'గ్రేటర్' మేయర్‌గా బొంతు రామ్మోహన్

11 Feb, 2016 10:45 IST|Sakshi
'గ్రేటర్' మేయర్‌గా బొంతు రామ్మోహన్

హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్‌గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్ లకు పట్టం కట్టడం ఖాయమైంది. జీహెచ్‌ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో టీఆర్‌ఎస్ ఏకంగా 99 స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో... మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెండూ ఆ పార్టీకే దక్కాయి. చర్లపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా బొంతు రామ్మోహన్‌, బోరబండ కార్పొరేటర్ గా ఫసియుద్దీన్‌ గెలుపొందారు.

కార్పొరేటర్లతో కేటీఆర్ ప్రత్యేక భేటీ
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల బాధ్యతలు కూడా తీసుకున్న మంత్రి కేటీఆర్... టీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో గురువారం ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని అన్నీ తానై వ్యవహరించిన కేటీఆరే మేయర్ ఎన్నికల బాధ్యతను కూడా చూసుకున్నారు. సీఎం కేసీఆర్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పేర్లను ఖరారు చేయగా కార్పొరేటర్ల సమావేశంలో కేటీఆర్ వారి పేర్లను ప్రకటించారు. గ్రేటర్ మేయర్‌గా రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్ పేర్లను మంత్రి జగదీష్ రెడ్డి ప్రతిపాదించగా, కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ' ౩ నెలల్లో స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తాం. వచ్చే 3 నెలల్లో జీహెచ్ఎంసీలో పదవులు అన్నీ భర్తీ చేస్తాం. ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు ముందుండాలి' అని అన్నారు. భేటీ తర్వాత కార్పొరేటర్లంతా జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు.

మరిన్ని వార్తలు