ఐటీ కారిడార్..హైటెక్ బెగ్గింగ్..!

18 Aug, 2016 18:32 IST|Sakshi

- అనాధాశ్రమం ముసుగులో బిక్షాటన
- 19 మంది పిల్లలకు విముక్తి , నిర్వాహకుడి అరెస్టు

గచ్చిబౌలి

పిల్లలకు విద్యా బుద్దులు నేర్పిస్తాని తెచ్చి బిక్షగాళ్లుగా మార్చిన ఘటన ఐటీకారిడార్ గచ్చిబౌలిలో వెలుగు చూసింది. ఐటీ కారిడార్‌లోని ప్రధాన కూడళ్లలో భిక్షాటన చేయిస్తున్న అనాధాశ్రమం నిర్వాహకుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ జూపల్లి రమేశ్ కుమార్ తెలిపిన ప్రకారం..కొమ్మవరం గ్రామం, ఇల్లెందు మండలం ఖమ్మం జిల్లాకు చెందిన మాలిపెద్ది జేమ్స్(36) ఆర్సీపురం మండల పరిధిలోని అమీన్‌పూర్‌లో 2012లో బ్రహ్మపుత్ర అనాధాశ్రమం నెలకొల్పాడు. నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలోని పేద కుటుంబాలకు చెందిన పిల్లలను మంచి చదువులు చదివిస్తానని చెప్పి అనాధాశ్రమానికి తీసుకొచ్చాడు. స్థానికంగా జడ్పీహెచ్‌ఎస్, అర్నాల్డ్ హైస్కూల్‌లో విద్యార్థులను చేర్పించాడు.


ఈ క్రమంలో ఈ నెల 16న కొండాపూర్, కొత్తగూడ జంక్షన్‌లో మోహన్ , శివ, కార్తీక్, అఖిల, వెంకటేశ్‌లచే భిక్షాటన చేయించాడు. బుధవారం  ట్రిపుల్ ఐటీ జంక్షన్, టీసీఎస్ కంపెనీ ముందు జెర్కిన్ ధరించి, డొనేషన్ బాక్స్‌లతో అడుక్కుంటున్నఇద్దరు అమ్మాయిలు, అబ్బాయిలను బీట్ కానిస్టేబుల్ గమనించాడు. వారిలో ఇద్దరి దగ్గరకు పిలిచి డొనేషన్ ఎందుకు అని ఆరా తీశారు. దీంతో పిల్లలు తాము అనాధాశ్రమం నుంచి వచ్చామని.. జేమ్స్ చెప్పడంతో డబ్బులు అడుగున్నామని చెప్పారు. పోలీసులు జేమ్స్ ఎక్కడ అని అడగగా... రోడ్డు కు అవతలి వైపు ఉన్నాడని చెప్పారు. అప్పటికే జేమ్స్ అక్కడి నుంచి జారుకోవడంతో.. పోలీసులు చైల్డ్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేశారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఆర్‌సీపురం పోలీసుల సహకారంతో గచ్చిబౌలి పోలీసులు, చైల్డ్ వెల్‌ఫేర్ డైరెక్టర్ చందు బ్రహ్మపుత్ర ఆశ్రమంపై దాడి చేశారు.

19 మందికి విముక్తి
అమీన్‌పూర్‌లోని బ్రహ్మపుత్ర అనాధాశ్రమంపై దాడి చేసి 19 మంది బాలబాలికలకు విముక్తి కల్గించారు. వీరిలో 5గురు అమ్మాయిలు కాగా 14 మంది అబ్బాయిలున్నారు. ఒక విద్యార్థికి ఆరోగ్యం బాగాలేక పోవడంతో జేమ్స్ ఇటీవల ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. వీరందరికీ.. అమీన్‌పూర్‌లోని మహిమ ఫౌండేషన్‌లో ఆశ్రయం కల్పించారు. జేమ్స్ పై జువెనైల్ యాక్ట్ 76(1), బెగ్గింగ్ యాక్ట్ 27, ఐపీసీ 420 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


ఖర్చు భరించలేకే భిక్షాటన: జేమ్స్
దాతలు సహకారంతోనే బ్రహ్మపుత్ర అనాధాశ్రమం నడిపిస్తున్నానని నిర్వాహకులు ఎం.జేమ్స్ తెలిపారు. ఆర్నాల్డ్ హైస్కూల్‌లో చదివించే విద్యార్థులకు ఫీజు చెల్లించలేని పరిస్థితులలో చిన్నారులచే భిక్షాటన చేయించానని ఆయన పేర్కొన్నారు. ఆలా చేయించడం తప్పేనని ఒప్పు కున్నాడు.

మరిన్ని వార్తలు