు అమ్మితే భారీగా నష్టం వస్తుందని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీంతో వాటిని రాయితీ ధరలకు అమ్మొద్దని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.

కానీ ప్రస్తుత ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో తగ్గించాలని సూచించింది. రాష్ట్రం విడిపోయే సమయంలో కొందరు నేతలు, ఉన్నతాధికారుల అవినీతి దాహంతో ఒక్కసారిగా వాటి ధరలు పెరిగాయి. అప్పటి వరకు చదరపు అడుగు ధర రూ.2,220 గా ఉండేది. కానీ అన్ని రకాల అంశాల ఎస్కలేషన్‌కు వీలు కలిగించే జీవో 35ను ఉన్నట్టుండి స్వగృహకు వర్తింపజేశారు. అప్పటి వరకు ఈ ఉత్తర్వు నుంచి స్వగృహకు మినహాయింపు ఉంది.

ఎస్కలేషన్ పేరుతో దాదాపు రూ.100 కోట్లు మాయం చేశారు. ఆ భారాన్ని రికవరీ చేసే పేరుతో ఒక్కసారిగా ధరలు పెంచేయడంతో వాటి అమ్మకాలు నిలిచిపోయాయి. ఈ పెంపునకు పూర్వం ఉన్న ధరలను మళ్లీ ఖరారు చేసే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్న ఇళ్లు అమ్ముడుపోగా మిగతా వాటిని రాయితీతో ప్రభుత్వ ఉద్యోగులకు విక్రయిస్తారు.

మరిన్ని వార్తలు