షాదాబ్‌లో బిర్యానీ.. ఎంజే మార్కెట్‌లో ఐస్‌క్రీం..

19 Nov, 2023 04:58 IST|Sakshi

రుచి చూసిన రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ 

ప్రొటోకాల్‌ సెక్యూరిటీ లేకుండానే పాతబస్తీలో పర్యటన

చార్మినార్‌: రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారంరాత్రి ఉన్నట్టుండి పాతబస్తీలో సందడి చేశారు. ఎలాంటి ప్రొటోకాల్‌ సెక్యూరిటీ లేకుండా ఆ ప్రాంతంలో పర్యటించి స్థానికులను ఆశ్చర్యపరిచారు. మదీనాలోని షాదాబ్‌ హోటల్‌కు వచ్చిన ఆయన ముందుగా ఇరానీ ఛాయ్‌ ఆర్డర్‌ ఇచ్చారు. ఆర్డర్‌ తీసుకుంటున్న వెయిటర్‌ కేటీఆర్‌ను గుర్తుపట్టి సార్‌.. ఆప్‌ మినిస్టర్‌ సాబ్‌ హై.. నా (సార్‌.. మీరు మినిస్టర్‌ గారు కదా..) అంటూ ప్రశ్నించే లోపే అందరి దృష్టి ఇటువైపు పడింది. వెంటనే స్పందించిన హోటల్‌ యాజమాన్యం కేటీఆర్‌ను ఏసీ రూంకు తీసుకెళ్లి అక్కడ బిర్యానీ ఆర్దర్‌ఇచ్చారు.

బిర్యానీ రుచిచూసిన అనం తరం ఆయన ఇరానీ ఛాయ్‌ తాగారు. హోటల్‌ సిబ్బందితోపా టు పలువురు కస్టమర్లు కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకున్నా రు. ఈ సందర్భంగా అక్కడున్నవారిని ఆయన ఆప్యాయంగా పలకరించారు. ‘చికెన్‌ బిర్యానీ తిన్నారా.. ఇక్కడ భలే ఉంటుంది కదా, బిర్యానీ..’అంటూ ఇద్దరు చిన్నారులతో మంత్రి ముచ్చటించారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ నాయకులు అక్కడికి చేరుకుని కేటీఆర్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు.

అంతకుముందు మొజంజాహీ మార్కెట్‌లోని ఐస్‌క్రీం రిఫ్రెష్‌మెంట్‌ ఏరియాలోకి వెళ్లి ఐస్‌క్రీం తిన్నారు. ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా తిరుగుతున్న కేటీఆర్‌ శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా పాతబస్తీలో కాసేపు కాలక్షేపం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలలో తమపార్టీ విజయం తథ్య మని ధీమా వ్య క్తం చేశారు.  

మరిన్ని వార్తలు