నన్ను మారనివ్వండి ప్లీజ్!

10 Dec, 2013 10:23 IST|Sakshi
నన్ను మారనివ్వండి ప్లీజ్!

*ఘరానా చోరీలు.. జల్సా జీవితం
 *చోరీ సొత్తులో కొంత పేదలకు పంపకం
 *ఆరేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 110 నేరాలు
 *భూక్యానాయక్ నేరాల స్టైలే వేరు!
 *ఆటకట్టించిన కార్ఖానా పోలీసులు

 
రాంగోపాల్‌పేట, న్యూస్‌లైన్: ఖరీదైన ప్రాంతాలే టార్గెట్.. చోరీ సొత్తులో కొంత బీదాబిక్కీకి పంపకం.. ఊరు దాటాలంటే ఫ్లైట్.. బస చేయాలంటే ఫైవ్‌స్టార్ హోటల్.. గజదొంగ భూక్యానాయక్ శైలి ఇది. అతని ఆటకట్టించిన కార్ఖానా పోలీసులు 85 తులాల బంగారు, రెండు కేజీల వెండి ఆభరణాలు, నగదు స్వాధీ నం చేసుకున్నారు. సోమవారం మహంకాళి ఏసీపీ కార్యాలయంలో ఉత్తర మండలం డీసీపీ జయలక్ష్మి వివరాలు వెల్లడించారు.  
 
మూడు రాష్ట్రాల్లో పంజా విసిరి...

కృష్ణా జిల్లా ఎ.కొండూరుకి చెందిన భూక్యానాయక్ 2007 నుంచి చోరీలకు అలవాటుపడ్డాడు. హైదరాబాద్, సైబరాబాద్‌తో పాటు కృష్ణా, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం జిల్లాలు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలు నేరాలు చేశాడు. పి.ఉమామహేశ్వరరావు, పి.సురేష్, ఎన్.సురేష్, ఎం.భాస్కర్ (చనిపోయాడు), కె.విజయకృష్ణతో ముఠాకట్టి ఆరేళ్లలో 110 కేసుల్లో నిందితుడిగా ఉండి జైలుకు వెళ్లొచ్చాడు. ఇతనిపై పలు ఠాణాల్లో నాన్-బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఓ కేసులో పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపగా... మేలో బెయిల్‌పై విడుదలయ్యాడు.

అనంతరం కార్ఖానా ఠాణా పరిధిలో ఐదిళ్లలో దొంగతనాలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్నాడు. చోరీ సొత్తును చార్మినార్‌లో విక్రయించేందుకు సోమవారం సిటీకి వచ్చిన ఇతగాడు సికింద్రాబాద్‌లోని ఓ బస్టాప్ వద్ద వేచి ఉన్నాడు. సమాచారం అందుకున్న కార్ఖానా ఠాణా డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ వి.నాగయ్య బృందంతో దాడిచేసి అదుపులోకి తీసుకుంది. ఇతడి నుంచి చోరీ సొత్తును కొన్న గుత్తికొండ పవన్‌కుమార్‌నూ పట్టుకున్నారు. పవన్ బీకాం (కంప్యూటర్స్) చదివాడు. భూక్యానాయక్ గురించి పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  
 
చిటికెలో చోరీ..

పగలూరాత్రి తేడా లేకుండా పంజా విసిరే భూక్యానాయక్‌కు ఖరీదైన ప్రాంతాల్లో నివసించే వారే టార్గెట్. తాను చేసిన చోరీలపై బాధితులు ఫిర్యాదు చేయడానికీ వెనుకాడే పరిస్థితి కల్పిస్తాడు. పట్టపగలు ఇంటి ముందు వాచ్‌మెన్ కాపలా ఉన్నా... కళ్లుగప్పి తాళం పగులగొట్టి ఊడ్చుకుపోతాడు. చోరీ సొత్తులోని కొంత భాగం యాచకులకు, రాత్రి వేళల్లో ఆస్పత్రుల వద్ద రోడ్డు పక్కనే నిద్రించే వారికి పంచుతాడు. పోలీసులకు దొరికినప్పుడు మాత్రం అప్పటికి ఏ సందర్భంలోనైనా తనను ఇబ్బంది పెట్టిన వాళ్లను ఇరికించడానికి యత్నిస్తాడు. నేరాల్లో వారి ప్రమేయం కూడా ఉన్నట్లు చెప్పడం ద్వారా పోలీసులకు కంటిపై కునుకు లేకుండా చేస్తాడు. బెయిల్‌పై వచ్చాక ‘నీ ఏరియాలో చోరీ చేస్తున్నా.. దమ్ముంటే కాచుకో’ అంటూ చాలెంజ్ చేయడం భూక్యా నైజం. 2010లో మచిలీపట్నం నుంచి విజయనగరం తరలిస్తుండగా పోలీసు ఎస్కార్ట్‌కు మస్కా కొట్టి జీపులో నుంచి దూకి తప్పించుకున్నాడు.
 
‘రియల్’ ముసుగులో జల్సాలు

 చోరీల ద్వారా భారీ మొత్తం మూటగట్టాక పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు కర్ణాటక, తమిళనాడు, గోవాకు విమానాల్లో చెక్కేస్తాడు. రియల్‌ఎస్టేట్ వ్యాపారినంటూ బిల్డప్ ఇచ్చి ఫైవ్‌స్టార్ హోటళ్లలో బస చేస్తాడు. చిన్న వస్తువు కొనాలన్నా పెద్ద షాపింగ్ మాల్‌కు వెళ్లాల్సిందే. ఎక్కడా నిలకడగా ఉండకుండా తరచూ సెల్‌ఫోన్, సిమ్‌కార్డు మారుస్తూ నిఘా నుంచి తప్పించుకుంటాడు. స్టార్‌హోటళ్లలో బస చేసినప్పుడు మాత్రమే రెడ్‌వైన్ తాగుతాడు. ఏడో తరగతి మాత్రమే చదివిన భూక్యా.. తనకు సహకరించేందుకు ఇద్దరు ముగ్గురు సన్నిహితులను తీసుకువెళ్తుంటాడు. డ్యాన్సర్ కూడా కావడంతో పబ్‌లకు వెళ్లి చిందేస్తాడు. సినీ పరిశ్రమలోనూ పలువురితో పరిచయాలు ఉన్నట్లు సమాచారం. కోస్తా జిల్లాల పోలీసుల తొలి టార్గెట్‌లో ఎప్పుడూ భూక్యానాయక్ ఉంటాడు.
 
బెయిల్ పిటిషన్ వేయడానికి పోటీ

భూక్యానాయక్ నిరంతరం కొందరు అడ్వకేట్లతో టచ్‌లో ఉంటాడు. పోలీసులకు చిక్కినప్పుడు బెయిల్ పిటిషన్ వేయడానికి వారు పోటీపడతారని తెలుస్తోంది. ఈ ఖర్చులకే భూక్యా రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు వరకు ఖర్చు చేసి ఉంటాడని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇతడి స్నేహితుల్లో కొందరు ప్రస్తుతం బాగా ‘స్థిరపడినట్లు’ సమాచారం. ఇతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

నన్ను మారనివ్వండి ప్లీజ్!
'నేను దొంగతనాలు మాని సాధారణ జీవితం గడపాలనుకున్నా, పోలీసులు నన్నలా ఉండనివ్వట్లేదు. నా ఇద్దరు పిల్లల్ని బాగా చదివించి ఉన్నతస్థాయిలో చూడాలని ఉంది. పోలీసుల తీరుతోనే ఇలా మళ్లీ మళ్లీ దొంగగా మారాల్ని వస్తోంది. పోలీసులు, మీడియా నేను మారేందుకు సహకరించాలి' అంటూ పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంలో భూక్యా నాయక్ అన్నాడు.

మరిన్ని వార్తలు