టీఎస్ ఎడ్‌సెట్‌లో 98 శాతం ఉత్తీర్ణత

12 Jun, 2016 02:14 IST|Sakshi
టీఎస్ ఎడ్‌సెట్‌లో 98 శాతం ఉత్తీర్ణత

- కనీస అర్హత మార్కుల నుంచి ఎస్సీ ఎస్టీ, మహిళలకు మినహాయింపునివ్వడమే కారణం
- ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్
 
 సాక్షి, హైదరాబాద్: బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన టీఎస్ ఎడ్‌సెట్-2016 పరీక్షలో రికార్డు స్థాయిలో 98.14 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి శనివారం విడుదల చేశారు. గత నెల 25న నిర్వహించిన పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 41,485 మంది అభ్యర్థులు హాజరుకాగా, 40,826 మంది అర్హత సాధించారు. అర్హత మార్కులను 25 శాతానికి కుదించడం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులతోపాటు మ్యాథ్స్, ఫిజికల్  సైన్స్ విభాగాల్లో మహిళా అభ్యర్థులకు కనీస అర్హత మార్కుల నుంచి మినహాయింపు ఇవ్వడం వల్లే ఇంత పెద్ద ఎత్తున అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.

పురుష అభ్యర్థులు 98.63 శాతం అర్హత సాధించగా, మహిళా అభ్యర్థులు కూడా 98.32 శాతం మంది అర్హత పొందారు. ఉర్దూ మాధ్యమంలో ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో 797 మంది (91శాతం) అర్హత పొందగా.. అందులో 729 మంది మహిళలే కావడం గమనార్హం. అలాగే ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పరిధికి చెందిన వారు 40,220 మంది అర్హత సాధించగా, ఆంధ్ర, వెంకటేశ్వర యూనివర్సిటీలకు చెందిన 313 మంది అభ్యర్థులు మాత్రమే అర్హత పొందారు. బీఎడ్ కళాశాలల్లో సీట్లు భారీగా మిగిలిపోతుండడానికి యువ త ప్రాధాన్యాలు మారడం ఒక కారణమైతే, కోర్సును రెండేళ్లకు పెంచడం, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీకి బీఎడ్ అభ్యర్థులను అనుమతించకపోవడం ఇతర కారణాలని పాపిరెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బీఎడ్ కళాశాలల్లో మొత్తం 20 వేల సీట్లు ఉన్నాయన్నారు.

 జూలైలో కౌన్సెలింగ్: సెట్ కన్వీనర్ పి.ప్రసాద్
 టీఎస్‌ఎడ్‌సెట్-2016 ఫలితాలను www.tsedcet.org వెబ్‌సైట్‌లో ఉంచామని సెట్ కన్వీనర్ పడాల ప్రసాద్ తెలిపారు. ఈనెల 16 నుంచి అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులను వెబ్‌సైట్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రవేశాల నిమిత్తం జూలై మొదటి వారంలో సర్టిఫికేట్ల పరిశీలన, వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు