వారసులకు ‘హోం’ సిక్‌

19 Nov, 2023 05:01 IST|Sakshi

రాజకీయాల్లో ఉనికి చాటుకోని హోం మంత్రుల వారసులు

ఆ కుటుంబాల నుంచి చట్టసభకు ఎంపిక కాని తర్వాతి తరం

హోం మినిస్టర్‌... ముఖ్యమంత్రి తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న పదవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలక నేతలకే హోం మినిస్టర్‌గా అవకాశం దక్కింది. అప్పట్లో ఆ పదవి చేపట్టిన వారిలో దాదాపు తెలంగాణకు చెందిన వారే అత్యధికులు. కాలక్రమేణా ప్రాధాన్యతల్లో మార్పుల నేపథ్యంలో లా అండ్‌ ఆర్డర్‌ విభాగం ముఖ్యమంత్రి వద్ద ఉంటున్నప్పటికీ ఆ పోస్టు పవర్‌ మాత్రం తగ్గలేదు.

అలాంటి కీలక పదవి చేపట్టి విజయవంతంగా ప్రస్థానం సాగించినప్పటికీ... వారి తర్వాతి తరం మాత్రం రాజకీయంగా ఒడిదుడుకుల్లోనే కొనసాగుతోంది. గత మూడు దశాబ్దాల చరిత్ర పరిశీలిస్తే హోం మంత్రులుగా పనిచేసిన నేతల కుటుంబాల నుంచి వచ్చిన తర్వాత తరం ఇంకా రాజకీయంగా ఓనమాలు నేర్చే స్థాయిలోనే ఉంది. 

ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో హోంమంత్రిగా పట్లోళ్ల ఇంద్రారెడ్డి పనిచేశారు. టీడీపీ నుంచి బయటికొచ్చిన తర్వాత రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన భార్య పి.సబితారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో చేరారు. తొలిదఫాలో గనులు, భూగర్భ వనరులు, జౌళి శాఖ మంత్రిగా... రెండోసారి వైఎస్‌ సీఎం అయ్యాక హోం మంత్రిగా కొనసాగారు. 2018 ఎన్నికల్లో మహేశ్వరం నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 2014 పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయనకు మరో అవకాశం రాలేదు. 

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ మంత్రివర్గంలో కుందూరు జానారెడ్డి హోంమంత్రిగా పనిచేశారు. ఆయన తనయుడు రఘువీర్‌రెడ్డి గత ఎన్నికల్లో టికెట్‌ ఆశించినా అవకాశం దక్కలేదు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డి చిన్నకుమారుడు జయవీర్‌రెడ్డి కాంగ్రెస్‌ తరఫున నాగార్జునసాగర్‌ అసెంబ్లీ బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు మంత్రివర్గంలో హోం మంత్రిగా ఎలిమినేటి మాధవరెడ్డి కొంతకాలం కొనసాగారు. ఆ తర్వాత పోర్ట్‌ పోలియో మారి పంచాయతీరాజ్‌ మంత్రిగా వ్యవహరించారు. మందుపాతర పేలిన ఘటనలో ఆయన మరణించడంతో భార్య ఉమా మాధవరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె కూడా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది కొంతకాలం మంత్రిగా పనిచేశారు. కానీ ఆ తర్వాత ఆ కుటుంబం 
నుంచి చట్టసభల్లోకి వారసులెవరూ రాలేదు. కానీ ఆమె కుమారుడు సందీప్‌రెడ్డి స్థానిక సంస్థల్లోకి ఎంట్రీ ఇచ్చి యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మన్‌గా ఉన్నారు.  

 చంద్రబాబు మంత్రివర్గంలో చక్రం తిప్పిన నేత తూళ్ల దేవేందర్‌గౌడ్‌. బాబు మంత్రివర్గంలో హోం మంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు వీరేందర్‌గౌడ్‌ ఉప్పల్‌ అసెంబ్లీ స్థానం నుంచి, చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా, ఆయనకు అవకాశం దక్కలేదు. 

 కేసీఆర్‌ మంత్రివర్గంలో అనూహ్యంగా చోటు దక్కించుకుని రెవెన్యూ శాఖ మంత్రిగా, హోంమంత్రిగా కొనసాగుతున్న మహమూద్‌ అలీ కూడా తనయుడు ఆజాం అలీని ప్రత్యక్ష రాజకీయాల్లో దింపే ప్రయత్నం చేశారు. మలక్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి బరిలో దింపేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన ప్రయత్నాలు విఫలమైనట్లు సమాచారం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్‌ తొలి మంత్రివర్గంలో హోంమంత్రిగా నాయిని నర్సింహారెడ్డి కొనసాగారు. ఆయన 2018 ఎన్నికల్లో అల్లుడు శ్రీనివాస్‌రెడ్డిని ముషీరాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంటు నుంచి బరిలో నిలిపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసి భంగపడ్డారు. 

-చిలుకూరి అయ్యప్ప

మరిన్ని వార్తలు