‘బయ్యారం ఉక్కు’ మరింత ఆలస్యం

6 Jul, 2016 19:01 IST|Sakshi

బయ్యారంలో ప్రతిపాదించిన ఉక్కు కర్మాగారం ఇప్పట్లో ఆచరణ సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. క్షేత్ర స్థాయి సర్వే నత్తనడకన సాగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. పూర్తి వివరాలివీ..

రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఖమ్మం జిల్లా బయ్యారంలో మూడు మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ద్యం కలిగిన సమీకృత ఉక్కు కర్మాగారం స్థాపనకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) సుముఖత వ్యక్తం చేసింది. అయితే 200 మిలియన్ టన్నుల ముడి ఇనుప ఖనిజం నిక్షేపాలు ఉంటేనే కర్మాగారం ఏర్పాటు సాధ్యమని సెయిల్ స్పష్టీకరించింది. దీనిపై ఏర్పాటైన జాయింట్ టాస్క్‌ఫోర్స్ కమిటీ.. తన నివేదికలో 200 మిలియన్ టన్నుల ముడి ఇనుప ఖనిజం లభించడం అసాధ్యమని ప్రాథమిక నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ముడి ఖనిజం లభ్యతపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించారు.

నత్తనడకన జీఎస్‌ఐ సర్వే
ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని 13 బ్లాకుల పరిధిలో 340 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ముడి ఖనిజం ఉందని మైనింగ్ విభాగం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో.. 240.85 చదరపు కిలోమీటర్ల పరిధిలో ముడి ఇనుప ఖనిజం అన్వేషణకు సరిహద్దులు నిర్ణయిస్తూ సర్వేకు అనుమతి ఇచ్చింది. మొత్తం 13 బ్లాకులుగా ఇనుప ముడి ఖనిజం లభ్యత కలిగిన ప్రాంతాలను విభజించి.. బయ్యారంలోని రెండు బ్లాకుల్లో జీఎస్‌ఐ క్షేత్ర స్థాయి సర్వేను పూర్తి చేసింది.

 

ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రెండు బ్లాకులకు సంబంధించిన సమగ్ర నివేదిక ఇస్తామని జీఎస్‌ఐ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు మిగతా 11 బ్లాకుల్లో సర్వే పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. 2016 మార్చి నాటికే సర్వే పూర్తి చేయాల్సి ఉండగా.. తుది నివేదిక మాత్రం 2017 మార్చికి అందే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటులో జీఎస్‌ఐ నివేదికే కీలకం కావడంతో.. ప్రతిపాదనలు ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు.

 

>
మరిన్ని వార్తలు