బస్సే నైట్ షెల్టర్

28 Jan, 2014 02:00 IST|Sakshi
  •   జీహెచ్‌ఎంసీ తాత్కాలిక ఏర్పాట్లు
  •   ముందుకొచ్చిన ఆర్టీసీ
  •  
    సాక్షి, సిటీబ్యూరో: రాత్రి వేళల్లో నిలువ నీడ లేకుండా రోడ్లపైన, ఫుట్‌పాత్‌లపైన , ఎక్కడ పడితే అక్కడ నిద్రిస్తున్న వారికి అవసరమైనన్ని నైట్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది జీహెచ్‌ఎంసీ. అవి అందుబాటులోకి వచ్చేలోగా ఆర్టీసీ బస్సులనే నైట్ షెల్టర్లుగా మార్చనుంది. ఇందుకు ఆర్టీసీ కూడా జీహెచ్‌ఎంసీతో చేతులు కలిపింది. తొలుత రెండు బస్సులను ఇందుకు వినియోగించేందుకు ఆర్టీసీ ఎండీ అంగీకరించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ‘ప్రజావాణి’ అనంతరం కమిషనర్ విలేకరులతో మాట్లాడారు.

    ఈ బస్సుల్లోని సీట్లను తొలగించి, వాటిల్లో నిద్రించే ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. వీలైనన్ని నైట్‌షెల్టర్లను... వీలైనంత త్వరితంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వచ్చే శీతాకాలంలోగా బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ నిద్రించకుండా అవసరమైనన్ని నైట్ షెల్టర్లు అందుబాటులోకి తెస్తామన్నారు. బస్సులను బయట నిద్రిస్తున్నవారు అధికంగా ఉన్న ప్రాంతాల్లోకి పంపుతామన్నారు. వీరి అవసరాల కోసం మొబైల్ టాయ్‌లెట్లను కూడా అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు.
     
     ఇంకా...
     బీటీ రెండో ఫేజ్ పనులకు రూ.12 కోట్లు మంజూరు చేశామని, బీటీ రోడ్లు,  డీసిల్టింగ్ పనులకు సంబంధించి రెండు మూడు రోజుల్లో టెండర్లు పూర్తవుతాయని, వేసవిలోనే డీసిల్టింగ్ పనుల్ని పూర్తి చేస్తామని కమిషనర్ చెప్పారు.   
     
     ఎవరినీ ఇబ్బంది పెట్టకుండానే ఆస్తి పన్ను వసూళ్లు చేయాలనేది లక్ష్యమని, హెచ్చరించినా నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై మాత్రం చర్యలు తప్పవన్నారు.
     
     ఈ ఆర్థిక సంవత్సర వసూళ్ల లక్ష్యం రూ.1000 కోట్ల- రూ.1250 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.538 కోట్లు వసూలైందని, గత సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.70 కోట్లు అదనమన్నారు.
     
     ఆస్తిపన్ను చెల్లించినంత మాత్రాన అక్రమ భవనం సక్రమం కాదన్నారు. అక్రమ భవనాల ఆస్తి పన్నును అసెస్ చేసే అధికారులపై చర్యలు తగదని ప్రభుత్వానికి లేఖ రాశామని, దీనిపై స్పష్టతనిస్తూ ప్రభుత్వం త్వరలోనే జీవో జారీ చేస్తుందన్నారు.  
     
     రోడ్డు కటింగ్‌లకు అనుమతులివ్వడం లేదని తెలిపారు.
     
     కొత్తగా 20 ఫిర్యాదులు...
     ‘ప్రజావాణి’కి మొత్తం 47 ఫిర్యాదులు రాగా, వీటిల్లో 20 మాత్రమే కొత్తవి. మిగతావి పాత ఫిర్యాదులే. అవి పరిష్కారం కాకపోవడంతో ప్రజలు మళ్లీ ఫిర్యాదు చేశారు.

     కొత్త బడ్జెట్‌పై ఆందోళన వద్దు...
     ‘వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2014-15) సంబంధించిన బడ్జెట్ స్టాండింగ్ కమిటీ, సర్వసభ్య సమావేశాల్లో ఇంకా ఆమోదం పొందకపోయినా ఆందోళన చెందాల్సిన పని లేదు. జీహెచ్ ఎంసీ చట్టంలో దీనిపై స్పష్టత లేదు. ఈ అంశంపై ప్రభుత్వానికి ఇప్పటికే రెండు లేఖలు రాశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటాం’ అని కమిషనర్ చెప్పారు.
     

మరిన్ని వార్తలు