చికిత్స పొందుతున్న ముస్తఫా మృతి

9 Oct, 2014 09:57 IST|Sakshi

హైదరాబాద్ : మిలిటరీ గ్రౌండ్‌లో ఆడుకోడానికి వెళ్లిన బాలుడిపై దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనలో  తీవ్రంగా గాయపడ్డ ముస్తఫా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందటంతో మోహదీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. మెహిదీపట్నం మిలిటరీ ప్రాంతంలోని సిద్దిఖీనగర్ బస్తీలో నివాసం ఉంటున్న షేక్ ముఖీదుద్దీన్, షాకేరాబేగంలకు నలుగురు సంతానం. వీరిలో ముస్తఫా (12) ఫస్ట్ లాన్సర్‌లోని మదర్సాలో చదువుకుంటున్నాడు.

 బక్రీద్ కు సెలవు ఉండడంతో బుధవారం తన స్నేహితులతో కలసి సమీపంలోని మిలిటరీ గ్రౌండ్‌లో ఆడుకోడానికి వెళ్లాడు. అక్కడ ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ముస్తఫాను ఓ గదికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. మంటల్లో కాలుతున్న ముస్తఫా మైదానంలోకి పరుగెత్తి రక్షించండంటూ కేకలు వేశాడు. విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి.. ముస్తఫాను నానల్‌నగర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకు అక్కడ నుంచి సంతోష్‌నగర్‌లోని అపోలో డీఆర్‌డీఓ ఆసుపత్రికి తరలించారు. మృత్యువుతో పోరాడుతూ ముస్తఫా ఈరోజు ఉదయం చనిపోయాడు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొటంతో మిలటరీ క్యాంప్ ఎదుట పోలీసులు మోహరించారు. మరోవైపు  బాలుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించారని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మిలిటరీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము విచారణ జరిపామని, అందులో తమ సిబ్బంది హస్తం లేదని తేలిందన్నారు.

(ఇంగ్లీష్ కథనం కోసం)

>
మరిన్ని వార్తలు