తగ్గని ఉల్లి ధర

21 Nov, 2023 08:21 IST|Sakshi

హైదరాబాద్: ఉల్లి గడ్డ ధర సామాన్యులను కంగుతినిపిస్తోంది. దాదాపు నెల రోజులుగా కిలో రూ.60 నుంచి 70 పైనే ఉంది. దీంతో రేటు తగ్గుతుందని ఎదురు చూస్తున్న మధ్యతరగతి ప్రజలు నిరాశ చెందుతున్నారు. వాస్తవంగా కొత్త పంట వస్తుండడంతో రేటు తగ్గుతుందని భావించినా పరిస్థితి మారలేదు. దీనికి కారణం కమీషన్‌ ఏజెంట్ల, వ్యాపారుల మాయాజాలం కూడా కారణమని ఆరోపణలు విన్పిస్తున్నాయి. 

 వీరంతా ఒక్కటై ఉల్లి కృత్రిమ కొరత సృష్టిస్తూ ఉల్లి ధరలు పెంచేస్తున్నారని అంటున్నారు. తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ నుంచి కూడా మలక్‌పేట్‌ మార్కెట్‌కు ఉల్లిగడ్డ దిగుమతి పెరిగింది. రోజుకుదాదాపు 70–80 లారీల ఉల్లి  దిగుమతి అవుతోంది. గతేడాది నవంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది లారీ సంఖ్య ఎక్కువగా ఉందని మలక్‌పేట్‌ మార్కెట్‌ లెక్కలు చెబుతున్నాయి.  గతేడాది ఇప్పటికే ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. కానీ ఈ ఏడాది నగరానికి ఉల్లి రాక పెరిగినా ధరలు మాత్రం తగ్గడం లేదని రిటైల్‌  వ్యాపారులు అంటున్నారు. 

గతేడాది నవంబర్‌లో కిలో ఉల్లిగడ్డ ధర రూ.30 ఉండగా ఈ ఏడాది రూ.60 పైనే పలుకుతోంది. వారం రోజులుగా మహారాష్ట్ర నుంచి భారీగా ఉల్లి సరఫరా పెరిగింది. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు మహారాష్ట్ర వ్యాపారులతో కలిసి సిండికేట్‌గా మారి ఉల్లి ధరలు తగ్గించడం లేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.  జంట నగరాల మార్కెట్‌లలో ఉల్లిగడ్డ నిల్వచేయడానికి తగిన గోదాముల వసతి లేక పోవడంవల్లే ఈ పరిస్థితి వస్తోందని వారంటున్నారు. 

మరిన్ని వార్తలు