మళ్లీ తెరపైకి ఓటుకు కోట్లు కేసు

29 Aug, 2016 12:10 IST|Sakshi
మళ్లీ తెరపైకి ఓటుకు కోట్లు కేసు

పునర్విచారణకు ఏసీబీ కోర్టు ఆదేశం
సెప్టెంబర్ 29లోగా విచారణ పూర్తి చేయాలని ఉత్తర్వులు
పిటిషన్ దాఖలు చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
ఫోరెన్సిక్ నివేదికలను కోర్టు ముందుంచిన న్యాయవాది
వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు

హైదరాబాద్

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు కోట్లు కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ కేసును పునర్విచారణ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. వచ్చేనెల 29వ తేదీలోగా ఈ విచారణ పూర్తి చేయాలని ఏసీబీని ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వరంపై ఫోరెన్సిక్ పరీక్షల నివేదికను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టు ముందు ఉంచారు. ఈ నివేదిక ఆధారంగా కేసుపై పునర్విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. దాంతో పిటిషనర్ వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. ఆర్కే దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఓటుకు కోట్లు కేసులో సరైన విచారణ జరగలేదని ఆయన చెప్పారు. ఫోరెన్సిక్ నివేదికను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాది కోరారు. తిరిగి విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని అడిగారు. ఆయన వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది.  (చదవండి: చంద్రబాబు తప్పు ఒప్పుకొని దిగిపోవాలి: ఆర్కే)

దాదాపు ఏడాది కాలంగా ఈ కేసు ముందుకు సాగడంలేదు. అప్పట్లో స్టీఫెన్‌సన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో టేపులు అతికించినవా, వాస్తవమైనవా అనే విషయమై నివేదికను ఫోరెన్సిక్ సైన్సెస్ ల్యాబ్ ఇచ్చింది. అవి అసలైనవే తప్ప అతికించినవి కావని అప్పట్లో ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది. దాంతోపాటు ఈ స్వరం చంద్రబాబు నాయుడిదేనని కూడా శాస్త్రీయంగా నిర్ధారించారు. ఇప్పుడు తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పలు సందర్భాలలో చంద్రబాబు మాట్లాడిన స్వర నమూనాలను, ఓటుకు కోట్లు కేసులో వినిపించిన సంభాషణలను అంతర్జాతీయంగా పేరొందిన ఒక ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ ల్యాబ్ అందించిన నివేదికలో కూడా ఆ స్వరం చంద్రబాబుదేనని తేల్చారు. వాటి ఆధారంగానే ఇప్పుడు ఏసీబీ కోర్టులో కేసు దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు