ప్రపంచంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం

9 Apr, 2016 03:22 IST|Sakshi
ప్రపంచంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం

 125 అడుగుల ఎత్తుతో హైదరాబాద్‌లో నిర్మించాలని సీఎం నిర్ణయం
 సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే   ఎత్తయిన 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 14న విగ్రహానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఈ విగ్రహావిష్కరణ చేస్తామని ప్రకటించారు. ప్రపంచంలోఎక్కడా లేనంత ఎత్తులో దీన్ని ఏర్పాటు చేయడంతో పాటు నగరంలో అంబేడ్కర్ స్క్వేర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేయడంతోపాటు అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నాయకత్వంలో హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా కన్వీనర్‌గా కమిటీని వేశారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, చందూలాల్, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి, టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ నిర్వాహకుడు మల్లేపల్లి లక్ష్మయ్య, ఎంపీలు బాల్క సుమన్, పసునూరి దయాకర్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మే యర్ ఫసియుద్దీన్, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు సభ్యులుగా ఉంటారు.

వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విగ్రహాన్ని ఆవిష్కరించేలా తగిన కార్యాచరణ రూపొందించే బాధ్యతలను ఈ కమిటీకి అప్పగించారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం సమీక్ష నిర్వహించారు. అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రతి నెలా ఒక కార్యక్రమం జరగాలని, ప్రతీ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు జరగాలని, దళితులకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్నారు. దళితుల అభ్యున్నతి, చైతన్యానికి కార్యక్రమాలు రూపకల్పన చేయాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు