చోరీ అయిన సెల్‌ ఫోన్ల రికవరీలో టాప్‌లో అనంతపురం జిల్లా..!

12 Dec, 2023 07:37 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లను పరిశీలిస్తున్న ఎస్పీ అన్బురాజన్‌. అవార్డు అందుకుంటున్న కుందుర్పి కానిస్టేబుల్‌ అనిల్‌

రూ.71 లక్షలు విలువ చేసే 385 సెల్‌ఫోన్ల స్వాధీనం

ఇప్పటి వరకూ రూ.13.13 కోట్ల విలువ చేసే 8,010 ఫోన్ల రికవరీ

ఎస్పీ అన్బురాజన్‌ వెల్లడి

అనంతపురం క్రైం: చోరీ జరిగిన, సొంతదారు పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల రికవరీలో జిల్లా పోలీసులు అగ్రస్థానంలో నిలిచారని ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. చాట్‌బాట్‌ సేవలు అందుబాటులో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ జిల్లాలో రూ.13.13 కోట్లు విలువ చేసే 8,010 సెల్‌ఫోన్లు రికవరీ చేసి సొంతదారులకు అందజేసినట్లు వివరించారు.

ఇటీవల వివిధ కేసుల్లో పోలీసులు రికవరీ చేసిన రూ.71 లక్షలు విలువ చేసే 385 సెల్‌ఫోన్లను జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో సంబంధీకులకు సోమవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపీలోని 9 జిల్లాలు, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌కు చేతులు మారిపోయిన సెల్‌ఫోన్లను కూడా రికవరీ చేసినట్లు వివరించారు.

పాత ఫోన్లు కొనొద్దు
ఫోన్‌లు కొనుగోలు చేసే వారెవరైనా పాత ఫోన్‌లను కొనకపోవడం మంచిదని ఎస్పీ అన్బురాజన్‌ సూచించారు. అపరిచిత వ్యక్తుల నుంచి అస్సలు కొనుగోలు చేయరాదన్నారు. పరిచయస్తుల ద్వారా కొనుగోలు చేస్తే ఫోన్‌కు సంబంధించిన బాక్స్‌తో పాటు బిల్లు తప్పక తీసుకోవాలన్నారు.

ఫోన్‌ తక్కువ ధరకు వస్తుందని ఆశపడి కొనుగోలు చేస్తే అనవసరంగా పోలీసు కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఫోన్లు చోరీకి గురైనా, కనపడకుండా పోయినా సీఈఐఆర్‌ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్లు విక్రయిస్తున్న అపరిచత వ్యక్తులపై అనుమానం వస్తే వెంటనే 94407 96800కు సమాచారం అందించాలని కోరారు.

పోగొట్టుకున్న డబ్బు ఖాతాలో పడుతుంది
బ్యాంక్‌ ఖాతాలోని సొమ్మును సైబర్‌ నేరగాళ్లు కాజేస్తే వెంటనే 1930 నంబరుకు ఫోన్‌ చేయడం ద్వారా గంట వ్యవధిలోనే ఆ డబ్బు తిరిగి బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతుందని ఎస్పీ వివరించారు. 1930 పేవలను సకాలంలో వినియోగించుకోవాలన్నారు. అన్ని యాప్‌లకు గుడ్డిగా అనుమతులివ్వకూడదన్నారు.

‘పోలీసు స్పందన’కు 128 వినతులు
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 128 వినతులు అందాయి. ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌బీ సీఐ ఇందిర, దిశ సీఐ చిన్నగోవిందు, ఎస్‌ఐ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీకి కృతజ్ఞతలు
రౌడీ మూకలు కబ్జా చేసిన తమ స్థలాలను తిరిగి స్వాధీనం చేసేందుకు ఎస్పీ అన్బురాజన్‌ చూపిన చొరవను అభినందిస్తూ 73 మంది బాధితులు సోమవారం ఆయనను కలసి కృతజ్ఞతలు తెలిపారు. తమలో చాలా మంది ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులుగా ఉన్నామని, ఉద్యోగ విరమణ సమయంలో అందిన డబ్బుతో స్థలాలు కొనుగోలు చేసినట్లు వివరించారు.

వీటిని కొందరు రౌడీ మూకలు కబ్జా చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ స్థలాలు తిరిగి స్వాధీనం చేసిన ఎస్పీ అన్బురాజన్‌ సేవలను మరిచిపోలేమంటూ సన్మానం చేశారు. కాగా, మొత్తం ఈ వ్యవహారంలో బాధితుల పక్షాన నిలిచి పోరాటం చేసిన నూర్‌బాషాకే సన్మానం పొందే అర్హత ఉందని, ఎస్పీ ప్రతిగా ఆయనకు సన్మానం చేశారు.

కానిస్టేబుల్‌కు అవార్డు
కుందుర్పి:
సైబర్‌ క్రెం కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరచిన కుందుర్పి పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ అనిల్‌ను ఎస్పీ అన్బురాజన్‌ అభినందించారు. కళ్యాణదుర్గం డివిజన్‌ పరిధిలో ఇటీవల చోరీకి గురైన సెల్‌ఫోన్ల రికవరీలో అనిల్‌ చూపిన చొరవను అభినందిస్తూ సోమవారం డీపీఓలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ అభినందిస్తూ అవార్డు అందజేశారు.

>
మరిన్ని వార్తలు