గోభాగ్యం!

3 Jul, 2017 01:03 IST|Sakshi
గోభాగ్యం!
నగరంలో అరుదైన జాతి ఆవులు – పుంగనూరు, కపిల, దేవ్‌నీల సందడి
పెంపకానికి ముందుకొస్తున్న ఔత్సాహికులు – గో ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌
 
సాక్షి ప్రతినిధి, హైదరాబాద్‌: అరుదైన దేశీ ఆవులకు భాగ్యనగరం కేరాఫ్‌గా మారుతోంది! దేశమంతా విదేశీ జాతి ఆవుల వెల్లువలో కొట్టుకుపోతుంటే.. నగరంలో మాత్రం పలువురు పుంగనూరు, దేవ్‌నీ, కపిల, థార్‌ పార్కర్, గిర్, కాంక్రేజ్, సాహివాల్‌ తదితర జాతి ఆవులను పెంచుతున్నారు. వీటిలో అంతరించే దశకు చేరుకున్న జాతి ఆవులు కూడా ఎక్కువగా ఉండటం విశేషం. ఇందులో ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఎత్తు(70–90 సెం.మీ), బరువు (100–150 కేజీలు)తో, భూమిని తాకే తోకతో విలక్షణంగా కనిపించే పుంగనూరు ఆవులు, దూడలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవి నగరంలో పలు ఇళ్లలో కనిపిస్తున్నాయి. ఈ ఆవులు తక్కువ మేతతో సగటున రోజుకు రెండు పూటలా 8 లీటర్ల పాలు ఇస్తున్నాయి. 8 నుంచి 8.5 కొవ్వు శాతం ఉండే వీటి పాల కోసం అనేక మంది వీఐపీలు ఎంత మొత్తమైనా చెల్లించేందుకు క్యూ కడుతున్నారు.

నిజాం హయాంలో లాతూర్‌ ప్రాంతం నుంచి నగరానికి వచ్చిన దేవ్‌నీ ఆవులు ప్రస్తుతం దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. బీదర్, బసవకళ్యాణ, బాల్కి తదితర జిల్లాల్లో వేళ్లపై లెక్కపెట్టగలిగే సంఖ్యలో ఉన్న ఈ జాతి (దక్కనీ బ్రీడ్‌) ఆవులు సైతం నగరంలో కనిపిస్తున్నాయి. కర్ణాటకకు చెందిన స్వర్ణ కపిల, రాజస్థాన్‌కు చెందిన థార్‌ పార్కర్, గిర్, పంజాబ్‌ సాహివాల్‌ జాతుల ఆవులను కూడా నగరంలో పలువురు పెంచుకుంటున్నారు. దేశీ ఆవుపాలు, మూత్రం, పేడ అన్నింట్లో పుష్కలమైన ఔషధ లక్షణాలున్నాయని తేలడంతో వాటి ఉత్పత్తులకూ డిమాండ్‌ ఏర్పడింది. పాలతోపాటు మూత్రం, పేడతో తయారు చేసే పిడకలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తుండటం విశేషం.
 
వైఎస్‌.. ఓ రామదాసు..
అది 2005 జూన్‌ 2.. రాష్ట్రంలో పాల దిగుబడులపై ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతోంది.. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో అన్ని సిద్ధం చేసుకున్నాడు ఏపీ డెయిరీ ఉద్యోగి రామదాసు.. అధికారుల కంటే ముందుగానే సీఎం వైఎస్‌ హాల్‌లోకి వచ్చేశారు. సమావేశం ప్రారంభం కాకముందే సీఎం వద్దకు చేరుకున్న రామదాసు.. ‘సార్‌ ఒక్క విన్నపం.. చేసుకోవచ్చా.. నాకో ఆవు కావాలి..’అన్నాడు. అందుకు వైఎస్‌ ‘ఏమయ్యా.. అందరూ వచ్చి కాంట్రాక్టు కావాలనో లేదా పదవి కావాలనో, మంచి పోస్టింగ్‌ కావాలనో అడుగుతారు. మీరేంటి ఆవు కావాలని అడుగుతున్నారు? ఎక్కడ్నుంచి తెచ్చివ్వాలి..’’అంటూ నవ్వేశారు. చివరికి ఆయన కోరిక మేరకు.. రామదాసుకు ఓ పుంగనూరు ఆవు–కోడె ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించాడు. అలా వచ్చిన పుంగనూరు ఆవు, కోడెను ఉప్పల్‌లోని తన ఇంటి ఆవరణలోనే పెంచుకున్నాడు. ఇప్పుడు వాటి సంతానం 17కు చేరింది. ఇటీవలే రామదాసును రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్‌ బ్రీడ్‌ సేవియర్‌ అవార్డుతో సత్కరించింది.
 
మా పాలకు మహా గిరాకీ
హైటెక్‌ సిటీ అయ్యప్ప సొసైటీలో నా సొంత ఆవరణలో పుంగనూరు, సాహివాల్, గిర్, ఒంగోలు, కపిల జాతి దేశీ ఆవులను పదహారేళ్లుగా పెంచుతున్నా. దేశంలోనే అతి పొట్టి (3 అడుగులు ఎత్తు) పుంగనూరు ఆవు నా వద్దే ఉంది. ఉదయం సాయంత్రం కలిపి 10 లీటర్ల వరకు పాలు ఇస్తోంది. ఈ పాలకు విపరీతమైన గిరాకీ ఉంది. లీటరు పాల ధర రూ.200 వరకు విక్రయిస్తాం. అనేక మంది వీఐపీలు పాల కోసం వస్తుంటారు. –పొనుగోటి శ్రీనివాసరావు
 
స్వదేశీ ఉద్యమకర్త.. నరేశ్‌రెడ్డి
వైద్య వృత్తిని సైతం కాదనుకొని దేశీ జాతుల సంరక్షణ బాధ్యతను భుజాన వేసుకున్నాడు ఈ ముప్పై రెండేళ్ల డాక్టర్‌ నరేశ్‌రెడ్డి. అడ్డగుట్టలోని తన నివాసంతోపాటు శామీర్‌పేట వ్యవసాయ క్షేత్రంలో దేశీ ఆవులు, కోడెల్ని సంరక్షిస్తున్నారు. స్వర్ణ కపిల, పుంగనూరు, గిర్, పల్నాడ్‌ గిద్డ, వేచూరు, కాసరగోడ్‌ తదితర ఆవుల పోషణను వృత్తిగా మార్చుకున్నారు. దేశీ ఆవు అమ్మతో సమానమని, అందుకే వాటి పరిరక్షణను హాబీగా కాకుండా వృత్తిగా ఎంచుకున్నానని ఆయన చెప్పారు.
 
గోసంపన్నుడు.. ‘పుంగనూరు’ రామదాసు
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేడు అరుదైన పుంగనూరు ఆవు–దూడలతో ఏపీ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్‌ రామదాసు నివాసం ఎల్లప్పుడు కళకళలాడుతూ ఉంటుంది. పన్నెండేళ్ల క్రితం ఆయన ఒక ఆవు–కోడె తీసుకురాగా.. ఇప్పుడు వాటి సంఖ్య 17కు చేరింది. వాటిని రామదాసు దంపతులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. తిరుపతిలో స్వామి వారి అభిషేకానికి పుంగనూరు ఆవు పాలను వినియోగిస్తున్న తరహాలోనే.. యాదగిరి లక్ష్మీ నర్సింహస్వామికి పుంగనూరు పాలతో అభిషేకం చేయాలని ఆయన అభిలషించారు.
 
ఆవు ఉంటే అనారోగ్యం ఉండదు
దేశీ ఆవు పాలల్లో అనేక ఔషధాలున్నాయి. ఆవు ఉన్న ఇంట్లో అనారోగ్యం ఉండదు. అందుకే నేను పుంగనూరు, సాహివాల్, కపిల జాతుల్ని పోషిస్తున్నా. పుంగనూరు జాతి ప్రపంచంలోనే అత్యంత శ్రేయస్కరమైంది. దేశవాళీ ఆవుల పాలు, నెయ్యితోపాటు పేడలోనూ రేడియేషన్‌ను తగ్గించే లక్షణం ఉంది. ఆవు పాలతో తయారు చేసే ఔషధాలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. ఇంటింటా దేశీ జాతి ఆవులను పెంచుకుంటే బ్యాంకు అకౌంట్‌లో కావల్సినంత ధనం ఉన్నట్టే. – సత్యవీర్‌
మరిన్ని వార్తలు