‘అప్పుడే హైదరాబాద్‌కు వచ్చేశాను’

17 Sep, 2016 10:18 IST|Sakshi

నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఆ రోజు ఉదయం నుంచే ఆ ఊరి జనం మాట్లాడ్డం మానేశారు. ఒకరితో ఒకరు కాదు.. తమలో తాము కూడా. వీధి అరుగులు నిర్మానుష్యం. ఊరి జనం చుట్టూ చీకటి ఆవరించింది. నిజానికి ఆ రోజు ఆ ఊరికి అది చీకటి రోజే. అయితే ఆ చీకటి దళితవాడది. దళితవాడలో అలుముకున్న ఆ దట్టమైన చీకటి గురించి దళితులు కానీ, దళితేతరులు కానీ నోరువిప్పి మాట్లాడలేని పరిస్థితి. ఆ రోజు ఆ పల్లెలో జరిగిన దారుణం గురించి మాట్లాడితే, ఆ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని నిలదీస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అందుకే అంతా అసలేమీ జరగనట్లుగానే ఉండిపోయారు. అప్పటికి చాలారోజులుగా ఆ ఊరి భూస్వామి పొలంలో పనిచేస్తున్న వ్యక్తి ఆ రోజే శవమయ్యాడు.

ఒంటిమీదఉన్న గాయాలు చెబుతూనే ఉన్నాయి. అది హత్య అని. భూస్వామి కొట్టిన దెబ్బలకే అతడు చనిపోయాడని ప్రతి ఒక్కరికీ తెలుసు. అలా ఒక దారుణం శాశ్వతంగా సమాధిఅవుతున్న తరుణంలో ఆ ఊళ్లోకి ప్రవేశించాడు ఒక న్యాయవాది. ఆ హత్యోదంతాన్నివెలుగులోకి తెచ్చాడు. న్యాయపోరాటంలో విజయం సాధించాడు. ఆయనే ప్రముఖ న్యాయవాది, దళిత హక్కుల ఉద్యమనేత, రచయిత బొజ్జా తారకం. దళిత విద్యార్థినేతగా, హక్కుల ఉద్యమాలకు కేంద్రబిందువుగా, మార్క్సిజాన్ని, అంబేద్కరిజాన్ని మేళవించి ఉద్యమించిన అరుదైన నాయకుడిగా ప్రజలకు చేరువైన ఆ పోరాటయోధుడు శుక్రవారం రాత్రి తనవు చాలించారు. గతంలో సాక్షితో ఆయన పంచుకున్న జ్ఞాపకాల అనుబంధం మరోసారి..       –

‘మాతాత బొజ్జా గోవిందదాసు. అంటరానితనం ఒక మహమ్మారిలా సమాజాన్ని పట్టిపీడిస్తున్న తరుణంలో ఆయన కులాన్ని జయించారు. జీవితంలోని బాధలను,కష్టాలను, కడగళ్లను, వైరాగ్యాన్ని తత్వాల రూపంలో బోధిస్తూ ప్రజలకు చేరువయ్యారు. ఆయన తత్వాలు, పాటలు, బోధనలు అన్ని వర్గాలను, అన్ని కులాలను ఆకట్టుకున్నాయి. మానవత్వాన్ని, మానవసంబంధాల్లోని గొప్పతనాన్ని తన బోధనల ద్వారా చాటుతూకులరహిత సమాజాన్ని కాంక్షించిన వ్యక్తి. మా నాన్న బొజ్జా అప్పలస్వామి. దళితుల భూమికోసం, విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం జీవితాంతం ఉద్యమించిన వ్యక్తి. వీరిద్దరిప్రభావం నాపై చాలా ఉంది.

అంబేద్కర్‌తో కలిసి నాన్న...
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని కందికుప్ప మా ఊరు. మాది మాలపల్లె. దళితుల అజ్ఞానానికి, వెనుకబాటుతనానికి, వారిపై కొనసాగుతున్న అణిచివేత, అంటరానితనానికి కారణం చదువు లేకపోవడం, వాళ్ల చేతుల్లో భూమి లేకపోవడమేనని గ్రహించిన మా నాన్న‘ఆదిఆంధ్ర’ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దళితుల చదువుల కోసం పిఠాపురంమహారాజా వారి సహాయ సహకారాలు, అంటరానితనానికి వ్యతిరేకంగా రఘుపతివెంకటరత్నంనాయుడు నేతృత్వంలో పనిచేసిన బ్రహ్మసమాజం మా నాన్నకు స్ఫూర్తిప్రదాతలు. ఈ క్రమంలోనే ఆయన లంక భూములు దళితులకే దక్కాలనేలక్ష్యంతో కోనసీమలో  భూపోరాటాలు చేపట్టారు. 1942లో కాకినాడ పర్యటనకు విచ్చేసిన అంబేద్కర్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి అంబేద్కర్‌తో కలిసి పనిచేశారు. ఆల్‌ ఇండియా ఎస్సీ ఫెడరేషన్‌జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు.

1952లో ఫెడరేషన్‌ నుంచిపోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. దళితుల కోసం పోరాడే క్రమంలో సహజంగానే అగ్రవర్ణాలతో ఘర్షణలు, కొట్లాటలు తప్పలేదు. సరిగ్గాఇలాంటి వాతావరణంలోనే నేను పుట్టి పెరిగాను. నా చదువంతాకాకినాడలోనే సాగింది. మెక్‌లారిన్‌ హైస్కూల్లో, పీఆర్‌ కాలేజీలోచదువుకున్నాను. అంటరానితనానికి వ్యతిరేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవాళ్లం. కాలేజీలో బీఏ చదువుతున్నరోజుల్లో చుట్టుపక్కల ఊర్లలో నాటకాలు వేసేవాళ్లం, పాటలుపాడుతూ ప్రజల్ని చైతన్యవంతం చేసేవాళ్లం. ఆ విద్యార్థి ఉద్యమానికినేను నాయకుడిని. ఎస్సీ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశా. ఆ రోజుల్లోనే ఎస్సీ విద్యార్థుల సమస్యలపై 30 రోజుల పాటు పెద్దఎత్తున ఆందోళన చేసి సమస్యలను పరిష్కరించుకున్నాము.

చీకటి రోజుల్లో..
ఆభూపోరాటం తరువాత నిజామాబాద్‌లో జరిగిన అనేక పోరాటాల్లో అంబేద్కర్‌ యువజన సంఘం, రైతుకూలి సంఘం కలిసి పనిచేశాయి. స్వతహాగా రచయితనైన నేనువిరసంలో చేరాను. చైనా–ఇండియా ఫ్రెండ్‌షిప్‌ అసోసియేషన్‌లోనూ, పౌరహక్కుల సంఘంలోనూ క్రియాశీలకమైన బాధ్యతలు చేపట్టాను. ఈ  క్రమంలోనే ఎమర్జెన్సీ చీకటి రోజులు వచ్చాయి. నిజామాబాద్‌లో ఉండగానే నన్ను పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఏడాది పాటు జైలు జీవితం. ఆ రోజుల్లోనే ‘నది పుట్టిన గొంతుక’ కవిత్వం రాశాను. ‘పోలీసులు అరెస్టు చేస్తే’ అనే పుస్తకం కూడారాశాను. ఒక విప్లవకారుడి జీవితాన్ని నవలగా అక్షరీకరించాను. కానీ జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడుదాన్ని తీసుకురావడం సాధ్యపడలేదు. ఎమర్జెన్సీ తరువాత వచ్చిన ఎన్నికల్లో  నిజామాబాద్‌ నియోజకవర్గంనుంచి సీపీఐ(ఎంఎల్‌) మద్దతుతో పోటీ చేశాను. కానీ ఓడిపోయాను.

అప్పుడే  హైదరాబాద్‌కు వచ్చేశాను. ఎమర్జెన్సీకి ముందు, తరువాత జరిగిన అన్ని కుల వివక్ష వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. పదిరికుప్పం, కారంచేడు నుంచిలక్షింపేట ఘటన వరకు అన్ని ఆందోళనల్లో నేను ఉన్నాను. దళితుల ఊచకోత జరిగినా.. ఎన్‌కౌంటర్‌ పేరిట పోలీసులు నక్సలైట్లను హతమార్చినా.. ఒక నిజనిర్ధారణ కమిటీని వేసి అది ఇచ్చే నివేదిక ఆధారంగా ఉద్యమ నిర్మాణం చేపట్టాము. ఒకసారిహయత్‌నగర్‌ సమీంపలోని ఊర్లో ఒక దళిత వర్గానికి చెందిన కుర్రాడ్ని చంపి పొలంలో పాతిపెట్టారు. అంబేద్కర్‌ యువజనసంఘం ఈ దారుణాన్ని నా దృష్టికి తెచ్చింది. నేను వెళ్లి శవాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం చేయించాను. అలా పాతిపెట్టినశవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేసిన సంఘటన రాష్ట్రంలో అదే మొదటిది. అప్పట్లో ఇదొక పెద్ద సంచలనం.

లాయర్‌ అవుతాననుకోలేదు...
బీఏ(మ్యాథ్స్‌) చదివిన నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ (మ్యాథ్స్)లో చేరాలనిహైదరాబాద్‌ వచ్చాను. అప్పటికి మా నాన్న ఎమ్మెల్యేగా ఇక్కడే ఉంటున్నారు. ఎంఏలో సీటురాలేదు. దాంతో నగరం నుంచి తిరిగి వెళ్లడం ఇష్టం లేక ఎల్‌ఎల్‌బీలో చేరాను. చదువు పూర్తయిన తరువాత తిరిగి కాకినాడకు వెళ్లిపోయాను. అక్కడే లాయర్‌గా ప్రాక్టీస్‌ ప్రారంభించాను.కానీ ఎంతో కాలం కొనసాగలేదు. 1968లో విజయభారతి(బోయి భీమన్న కుమార్తె)తో వివాహమైంది. ఆమె నిజామాబాద్‌ ఉమెన్స్‌ కాలేజీలో లెక్చరర్‌. అలా నిజామాబాద్‌ వచ్చేశాను. నిజామాబాద్‌లో ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన మొట్టమొదటి ఎస్సీ లాయర్‌ను నేను. అలాంటి రోజుల్లోపాలెం అనే ఊర్లో ఆ ఊరి భూస్వామి తన దగ్గర పని చేసే వ్యక్తిని కొట్టి చంపాడు. దీనిపైఎవ్వరూ నోరు మెదప లేదు. అందరూ భయపడ్డారు.

‘ఇలాంటి దారుణాలను ప్రశ్నించకపోతే,దోషులకు శిక్షపడకపోతే మరిన్ని సంఘటనలు జరుగుతాయి. అమాయకులైన దళితులు బలవుతారు.’ అనే ఆలోచన నాలో కలిగింది. వెంటనే నిజామాబాద్‌లోనే ఒకలారీ మాట్లాడుకొని, నాకు తెలిసిన 50 మందివిద్యార్థులను వెంటేసుకొని పాలెం బయలుదేరాను. ఆ ఊరి దళితులు చాలా భయపెట్టారు. వెనుదిరిగివెళ్లమన్నారు. ఆ భూస్వామి చంపేస్తాడని హెచ్చరించారు. నా వెంట వచ్చిన వాళ్లకు కూడా భయం మొదలైంది. ‘చావాల్సి వస్తే మొట్టమొదట నేను చస్తాను. మీరేం భయపడొద్దు రండి’అన్నాను. ఊర్లో ర్యాలీ ప్రారంభించాము. ఆ హత్యనునిరసిస్తూ పెద్దఎత్తున నిరసన సభ నిర్వహించాము.

అప్పటి వరకు భయంగా ఉన్నదళితులంతా కదిలి వచ్చారు. ఈ సంఘటన వారికి గొప్ప ఆత్మసై్థర్యాన్నిచ్చింది. ఆభూస్వామిపై న్యాయపోరాటానికిదిగాము. ఒకవైపు ఈ పోరాటం కొనసాగుతుండగానే మరోవైపు ‘అంబేద్కర్‌యువజన సంఘాన్ని’ స్థాపించి అగ్రవర్ణాల దౌర్జన్యాలు, అణచివేతలకు వ్యతిరేకంగా, అంటరానితనం నిర్మూలనేలక్ష్యంగా పోరాటాలు చేశాం. జిల్లాఅంతటా అంబేద్కర్‌ యువజన సంఘంకార్యకలాపాలు విస్తరించాం.

వర్గకుల పోరాటాల్లో..
దోపిడీ, పీడన, అసమానతలు అంతరించిపోవాలంటే వర్గ, కులపోరాటాలు రెండూ ముఖ్యమైనవని ఆర్మూర్‌ ‘పచ్చల్‌నడుకుడ’ భూపోరాటంనిరూపించింది. రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని దళితులు, వెనుకబడిన వర్గాలకుపంపిణీ చేసేందుకు ఈ పోరాటం చేపట్టాం. భూమి ఆ ఊరి అగ్రకులాలకు చెందిన వ్యక్తుల చేతుల్లోఉంది. దానిని మేం స్వాధీనం చేసుకుని సాగులోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున పోరాడాల్సి వచ్చింది. ఈక్రమంలో అంబేద్కర్‌ యువజన సంఘంతో కలిసి పనిచేసేందుకు సీపీఐ(ఎంఎల్‌) అనుబంధ రైతుకూలిసంఘం ముందుకు వచ్చింది. పోరాటం నడిచే రోజుల్లో ఎస్సీలు ఒక చోట, బీసీలు ఒక చోట వేరువేరుగా కూర్చొని మధ్యాహ్న భోజనాలు చేసేవారు.

పోరాటం కొనసాగిన కొద్దీ వాళ్ల మధ్య సంబంధాలు బలపడ్డాయి. ఒకే చోట కలిసి కూర్చోవడంతో మొదలైంది. ఆ తరువాత ఒకరి కూరలు ఒకరువడ్డించుకున్నారు. కలిసి అన్నం తిన్నారు. ఆ తరువాత అక్కడే వంటలు చేసుకొని భోజనాలు చేయడంతో ఎస్సీలు, బీసీలు ఒక్కటయ్యారు. ఇండియాలో విప్లవం విజయవంతం కావాలంటే మార్క్సిజంఎంత కీలకమైందో అంబేద్కరిజం కూడా అంతే కీలకమైందన్న నా అవగాహన ఈ ఒక్క సంఘటనలోనే కాదు.. ఆ తరువాత అనేక సంఘటనల్లోనూ రుజువైంది.

‘పోలీసులు అరెస్ట్‌ చేస్తే’...

ఎమర్జెన్సీలో రాసిన ‘పోలీసులు అరెస్ట్‌ చేస్తే..’ పుస్తకం1980 తరువాత పబ్లిష్‌ అయింది. హక్కుల ఉద్యమానికిఅది మార్గదర్శకంగా నిలిచింది. ప్రతి ఒక్కరికిప్రశ్నించడం నేర్పించింది. ఆ పుస్తకం ప్రజల చేతుల్లోకి వెళ్లకుండా పోలీసులు 40 వేల కాపీలనుతగలబెట్టారు. ‘కమాండో’పబ్లిషర్స్‌ దగ్గరఉన్న మరో 30 వేల కాపీలను కొనుగోలు చేశారు. ఎవరి దగ్గరైనా ఆ పుస్తకం కనిపిస్తే చాలు కేసులు పెట్టేవాళ్లు. దాంతో ఆ పుస్తకాన్ని చాలా రహస్యంగా చదవాల్సి వచ్చేది.

మరిన్ని వార్తలు