శాస్త్రీయంగా దర్యాప్తు సాగుతోంది

15 Nov, 2016 01:19 IST|Sakshi
శాస్త్రీయంగా దర్యాప్తు సాగుతోంది

‘ఓటుకు కోట్లు’ కేసులో హైకోర్టుకు ఏసీబీ న్యాయవాది నివేదన
ఇది హైప్రొఫైల్ కేసు.. ఎలాపడితే అలా చేయలేం
ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో దర్యాప్తు చేస్తున్నాం
కనీస సమాచారం తెలుసుకోకుండానే ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్య
విచారణను నేటికి వాయిదా వేసిన న్యాయమూర్తి

సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో తమ దర్యాప్తు ఓ పద్ధతి ప్రకారం, శాస్త్రీయంగా సాగుతోందని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తరఫు న్యాయవాది వి.రవికిరణ్‌రావు హైకోర్టుకు నివేదించారు. ఇది హైప్రొఫైల్ కేసు అని, కాబట్టి శాస్త్రీయ ఆధారాలతో పకడ్బందీగా దర్యాప్తు పూర్తి చేయాల్సిన బాధ్యత ఏసీబీపై ఉందని చెప్పారు. యాంత్రికంగా చేయడానికి ఇది ఆషామాషీ కేసు కాదని.. ‘ఓటుకు కోట్లు’ కేసు దర్యాప్తును నిలిపేశామన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి వాదనల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందో తమను అడిగితే చెప్పే వారమని.. కనీస సమాచారం కూడా తెలుసుకోకుండానే ఆయన ఏసీబీ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారని వివరించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు నివేదించారు. క్రిమినల్ కేసుల్లో ఆ కేసుతో సంబంధం లేని థర్డ్ పార్టీల (ఇతరుల) జోక్యం తగదని పేర్కొన్నారు.

సుప్రీం ఆదేశాల నేపథ్యంలో..
‘ఓటుకు కోట్లు’ కేసులో దర్యాప్తు సక్రమంగా సాగడం లేదంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదు చేయగా.. వేగంగా దర్యాప్తు చేయాలని కోర్టు ఏసీబీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైకోర్టును ఆశ్రరుుంచారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఏసీబీ కోర్టు ఆదేశాల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో తుది విచారణ జరపాలంటూ హైకోర్టును ఆదేశించింది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి విచారణ ప్రారంభించారు. అందులో భాగంగా ఏసీబీ తరఫున రవికిరణ్‌రావు సోమవారం తన వాదనలు వినిపించారు. ప్రజా ప్రయోజనాల కోసమే పిటిషన్ దాఖలు చేశామని రామకృష్ణారెడ్డి చెబుతున్నారని.. కానీ ఇందులో ప్రజా ప్రయోజనాలకన్నా ఇతర కారణాలే ఎక్కువగా ఉన్నాయని హైకోర్టుకు వివరించారు. రాజకీయ కారణాలతోనే ఫిర్యాదు దాఖలు చేసినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. కేసుతో సంబంధం లేని వాళ్లను, ప్రజా ప్రయోజనాలతో దాఖలు చేశామని చెబుతున్న వాళ్లను ప్రోత్సహిస్తూ పోతే కోర్టు ప్రక్రియ దుర్వినియోగం అవుతుందని వ్యాఖ్యానించారు.

ఇటువంటి వాళ్లను చూసి రేపు వంద మంది వచ్చే అవకాశముందని.. తాము ఏం చేశామో తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. రహస్యంగా ఉండాల్సిన 164 స్టేట్‌మెంట్లు ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎలా అందాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇటువంటి వారి ఫిర్యాదులను విచారించేటపుడు అసలు ఏ ఉద్దేశంతో ఫిర్యాదు దాఖలు చేశారో కోర్టులు క్షుణ్నంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అరుుతే అప్పటికే కోర్టు పనివేళలు ముగియడంతో తదుపరి విచారణ మంగళవారానికి వారుుదా పడింది.

మరిన్ని వార్తలు