తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

13 Jul, 2018 19:31 IST|Sakshi
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

సాక్షి, హైదరాబాద్‌ : రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన చేసింది. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని, దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఉత్తర చత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాలలో 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాష్ట్రంలో ఈరోజు అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

కోస్తా ఆంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలలో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. ఈరోజు, రేపు  కోస్తా ఆంధ్రలో చాలాచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఎల్లుండి  కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు, రేపు కొన్నిచోట్ల, ఎల్లుండి అక్కడక్కడ  వర్షాలు కురిసే అవకాశం ఉందని అంది.

ఉత్తరాంధ్రకు అ‍ల్పపీడన తీవ్రత
ఉత్తరాంధ్ర జిల్లాల‌కు అల్పపీడ‌న ప్రభావం ఎక్కువగా ఉండే అవ‌కాశం ఉందని ఆర్టీజీఎస్‌ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు కొన్ని సూచనలను వారు విడుదల చేశారు. ఈ నెల 15 నుంచి 17 వ‌ర‌కు తీవ్ర ప్రభావం ఉండనుందని, తీర ప్రాంతాల్లో అల‌ల తీవ్రత ఎక్కవగా ఉండే అవ‌కాశం ఉందని అన్నారు.  అల‌లు 4 మీట‌ర్ల ఎత్తువర‌కు ఎగ‌సి ప‌డొచ్చని తెలిపారు. గాలుల వేగం గంట‌కు 40 నుంచి 60 కిలోమీట‌ర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అన్నారు. తీర ప్రాంతాల్లో ప్రజ‌లు అప్రమ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. మ‌త్స్యకారులు చేప‌ల వేట‌కు వెళ్లకూడ‌దని, ప్రజ‌లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ప్రభావిత మండ‌లాలు :
విశాఖ‌ప‌ట్నం : రాంబిల్లి, పెదగంట్యాడ, పరవాడ, అచుతాపురం, విశాఖపట్నం, విశాఖ‌ప‌ట్నం రూర‌ల్‌, భీమునిపట్నం. 
విజ‌య‌న‌గ‌రం :  భోగాపురం, పూసపాటిరేగ. 
శ్రీకాకుళం :  ర‌ణ‌స్థలం, ఈత‌చెర్ల‌, శ్రీకాకుళం, గార‌, పొలాకి, సంత‌బొమ్మాళి, పాల్స‌, మంద‌స‌, సోంపేట‌, క‌విటి, ఇచ్చాపురం

మరిన్ని వార్తలు