ఏఓబీ ఎన్‌కౌంటర్ పై విచారణ జరపాలి :విమలక్క

26 Oct, 2016 03:01 IST|Sakshi
ఏఓబీ ఎన్‌కౌంటర్ పై విచారణ జరపాలి :విమలక్క

హైదరాబాద్: ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ చైర్‌పర్సన్ విమలక్క డిమాండ్ చేశారు. మంగళవారం అరుణోదయ కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. ఇవి రెండు ప్రభుత్వాలు జరిపిన హత్యలేనని, ఇందుకు బాధ్యులైన పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 2 రోజుల మహాసభలు విజయవంతమయ్యాయని, పలు డిమాండ్లపై పోరాటానికి నిర్ణయించామని చెప్పారు. మతోన్మాద ఆర్‌ఎస్‌ఎస్ మార్గదర్శకంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని సామ్రాజ్యవాదులకు అమ్మేసే పథకంలో భాగంగా మనువాద బ్రహ్మణవాద మతోన్మాదాన్ని రెచ్చగొట్టి  దళిత, మైనార్టీలపై దాడులకు పాల్పడుతోందన్నారు.

ఆదివాసీలకు స్వయం పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసి వారి ప్రాంతాల్లో వారికే సర్వాధికారానికై  పోరాడాలన్నారు. తెలంగాణలో 30 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పరిచి కార్పొరేట్ శక్తులకు అమ్మే ప్రభుత్వ కుట్రలను, ఇన్నర్, ఔటర్, రీజినల్ రింగ్‌రోడ్ల పేరిట లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములను, వాటిపై ఆధారపడి జీవనం సాగించే గ్రామీణ  ప్రజానీకాన్ని రోడ్డు పాలు చేసే ప్రభుత్వ పథకాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

అరుణోదయ తెలంగాణ, ఆంధ్రా కమిటీలు
మహాసభల్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు తెలంగాణ, ఆంధ్ర కమిటీలను ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ చైర్‌పర్సన్‌గా విమలక్క, అధ్యక్షుడుగా మోహన్ బైరాగి, ఉపాధ్యక్షులుగా నూతన్, లచ్చన్న, కార్యదర్శిగా సురేశ్, సోమయ్య, కోశాధికారిగా యాది, కార్యవర్గ సభ్యులుగా అనిల్, సారుుదా, లింగం, భాస్కర్, నాగరాజు, సాయి ఎన్నికయ్యారు. ఆంధ్రా కమిటీ అధ్యక్షుడుగా బొరుసు వెంకన్న, ఉపాధ్యక్షునిగా పీతామోహర్, ప్రధాన కార్యదర్శిగా డి. కృష్ణ, కార్యదర్శులుగా సుధాకర్, నాగన్న, కోశాధికారిగా సామ్యేలు, కార్యవర్గ సభ్యులుగా రాజు, మణి ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు